పచ్చ బీజేపీ ఎంపీలకు ప్రాధాన్యం తగ్గిందా?

By Uday Srinivas JM Feb. 21, 2020, 01:20 pm IST
పచ్చ బీజేపీ ఎంపీలకు ప్రాధాన్యం తగ్గిందా?

భారతీయ జనతా పార్టీలో పూర్వం నుంచి ఉన్న వారికంటే నిన్నా మెన్నా చేరిన ఆ ఎంపీలదే మొన్నటిదాకా హవా. మా మాటే.. బీజేపీ మాట, కేంద్ర ప్రభుత్వం మాట అన్నట్లుగా ఓ రేంజ్‌లో మాట్లాడేవారు. ప్రధాని, కేంద్రమంత్రులతో భేటీలు వేస్తూ హల్‌చల్‌ చేశారు. పార్టీ సమావేశాల్లోనూ అగ్రతాంబూలం వారిదే. అయితే ఏమైందో ఉన్నట్లుండి వారికి పార్టీలో ప్రాధాన్యత తగ్గినట్లు కనిపిస్తోంది. ఆ నాయకులెవరో కాదు.. టీడీపీ ప్లస్‌ బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, గరికపాటి మోహన్‌రావు. తాజాగా గురువారం విజయవాడలో జరిగిన ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఈ నలుగురు కనిపించలేదు. ఆహ్వానమే అందలేదా? లేక వారికి వారే హాజరుకాలేదా? అన్నది స్పష్టత లేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం.. స్థానిక నేతల ఆ నలుగురిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో కేంద్ర పెద్దలు తలంటినట్లు సమాచారం. దీంతో కొన్నాళ్లపాటు సైలెంటుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

బీజేపీలో చేరినప్పటి నుంచి సీఎం రమేశ్, గరికపాటి మౌనంగానే ఉంటున్నారు. ఇప్పటివరకు వారి వాయిస్‌ బయటికి వినపడింది లేదు. సీఎం రమేశ్‌ కొడుకు వివాహ కార్యక్రమాల్లో బిజీగా ఉండిపోతే.. గరికపాటి సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఇక సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీని ప్రతి విషయంలోనే వెనుకేసుకొస్తూ బీజేపీ తరఫున మాట్లాడుతూనే ఉన్నారు. టీజీ వెంకటేశ్‌ కూడా అంతే. ఇంగ్లిష్‌ మీడియం, మండలి రద్దు విషయాల్లోనూ టీడీపీ వాణినే వినిపిస్తున్నారు. అదే సమయంలో సుజనా అమరావతి రాజధానికి సపోర్ట్‌ చేస్తే.. టీజీ వికేంద్రీకరణకు మద్ధతు తెలిపారు.

వాస్తవానికి ఆ నలుగురు బీజేపీలోకి రావడం రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవరావు, పార్టీ నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి లాంటి వారికి ఇష్టం లేదు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి వారు ఏమీ మాట్లాడలేదు. అయితే అసంతృప్తి మాత్రం కొనసాగుతూనే ఉంది. సుజనా, టీజీ, సీఎం రమేశ్‌ అక్రమాలపై జీవీఎల్‌ నరసింహారావు అప్పట్లో రాజ్యసభ చైర్మన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. వారిని పదవుల నుంచి తొలగించాలంటూ లేఖ కూడా రాశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో వారితోనే కలసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వారిపై వ్యతిరేకత మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టిన వారికి, టీడీపీ హయాంలో దోపిడీ చేసినవారికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని జాతీయ నేతలకు జీవీఎల్‌ వివరించినట్లు తెలుస్తోంది. కేంద్ర స్థాయిలో చక్రం తిప్పి క్రమంగా వారికి ప్రాధాన్యత తగ్గించారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp