TDP Leaders - దసరా రోజున స్టేట్మెంట్లు.. ఇవి అంతకు మించి..

By Aditya Oct. 16, 2021, 07:00 pm IST
TDP Leaders - దసరా రోజున  స్టేట్మెంట్లు.. ఇవి అంతకు మించి..

ఇన్నేళ్ళూ దసరా సంబరాల్లో పగటి వేషాలను చూశాం. ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుల పగటి కలలను విన్నాం. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీయే. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోంది. వైఎస్సార్ సీపీకి బుద్ది చెప్పడానికి జనం సిద్దంగా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ గతంలో టీడీపీ హయాంలో అమలు చేసినవే. అందులో పదో వంతు కూడా జగన్మోహనరెడ్డి సర్కారు అమలు చేయలేక పోతోంది. ఇది చేతకాని, దద్దమ్మ, అసమర్థ ప్రభుత్వం. ఇవీ ఈ దసరా సందర్భంగా తెలుగుదేశం నాయకులు చేసిన వ్యాఖ్యలు. అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, యనమల, దేవినేని ఉమ, చినరాజప్ప ఇంకా ఇతర నాయకులు ఈ విధంగా ఎడాపెడా స్టేట్ మెంట్ లు ఇచ్చి హమ్మయ్యా ప్రతిపక్ష నేతలుగా తమ వంతు కర్తవ్యం నెరవేర్చేశామని మురిసిపో యారు.

యథా లీడర్.. తథా కేడర్

హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగులతో పార్టీని నడిపేస్తున్నానని చంద్రబాబు భావిస్తుంటే నేతలేమో ఇలా వ్యవహరిస్తున్నారు. ఇక కార్యకర్తలైతే పార్టీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ఇనిస్టెంట్ గా స్పందించి చేతులు దులుపుకుంటున్నారు. గడచిన ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీ పరిస్థితి ఇలా అఘోరిస్తుంటే అధికారంలోకి వస్తామని బడాయిలు పోవడమే విడ్డూరం!

Also Read : Amalapuram Ex MLA - జెడ్పి పీఠంపై ఆశతో జెడ్పిటిసిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్..!

తిట్లు, శాపనార్థలే పెట్టుబడి..

ముఖ్యమంత్రిని ఘాటైన, అనాగరికమైన పదజాలంతో దూషిస్తే మీడియాలో ప్రచారం దొరుకుతుందనే ఉద్దేశంతో టీడీపీ నేతలు లేని ఆవేశం తెచ్చుకుని ఊగిపోతున్నారు. అసంబద్ధంగా, వాస్తవానికి మరీ దూరంగా ఉంటున్న వీరి ప్రకటనలను జనం ఏ విధంగా నమ్ముతారు అని కూడా ఆలోచించడం లేదు. ఇటీవల పార్టీ సీనియర్ నాయకుడు యనమల చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. టీడీపీ హయాంలోని ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని జగన్మోహనరెడ్డి ప్రభుత్వం పేరు మార్చి అమ్మ ఒడిగా అమలు చేస్తోందని, అదికూడా సమర్థంగా నిర్వహించలేక పోతోందని చెప్పారు. ఈ ప్రకటన ఎవరైనా నమ్ముతారా? యనమల చెప్పే ఈ రెండు పథకాల మధ్య వ్యత్యాసం నక్కకు, నాగలోకానికి ఉన్నంత ఉంది. లక్షలాది మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా అమ్మ ఒడి సొమ్ము జమ అయిన విషయం తెలిసిందే. అప్పటిలో ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కావడానికి ఎంత సమయం పట్టేదో.. ఎన్ని అవస్థలు పడవలసి వచ్చేదో అందరికీ విదితమే. పైగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశ పెట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అటువంటప్పుడు టీడీపీ నేతల స్టేట్మెంట్లకు విలువే ముంటుంది?

ప్రతిపక్ష పాత్ర పోషించినదెప్పుడు?

ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది మొదలు ఎప్పుడు మళ్లీ అధికారంలోకి వద్దామన్న ఆతృత తప్ప అందుకు చేసిన కృషి ఏది? ఈ రెండున్నరేళ్లలో ప్రజల తరఫున ఫలానా సమస్యపై పోరాటం చేశాము అని చెప్పుకోవడానికి ఒక్క అంశమైనా ఉందా? 1994 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కాంగ్రెసును జనం చిత్తుగా ఓడించారు. అయినా డీలా పడకుండా కేవలం 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెసు అసెంబ్లీ లోపల, బయట స్పూర్తి వంతమైన పోరాటం చేసింది. 1999 నుంచి 2004 వరకు ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించి ప్రజల మన్ననలు పొంది కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. ఆయన తనయుడు జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నేతగా 2014 నుంచి 2019 వరకు పలు ప్రజా సమస్యలపై చరిత్రాత్మక పోరాటాలు చేసి వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకువచ్చారు. అధికారంలోకి రావడానికి అటువంటి రాచబాట ఉండగా ఇలాంటి అడ్డగోలు విన్యాసాలు ఎందుకో టీడీపీ నేతకే తెలియాలి.

Also Read : Mangalagiri Lokesh లోకేష్ ఇలాఖాలో టీడీపీకి షాక్.. ఎంపీపీ డౌటే?

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాలతో బాటు మరెన్నో జనహిత పథకాలతో దూసుకుపోతున్న జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చాలాసార్లు రుజువైంది. అయినా తమ పంథా మార్చు కోకుండా ప్రకటనల యుధ్ధంతోనే అధికారంలోకి వస్తామని టీడీపీ నేతలు పచ్చటి పగటి కలలు కంటుంటే ఎవరు మాత్రం డిస్ట్రబ్ చేస్తారు!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp