చంద్రబాబు ఆన్‌లైన్‌ మార్కులు.. 30/175

By Jaswanth.T Sep. 27, 2020, 09:17 am IST
చంద్రబాబు ఆన్‌లైన్‌ మార్కులు.. 30/175

ఎక్కడైనా వందకు వంద మార్కులు రావడం చూసి ఉంటాం. కడాకరికి నూటికి 35 మార్కులు వచ్చి గడాగడీగా పాసైన వారిని కూడా చూసి ఉంటాం. కానీ 175కి 30 మార్కులు మాత్రమే వస్తే సదరు కేండేటు పాసైనట్టా, ఫెయిల్‌ అయినట్టా.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా ఇదే చర్చ సాగుతోంది.

రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151, టీడీపీ 23, జనసేన 1 అసెంబ్లీ స్థానాన్ని గెల్చుకుంది. అత్యధిక సీట్లు గెల్చుకున్న వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టి సంక్షేమ బాటలో దూసుకుపోతోంది. సహజంగా అధికారం చేపట్టిన ఏ పార్టీ అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బిజీబిజీగానే ఉంటుంది.

అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ తన లోపాలను సమీక్షించుకుని, భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసుకునే పనిలో ఉంటూనే ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతుంటుంది. ఇందుకు ఆయా పార్టీల్లోని ముఖ్య నేతలు ముందుండి నడిపిస్తుంటారు. కానీ ఏపీలో పరిస్థితికి ఇందుకు పూర్తి భిన్నంగా కన్పిస్తోందన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. ఎందుకంటే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిన నాటి నుంచి కరోనా వంకన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌బాబులు ట్విట్టర్, జూమ్‌లకే పరిమితమైపోయారు.

అలాగే 175 నియోజకవర్గాల్లోని తెలుగుదేశం పార్టీ కీలక నాయకులను జూమ్‌ మీటింగ్‌ద్వారానే పలకరిస్తున్నారు. ఇందుకోసం ప్రతి మంగళవారం షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాన్ని కూడా నిర్దేశించుకున్నారట. ఆయా నియోజకవర్గాల నుంచి రమారమీ రెండొందలకుపైగా నాయకులను ఈ విధంగా జూమ్‌లోకి ఆహ్వానిస్తున్నారని సమాచారం. అయితే ఈ మహత్కార్యం మొదలెట్టిన మొదటి సారి పూర్తిస్థాయి అటెండెన్స్‌ ఉండగా, ప్రస్తుతం యాభైమందికి అటూ ఇటూగానే హాజరవుతున్నారని సొంత పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు.

అయితే ఇందులో ఆయా నియోజకవర్గాల టీడీపీ ఇన్‌ఛార్జిలు కేవలం 30 మంది వరకు మాత్రమే ఉంటున్నారట. అంటే 175 నియోజయవర్గాలకుగాను 30 మంది మాత్రమే చంద్రబాబు మాటలు వినేందుకు ముందుకొస్తున్నారట. ఇక ఆయన చెప్పింది చెప్పినట్టు చేసే వాళ్ళు పదిలోపే ఉంటున్నారన్నది చంద్రబాబు ప్రత్యర్ధుల మాటలను బట్టి అర్ధమవుతోంది. ఈ లెక్కన చంద్రబాబుకు ఆన్‌లైన్‌లో కూడా వస్తున్న మార్కులు 30/175 మాత్రమేనని తేలిపోయిందన్నది వారి వివరణ. ఒక పక్క జనానికి దూరం కాగా, మరో పక్క ఆన్‌లైన్‌లో కూడా సొంత పార్టీ నాయకులు చంద్రబాబును దూరం పెడుతున్నారన్నది కాస్త కష్టమైనా ఒప్పుకుని తీరాల్సిందేనని వారు చెబుతున్నారు.

క్షేత్రస్థాయిలో పటిష్టమైన నెట్‌వర్క్‌ ఉన్న పార్టీగా పేరున్న తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇంతగా ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నదానిపై విశ్లేషకులు చెబుతున్న మాటలు కూడా నమ్మశక్యంగా ఉంటున్నాయి. ఇప్పుడు జూమ్‌లోనూ, ట్విట్టర్‌లోనూ పోరాడండి, దూసుకుపొండి, దున్నేయండి, తాట తీసేద్దాం రండి, తోలొలిచేద్దాం పదండి అంటూ చంద్రబాబు రెచ్చగొట్టి వదిలేస్తారని, ఆ తరువాత తమ ఖర్మకు తమను వదిలేస్తారన్నది సొంత పార్టీ నాయకుల్లోనే మాట్లాడుకుంటున్నారట.

పోనీ ఆయన చెప్పింది విని బరువు బాధ్యలు భుజాన వేసుకుందామనుకున్నా గానీ తీరా ఎన్నికల సమయానికి టిక్కెట్టు ఎవరికో వలస నాయకుడికే దక్కుతుందని ఘంటాపథంగా చెబుతున్నారట. ఎందుకంటే గతంలో కూడా ఇదే చరిత్ర పునరావృతం అవుతోందన్నది వారి భావనగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఏదో చెప్పింది వినేసి, మన పని మనం చూసుకుందాం? అన్న రీతిలోనే ఆ మాత్రమైనా జూమ్‌ మీటింగ్‌కు హాజరవుతున్నారన్నది కోడైకూస్తోన్న టాక్‌. ఒక వేళ ఇదే నిజమైతే ఏపీలో కూడా టీడీపీ తిరిగి పుంజుకునే విషయంపై వారు పెదవి విరుస్తుండడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp