శ్రీకాకుళంలో మఠం భూములపై టిడిపి కన్ను: గుట్టుగా భూముల విక్రయాలు

By Jagadish J Rao Jul. 04, 2020, 09:50 am IST
శ్రీకాకుళంలో మఠం భూములపై టిడిపి కన్ను: గుట్టుగా భూముల విక్రయాలు

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో స్థానిక చిన్న బ్రాహ్మణవీధిలోని రాధామాధవస్వామి మఠం భూములపై టిడిపి నేతల కన్ను పడింది. అక్రమార్కుల ఒడిగట్టి గుట్టుగా ఆ భూములను అమ్మేందుకు సిద్ధపడ్డారు. అదికాస్తా బయటపడటంతో టిడిపి నేతల యావ్వారం బట్టబయలైంది. అధికారంలో లేనప్పుడే ఇలాంటి అక్రమాలకు పాల్పడేందుకు సిద్ధపడ్డ టిడిపి నేతలు...గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా దోచుకున్నారో తెలుస్తుంది. అయితే ఈ మఠం భూముల కాజేసేందుకు గత టిడిపి హయంలోనే మార్గం వేసుకున్నారు.

మఠం నిర్వహణ కోసం టెక్కలి మండలం గూగెం, డమర సరిహద్దు ప్రాంతాలతోపాటు నందిగాం మండలం గురువూరు తదితర చోట్ల వందల ఎకరాల భూములను పూరీ జగన్నాథ సంస్థాన్‌ నుంచి అప్పగించారు. గతంలో టెక్కలిని పాలించిన పర్లాఖిమిడి గజపతి రాజుల నుంచి కేటాయించిన ఈ భూముల బాధ్యతను 1885లో గోవింద్‌ చరణ్‌దాస్‌ గోస్వామికి అప్పగించారు.

డమర, గూగెం సరిహద్దు ప్రాంతాల్లో సర్వే నంబరు 261లో సుమారు 58 ఎకరాలు, సర్వే నంబరు 228, 229, 259 నంబర్లలో సుమారు 40 ఎకరాలతోపాటు నందిగాం మండలం గురువూరు ప్రాంతాల్లో వందల ఎకరాల భూముల నుంచి వచ్చే ఆదాయంతో స్వామికి నిత్య కైంకర్యాలు జరుగుతుండేవి. వీటితో పాటు పూర్వం పూరీ జగన్నాథస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అవసరమైన సదుపాయాలను ఈ భూముల నుంచి వచ్చే ఆదాయంతో సమకూర్చేవారు. కాల క్రమేణా గోవింద్‌ చరణ్‌ దాస్‌ గోస్వామి పూరీ జగన్నాథస్వామి సంస్థాన్‌కు వెళ్లిపోవడంతో ఈ భూములపై పర్యవేక్షణ కొరవడింది.  
 
గత ప్రభుత్వ హయాంలో నరసింగపల్లి, కిట్టాలపాడు గ్రామానికి చెందిన కొంత మంది టిడిపి కార్యకర్తలు ముందుగా భక్తుల అవతారం ఎత్తారు. ఆ తరువాత మెల్లగా భూములపై కన్నేశారు. దీంతో కొంత మంది రెవెన్యూ అధికారులను తమకు అనుకూలంగా మార్చుకుని వెబ్‌ల్యాండ్‌లో రికార్డులను తారుమారు చేసే పనిలో పడ్డారు. వీరి ప్రయత్నాలకు కొంత మంది రెవెన్యూ అధికారులు అండగా నిలవడంతో ఒక్కో ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎకరం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు విక్రయించినట్లు సమాచారం.ఈ విధంగా రూ.కోట్లు దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి.

వెబ్‌ల్యాండ్‌లో కొన్ని చోట్ల గోవింద్‌ చరణ్‌ దాస్‌ గోస్వామి పేరును చూపే విధంగా రికార్డులు తారుమారు చేసేశారు. సర్వే నంబర్లను సబ్‌ డివిజన్లుగా మార్చేసి కొనుగోలుదారుల పేర్లను వారసత్వంగా నమోదు చేసినట్లు భోగట్టా. ఈ విధంగా సుమారు 110 మందికి విక్రయించినట్లు తెలుస్తోంది. మఠం భూములను కొంత మంది టిడిపి కార్యకర్తలు గుట్టుచప్పుడు కాకుండా విక్రయించారంటూ తెలియడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. మఠానికి కేటాయించిన భూముల వివరాలు మొత్తం బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రాధామాధవ మఠం భూములు చేతులు మారడంలో మఠం నిర్వాహకుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మఠానికి చెందిన భూముల క్రయవిక్రయాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇన్ని వందల ఎకరాల అమ్మకాలు మఠం నిర్వాహకుల ప్రమేయం లేకుండా జరిగే అవకాశం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.

"టెక్కలిలో ఉన్న రాధామాధవ మఠానికి చెందిన భూములను విక్రయిస్తున్నట్లు గతంలో మా దృష్టికి వచ్చింది. అప్పట్లో మఠం నిర్వాహకుల వద్ద విషయం తెలుసుకున్నాం. ఎలాంటి విక్రయాలు జరగలేదని, మఠం భూముల పత్రాలు తమ వద్ద అందుబాటులో లేవంటూ దాట వేసే ప్రయత్నాలు చేశారు. రెవెన్యూ అధికారులను సంప్రదించగా తమ వద్ద పూర్తి స్థాయిలో పత్రాలు లేవంటూ చెప్పారు. మఠం భూములను దేవదాయ శాఖ ఆదీనంలోకి తీసుకునేలా 43 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపడతాం. మఠం భూముల విషయాన్ని  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం" అని సోంపేట దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ జి.ప్రసాద్‌ బాబు తెలిపారు.

ఇలా భూములు దోచుకొనే టిడిపి.. టిటిడి ఆస్తుల ప్రస్తుత ప్రభుత్వం పై అనేక ఆరోపణలు చేసింది. ఏమీ చేయకుండానే గత టిడిపి పాలనలో ఇచ్చిన ఉత్తర్వులపై చర్చిస్తేనే, టిడిపి‌ దాని ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. గతంలో సదావర్త భూములపై కన్నేసిన టిడిపి నేతలు...రాష్ట్రంలో ఎక్కడ..ఏ అంచున ఇలాంటి పురాతన ఆస్తులు, భూముల ఉంటే అక్కడ టిడిపి నేతలు గెద్దల్లా వాలిపోయి...ఆక్రమించుకునేవారు. అయితే ప్రస్తుతం వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం అలాంటి‌ అక్రమాలకు అడ్డుకట్ట వేసింది. గతంలో అక్రమించుకునే వాటిని కూడా బయటకు‌లాగుతున్నారు. అక్రమార్కులపై కొరడా ఝులుపిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp