అమరావతి భూ కుంభకోణంపై బొండా ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు

By Kotireddy Palukuri Oct. 29, 2020, 05:30 pm IST
అమరావతి భూ కుంభకోణంపై బొండా ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతిలో భూములు కొనుగోలు చేశామని టీడీపీ నేతలు పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే అక్కడ టీడీపీ నేతలు, చంద్రబాబు అనుచరులు, బినామీల పేరుతో భారీగా భూములు కొనుగోలు చేసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని 2015లో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై అప్పట్లో సాక్షి పత్రిక వరుసగా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. భూములు ఎవరు కొనుగోలు చేశారు..? ఎక్కడ..? ఏ సర్వే నంబర్‌..? ఎంత విస్తీర్ణం.. తదితర వివరాలతో సాక్షి బట్టబయలు చేసింది. ఈ వ్యవహారంపై అçప్పట్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడిన నాటి సీఎం చంద్రబాబు.. ‘కొంటె తప్పేంటి..?’ అంటూ ప్రశ్నించారు. భూములు కొన్నామని చంద్రబాబు తన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు.

నాడు చంద్రబాబు.. కొంటే తప్పేంటి అనగా.. నేడు ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా అదే «ధోరణిలో మాట్లాడుతున్నారు. భూములు కొనకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలని వైసీపీ నేతలను బొండా ఉమా డిమాండ్‌ చేస్తున్నారు. ఏపీ రెవెన్యూ, క్రిమినల్‌ చట్టాలలో లేని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను వైసీపీ నేతలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. సెబీ కంపెనీ చట్టాల్లో ఉన్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను చూపించి అమరావతిని చంపాలని ప్రయత్నిస్తున్నారని బొండా ఉమా సరికొత్త విషయం చెప్పారు.

బొండా ఉమా చెప్పిన విషయాన్నే అమరావతిలో జరిగిన భూ కుంభకోణంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చెప్పారు. స్టాక్‌ మార్కెట్‌లో జరిగే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ మాదిరిగానే.. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే టీడీపీ నేతలు అక్కడ భూములు కొన్నారని ప్రజలకు అర్థమయ్యే విధంగా పోల్చి చూపారు. అయితే అసలు విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా.. ఏపీ రెవెన్యూ, క్రిమినల్‌ చట్టాలలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనే పదం లేదు కాబట్టి.. భూములు కొనడం నేరం కాదనే విధంగా బొండా ఉమా మాటలున్నాయి. బొండా ఉమ మాదిరిగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా.. రాజధాని ప్రకటించక ముందే అమరావతిలో భూములు కొనడం నైతికంగా తప్పు అవుతుంది కానీ.. చట్ట ప్రకారం నేరం కాదంటూ గతంలో తన కొత్త పలుకులో చెప్పుకొచ్చిన విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం.

మేము ఏం తప్పు చేయలేదని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించిన టీడీపీ నేతలు.. ఆ తర్వాత విచారణను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లారు. అమరావతి భూ కుంభకోణంపై ఎలాంటి దర్యాప్తు జరగకుండా స్టేలు తెచ్చుకోని.. మళ్లీ నేడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని చెప్పుకొస్తున్నారు. భూములు కొనకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలంటున్న బొండా ఉమా.. అలా భూములు కొనడం తప్పు కానప్పుడు ఎవరు..? ఎలాంటి విచారణ చేస్తే వచ్చే నష్టం ఏముంటుదని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారో ముందు చెప్పాల్సి ఉంటుంది. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిపి.. రైతుల వద్ద కారు చౌకగా భూములు కొనుగోలు చేసిన విషయం వెలుగులోకి వచ్చినప్పుడే అమరావతిని చంద్రబాబు చంపేశారనే వ్యాఖ్యలు వినిపించాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp