వినండి.. బొండా ఉమా స్వానుభవంతో చెబుతున్నారు..!

By Kotireddy Palukuri Oct. 22, 2020, 06:29 pm IST
వినండి.. బొండా ఉమా స్వానుభవంతో చెబుతున్నారు..!

స్వానుభవానికి మించిన జ్ఞానం మరెక్కడా దొరకదంటారు. అనుభవజ్ఞనులు చెప్పిన మాటకు కచ్చితంగా విలువుంటుంది. గతంలో వారు ఆయా పనులు చేసి నష్టపోతే తప్పా... సలహాలు ఇవ్వరు. అలా ఇచ్చిన సలహాలు పాటిస్తే.. ఇతరులు నష్టపోకుండా ఉంటారు. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా స్వానుభవంతో కొన్ని అంశాలు చెబుతున్నారు. చెప్పడమే కాదు వైసీపీ ప్రభుత్వాని హెచ్చరిస్తున్నారు. రైతులను క్షోభ పెట్టిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. అమరావతినే ఎకైక రాజధానిగా ఉంచాలని, మూడు రాజధానులు వద్దంటూ అమరావతిలోని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే కోణంలో బొండా ఉమా పై వ్యాఖ్యలు చేశారు.

ఒక రాజధానా..? లేక మూడు రాజధానాలా..? అనే అంశం పక్కనబెడితే.. బొండా ఉమా చేసిన హెచ్చరికల్లో వాస్తవం ఉంది. ఎందుకంటే రైతులను వంచిస్తే, క్షోభ పెడితే ఎలా బుద్ధి చెబుతారో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా రాజధాని ప్రాంతమైన విజయవాడలో పోటీ చేసి ఓడిపోయిన ఉమాకు బాగా తెలుసు. 2014 ఎన్నికల్లో రైతుల పంట రుణాలు, బంగారు రుణాలు భేషరతుగా మాఫీ చేస్తానని నొక్కి వక్కాణించిన నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేసారో.. రైతులతో సహా రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా టీడీపీ నేతలకు బాగా తెలుసు. పైగా బాబు హామీలకు టీడీపీ నేతలే సాక్షులు. రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన టీడీపీకి 2019 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలిసిన విషయమే.

అమరావతిని సింగపూర్‌ చేస్తా, అమెరికా చేస్తానంటూ.. చంద్రబాబు చెప్పినా.. భూముల ధరలకు పెరిగినా.. అమరావతి ప్రాంత ప్రజలు బాబును గెలిపించలేదు. మంగళగిరిలో పోటీ చేసిన బాబు తనయుడు లోకేష్‌ను ఓడించి.. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఓటమి చవిచూసిన నేతగా లోకేష్‌కు రికార్డు ఇచ్చారు. అందుకే గతాన్ని గుర్తుపెట్టుకున్న బొండా ఉమా.. తాజాగా వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. బొండా ఉమా వ్యాఖ్యలు ప్రస్తుత సందర్భానికి సరిపోతాయా..? లేదా..? అనేది 2024 ఎన్నికల్లోగాని స్పష్టంగా తెలియదు. అప్పటి వరకూ ఇలా శాపనార్థాలు, హెచ్చరికలు చేస్తూనే ఉండాల్సిన పరిస్థితి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp