నోటిదురుసు.. తలబిరుసు..! తప్పుడు కేసులైతే.. అజ్ఞాతవాసమెందుకు కూన..?

By Ramana.Damara Singh Apr. 15, 2021, 09:50 pm IST
నోటిదురుసు.. తలబిరుసు..! తప్పుడు కేసులైతే.. అజ్ఞాతవాసమెందుకు కూన..?

ఆయన ఒత్తిడితోనే నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు.. సమయం వస్తే ఆయన్ను ఆమదాలవలస నడిరోడ్డుపై బట్టలూడదీసి కొడ్తాను.. స్పీకర్ లాంటి రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న తమ్మినేని సీతారాంను ఉద్దేశించి మాజీ ప్రభుత్వ విప్, టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ చేసిన దారుణ వ్యాఖ్యాలివి.

ఇటువంటి వ్యాఖ్యలతో నమోదైన కేసులోనే పోలీసులకు లొంగిపోయి.. బెయిల్ పొందిన ఆయన.. కోర్టు బయటే ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా తన నోటి దురుసును, తలబిరుసు తనాన్ని మరోమారు ప్రదర్శించారు.

డీఎస్పీని దూషించిన కేసులో..

పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజు రాత్రి శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి గ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తమ్మినేని మురళీకృష్ణ ఇంటిపై కూన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న డీఎస్పీ మహేందర్ తో కూన వాగ్వాదానికి దిగారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై డీఎస్పీ మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొందూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

తనను అరెస్టు చేస్తారని భయపడిన రవికుమార్ వారం రోజులుగా పరారీలో ఉన్నారు. గురువారం ఉదయం పొందూరు స్టేషన్లో లొంగిపోయి.. రాజాం కోర్టులో బెయిల్ పొందారు. ఈ సందర్బంగా కూన మీడియాతో మాట్లాడుతూ తమ్మినేని సీతారాం రాజ్యాంగ బద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నారన్న ధ్యాస, ఆ పదవికి గౌరవం ఇవ్వాలన్న విచక్షణ కూడా లేకుండా నడిరోడ్డుపై ఆయన్ను బట్టలూడదీసి కొడతానని పరుషంగా మాట్లాడారు. తనపై రాజకీయ కక్షతో ఐదు తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు.

Also Read : తెల్లదొరలను మరిపిస్తున్న 'కళా'! మాజీ ఎంపీపీ ఆడియో వైరల్

అధికారులను దూషించడం తప్పు కాదా..

తనపై తప్పుడు కేసులంటూ కూన ప్రస్తావించిన ఐదూ గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న అధికారులను దూషించినవే. తాజాగా ఆయన బెయిల్ పొందిన కేసు విధి నిర్వహణలో ఉన్న డీఎస్పీని దూషించింది కాగా.. పొందూరులో అక్రమంగా మట్టి తరలిస్తున్న తన అనుచరులను పట్టుకున్న పాపానికి గతంలో సాక్షాత్తు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయిన పొందూరు తహశీల్దారునే కూన అనరాని మాటలన్నారు. 'బలిసిందిరా.. గొయ్యి తీసి పాతేస్తా' అని తీవ్రంగా హెచ్చరించారు. ఆ సందర్భంలోనూ ఆయన గారు పరారై కొన్నాళ్ళు అజ్ఞాతవాసం గడిపారు. తర్వాత బెయిల్ పొంది బయటకొచ్చారు.

ఇక పింఛన్ల మంజూరులో తన మాట మన్నించనందుకు సరుబుజ్జిలి ఎంపీడీవో, ఈవోపీఆర్డీలను వారి కార్యాలయంలో అందరు ఉద్యోగుల సమక్షంలోనే తూలనాడారు. తలుపులు మూసి తంతాను.. అడిగేవారు ఎవరు.. అని బెదిరించారు. గత ఆక్టోబరులో నరసన్నపేట పోలీస్ స్టేషన్లోనే గుంపులుగా లోపలికి రావద్దని సూచించిన పోలీసులను ' మళ్లీ అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తానని' హెచ్చరించారు.

పొందూరులో టీడీపీ కార్యాలయం ఉన్న భవనాన్ని ఖాళీ చేయమని కోరిన దాని యజమాని శివకుమార్ ను ఫోన్లో నానా బూతులు తిడుతూ ఖాళీ చేయం.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. అని రుబాబు చేశారు. ఈ సంఘటనలపైనే ఆయా అధికారుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదయ్యాయి. ఇవి ఎలా తప్పుడు కేసులవుతాయో కూన వారే చెప్పాలి. ఆయన తిట్టినా, కొట్టినా పడి ఉండాలని ఆయనగారి ఉద్దేశమేమో!

మొదటి నుంచీ తలబిరుసుతనం, వాచాలత్వం అధికం. ఎదుట ఉన్నవారి స్థాయి గౌరవ మర్యాదలు ఆయనకక్కర్లేదు. తన మాట చెల్లకపోయినా.. ఎదురు చెప్పినా సహించారు. ఒంటికాలిపై లేస్తారు. కస్సుమని కరిచేస్తారు. ఎంతటివారినైనా ఏకవచన సంబోధంతో తీసిపడేసినట్లు మాటలు విసిరేస్తారు. రాయలేని భాషలో తిట్లదండకం అందుకుంటారు. ఇవన్నీ తన జన్మహక్కు అనుకుంటున్నారేమో గానీ.. వాటిని ఎవరైనా ఎందుకు భరిస్తారు. దాని ఫలితమే ఈ కేసులన్న విషయం కూనవారు గ్రహిస్తే మంచిది. అవన్నీ తప్పుడు కేసులే అయితే నిలబడి పోరాడాలే గానీ.. భయపడి పారిపోవడం ఎందుకో.. రోజుల తరబడి అజ్ఞాతవాసమెందుకో.. ముందస్తు బెయిళ్ళు పొందడమెందుకో..!

Also Read : కూన తీరు మారునా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp