Kala Venkata Rao, TDP - మళ్లీ తొలి సంతకం హామీ.. నమ్మేదెవరు కళా..?

By Karthik P Nov. 26, 2021, 02:00 pm IST
Kala Venkata Rao, TDP - మళ్లీ తొలి సంతకం హామీ.. నమ్మేదెవరు కళా..?

ప్రజలకు మరచిపోయే గుణం సహజంగా దేవుడు ఇచ్చాడంటారు. అది నిజమని టీడీపీ నేతలు బలంగా నమ్మినట్లుగా ఉన్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా మళ్లీ ఉచిత, మాఫీ.. హామీలను ఇప్పటి నుంచే ఇస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో 650 హామీలను ఇచ్చిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. హామీల అమలను అటకెక్కించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నమ్మడం వల్ల వచ్చిన నష్టం తాలూకు పరిణామాలను రైతులు, డ్వాక్రా మహిళలు, ఇతర వర్గాల ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. అయితే ప్రజలు అన్నీ మరిచిపోయారని భావించారో ఏమో గానీ టీడీపీ నేతలు మళ్లీ ఉచిత హామీలను గుప్పించడం మొదలు పెట్టారు.

తాజాగా టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు.. మీడియాతో మాట్లాడుతూ, పేదలకు కట్టించిన ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి పత్రాలను అందిస్తామని, చంద్రబాబు అధికారంలోకి రాగానే దీనిపైనే తొలి సంతకం చేస్తారని చెప్పుకొచ్చారు. పైగా ప్రభుత్వం నిర్ధేచించిన రుసుమును ఎవరూ చెల్లించవద్దని కూడా ఉచిత సలహా ఇచ్చారు. ఇవే మాటలు 2014 ఎన్నికల సమయంలోనూ టీడీపీ నేతలు మాట్లాడారు. ఇప్పుడు హామీ మారింది, సమయం మారింది.. కానీ టీడీపీ నేతలు మాత్రమే మారలేదు.

2014 ఎన్నికల సమయంలో 14,200 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికలకు ఆరు నెలల ముందే చంద్రబాబు హామీ ఇచ్చారు. మీరెవరూ రుణాలు కట్టవద్దని, తాను రాగానే మాఫీ చేస్తానని పదే పదే చెప్పారు. ఆ మాటలను టీడీపీ నేతలు ఊరు, వాడా చాటింపు వేశారు. బాబు మాటలను నమ్మిన కొంత మంది డ్వాక్రా మహిళలు.. తాము బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కట్టడం మానేశారు. మొత్తం మీద బీజేపీతో పొత్తు, జనసేన మద్ధతు, డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ వంటి 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.

Also Read : Tdp ,Butchaiah - అవగాహన లేకుండా విమర్శలేల బుచ్చయ్య..?

ముఖ్యమంత్రి అవగానే రైతు రుణాలపై తొలి సంతకం చేస్తానని చెప్పారు. కానీ బాబు హామీ ఇచ్చినట్లు రైతు రుణాల మాఫీపై తొలి సంతకం చేయలేదు. ఐదేళ్లలో మూడు విడతలుగా 87 వేల కోట్ల రూపాయల రుణాలకు గాను.. కేవలం 12 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసి.. రైతు రుణమాఫీ చేసేశానని చెప్పుకొచ్చారు. ఇక డ్వాక్రా సంఘాల పరిస్థితి మరింత దారుణం. రుణమాఫీ హామీని పూర్తిగా మాఫీ చేశారు. ఫలితంగా బాబు మాటలు విని రుణాలు కట్టని డ్వాక్రా సంఘాల మహిళలు ఎగవేతదారులుగా మారిపోయారు. బ్యాంకులు అపరాధ రుసుము, చక్రవడ్డీతో కలిపి మహిళల ఇళ్లకు నోటీసులు పంపి మరీ ముక్కుపిండి వసూలు చేశాయి. రైతులకు కూడా ఇలాగే నోటీసులు పంపి.. తీసుకున్న రుణాలను చక్రవడ్డీతో కలిపి వసూలు చేశాయి.

ఇది జరిగి దశాబ్ధాలు కాలేదు. రెండున్నరేళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ఐదేళ్లలో జరిగిన తంతు ఇది. ఇలా ప్రజలను మోసం చేయడంతోనే చంద్రబాబును ప్రజలు ఘోరంగా ఓడించారు. జగన్‌కు పట్టం కట్టారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన ప్రతి హామీని జగన్‌ అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇళ్లపై వారికి ఎలాంటి హక్కులు లేవు. కేవలం నివాసం ఉండేందుకు మాత్రమే అవి ఉపయోగపడుతున్నాయి. వాటిని రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తే.. వారికి అదొక ఆస్తిగా ఉంటుందని, అవసరమైతే బ్యాంకులో కుదువ పెట్టి రుణం తీసుకునే అవకాశం వస్తుందని.. జగన్‌ సర్కార్‌ సాధారణ రుసుముతో గృహాల రిజిస్ట్రేషన్‌ పథకాన్ని తెచ్చింది. అయితే మళ్లీ ప్రజలను కష్టాల కడలిలోకి నెట్టేందుకు కళా వెంకట రావు వంటి టీడీపీ నేతలు.. ఉచిత హామీలు ఇస్తూ.. తొలి సంతకం అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. రెండున్నరేళ్ల కిత్రం టీడీపీ చేసిన మోసాన్ని మరిచిపోని ప్రజలు.. కళా మాటలను నమ్ముతారా..?

Also Read : Registration Services, Village Secretariats - 51 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు.. ఏపీ సర్కార్‌ కీలక ముందడుగు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp