అవగాహనా రాజకీయం

By Suresh 16-11-2019 09:15 AM
అవగాహనా రాజకీయం

సోదికి పొతే పాత సంబంధాలు బయటపడ్డాయంట!ఇలాగే ఉంది టీడీపీ-జనసేన పరిస్థితి. జగన్ ఏమో పాట్నర్ అంటాడు,మరికొందరు ప్యాకేజి అంటారు,వాటిని జనసేన తిప్పికొడుతోంది. కానీ వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసిన తరువాత చేస్తున్న కామెంట్లతో టీడీపీ-జనసేన అవగాహనా రాజకీయాల మీద వస్తున్న ఆరోపణలకు ఊతం ఇస్తున్నాయి.

టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిన్న ఓ టీవీ డిబేట్ లో మాట్లాడుతూ గత ఎలెక్షన్ లో పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ తరుపున పోటీ చేసిన సీపీఐ కాండేట్ బీ ఫార్మ్ నాకే ఇచ్చారు, అంటే మిత్రపక్షమనే కదా?. పవన్ కళ్యాణ్ పైకి కనపడేంత ఫెయిర్ కాదు అని అన్నారు. పొత్తుపెట్టుకున్న పార్టీలు కూడా ఎవరి అభ్యర్ధికి వాళ్ళే బి-ఫారం ఇచ్చుకుంటారు కానీ జనసేన మాత్రం నీకు నచ్చిన అభ్యర్థిని మాపార్టీ తరపున పెట్టుకో అని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికే బి-ఫారం ఇవ్వటం అవగాహనా రాజకీయాలకు పరాకాష్ట. సాధారణంగా పోలింగ్ బూత్ లో తమకు అనోకూలంగా ఉంటారని బలమైన అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు,ఉనికిలేని ఇతర పార్టీల తరపున డమ్మీ అభ్యర్థులను బరిలోకి దించుతారు. కానీ ఇక్కడ వంశీకి జనసేన బి-ఫారం ఇవ్వటాన్ని చూస్తే జనసేన పోటీ కూడా దాని పోటీ అనుకోవాలి.

గన్నవరంలోనే కాదు అనేక ఇతర స్థానాలలో కూడా టీడీపీ-జనసేన అవగాహ రాజకీయాలు చేశాయి. గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ ని గెలిపించడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను బలిపశువు చేస్తున్నాడని అందుకే చంద్రబాబు గాజువాక ప్రచారానికి రావటంలేదని టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు పలువురు టీడీపీ పెద్దలని కలిసి మొరపెట్టుకున్నా చంద్రబాబు నుండి స్పందన లేదు. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు టీడీపీ,పవన్ కళ్యాణ్ను ఓడించి వైసీపీ తరపున తిప్పలు నాగిరెడ్డి గెలిచారు. పల్లా శ్రీనివాస్ తండ్రి సింహాచలం టీడీపీ మాజీ మంత్రి. పల్లా శ్రీనివాస్ ప్రజారాజ్యం తరుపున విశాఖ ఎంపీగా పోటీచేసి కాంగ్రెస్ తరపున పోటీచేసిన పురందేశ్వరి మీద 60,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధీ మూడోస్థానానికి పరిమితమయ్యాడు. ఇంత బలం ఉన్న పల్లా శ్రీనివాస్ ఓటమికి ప్రధాన కారణం చంద్రబాబు-పవన్ కళ్యాణ్ అవగాహన రాజకీయాలే అనటంలో సందేహం లేదు.

మోడీ,రాహుల్ మీద పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ లాగా పవన్ కళ్యాణ్ పులివెందుల లేక కుప్పం నుంచి పోటీచేస్తాడని ఎవరు అనుకోలేదు కానీ రాజధాని ప్రాంతంలో అది రైతుల కోసమని రెండుసార్లు పర్యటించిన ప్రాంతంలోని మంగళగిరి నుంచి పోటీచేసుంటే అనేక ఆరోపణలకు సమాధానం ఇచ్చినట్లుండేది. 2009లో ప్రజారాజ్యం అభ్యర్థి మంగళగిరిలో రెండవస్థానంలో నిలవగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.నాదెండ్ల మనోహన్ తెనాలి నుంచి ,పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఉంటె గెలుపు కోసం గట్టి ప్రయత్నం అయ్యుండేది.

సత్తెనపల్లిలో కేవలం కోడెల శివప్రసాద్ ను గెలిపించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డిని ఎన్నికల ముందు జనసేనలో చేర్చుకొని టికెట్ ఇచ్చారు. సుమారు 15,000 సొంత వోటింగ్ ఉన్న యర్రం వెంకటేశ్వర రెడ్డి కనీసం 25,000 ఓట్లు సాధిస్తే అంబటి రాంబాబు ఓడిపోయి కోడెల గెలుస్తాడని ప్రచారం జరిగింది. దీనితో యర్రం వెంకటేశ్వర రెడ్డి ప్రచారానికి సొంత వర్గం దూరంగా ఉన్నారు. కొమెరపూడి అనే గ్రామంలో "టీడీపీతో , కోడెలతో కుమ్మక్కు కాలేదని గ్రామ బొడ్డురాయి మీద ప్రమాణం చేసి ఊర్లోకి రావాలని" యర్రం వెంకటేశ్వర రెడ్డిని గ్రామస్తులు డిమాండ్ చెయ్యగా ప్రమాణం చెయ్యకుండా యర్రం వెంకటేశ్వర రెడ్డిని వెనుదిరిగారు.ఈ సంఘటనతో టీడీపీ-జనసేన అవగాహనా రాజకీయాలు అర్ధమైన ప్రజలు,జనసేన అభిమానుల్లో కొందరు కోడెల ఓటమే లక్ష్యంగా వైసీపీకి ఓట్లు వేశారు.

జనసేన బాగా ఊపేస్తుందనుకున్న ఉత్తరాంధ్రలో కూడా ఇదే పరిస్థితి.1985లో టీడీపీ తరుపున విశాఖ-1 నుంచి గెలిచిన అల్లు భానుమతి మనవడికి మాడుగుల టికెట్ ఇస్తానని చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నవారిని జనసేనలో చేర్చుకున్నారు. కానీ ఎన్నికల ముందు జనసేన మాడుగుల టికెట్ భానుమతి మనవడికి కాకూండ టీడీపీ తరపున పోటీ చేస్తున్న గవిరెడ్డి రామానాయుడి తమ్ముడు గవిరెడ్డి సన్యాసి నాయుడికి ఇచ్చారు. అక్కడ టీడీపీ అభ్యర్థిని గెలిపించటానికే జనసేన తరపున డమ్మీ అభ్యర్థిని పోటీకి పెట్టారని, ప్రశాంతంగా జీవిస్తున్న తమని రాజకీయాల్లోకి ఈడ్చిమోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి ఆరోపించారు.

గత ప్రభుత్వ కాలంలో నాలుగేళ్లు ఏ రోజూ టీడీపీ పాలనని కానీ , హామీల అమలు పై కానీ , ఇసుక దోపిడీ పై కానీ ప్రశ్నించకుండా ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షాన్ని విమర్శించడం , కేవలం బాబు ప్లాన్ ప్రకారం జగన్ ని జనసేన టార్గెట్ చేసింది అని జనం నమ్మటానికి కారణమయ్యింది . అందుకే టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేసినా ఈ రెండు పార్టీలు ఒక్కటే అని జనం నిశ్చయించుకొని జనసేన మద్దతుదారులు కూడా టీడీపీ ఓటమి కోసం వైసీపీకి ఓటువేశారని చెప్పొచ్చు.

ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ లోపాల్ని విమర్శించాల్సిన చంద్రబాబు ఆ పని ఒక్కటి చేయబోతే తన గత పాలనలోని వంద తప్పుల్ని ఎత్తి చూపుతున్న వైసీపీ ధోరణికి జనంలో మరింత పలచన అవుతున్న సమయంలో ఒకరకమైన ద్వేషంతో వైసీపీ ని విమర్శించడానికి పూనుకొన్న పవన్ మరోసారి చంద్రబాబుకి ఆయాచిత వరమయ్యాడు.పవన్ వైజాక్ లాంగ్ మార్చ్ కి టీడీపీ మద్దతు ఇవ్వడం గానీ , ఇసుకలో టీడీపీ నేతలు దోచుకున్నారు అని ఎన్నికల ముందు ఆరోపించిన పవన్ వద్దకే తన ఇసుక దీక్షకి మద్దతు ఇవ్వమని సీనియర్ నేతలు అచ్చన్నాయుడు , అయ్యన్నపాత్రుడులని పంపి మద్దతు తీసుకోవడం కానీ చూసిన ప్రజలెవ్వరైనా ఇరు పార్టీలు కుమ్మక్కు అయ్యారని నమ్మే పరిస్థితి పవన్ నే కల్పించుకొన్నాడు అంటే అతిశయోక్తి కాదేమో!

ఇప్పటి వరకు ఉన్న ఆరోపణలకు నిన్న వంశీ చెప్పిన అంశం తోడవటంతో టీడీపీ తో జనసేన అవగాహనా రాజకీయం నడిపింది రుజువైనట్లే. ఒక్కో ఎన్నికలో ఒకరితో పొత్తుపెట్టుకొని వాళ్ళను వాడుకొని వొదిలేశామని నిన్న వంశీ అన్న మాటలను అర్ధం చేసుకొని సొంత రాజకీయాలు చేస్తే టీడీపీతో విసిగిపోయి ఉన్న వాళ్ళన్నా జనసేన మద్దతుదారులుగా మారటానికి అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News