ఆ కార్పొరేషన్ గెలుపుపై టీడీపీ నేతల ధీమా ఎందుకు..?

By Karthik P Feb. 20, 2020, 01:34 pm IST
ఆ కార్పొరేషన్ గెలుపుపై టీడీపీ నేతల ధీమా ఎందుకు..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం గత నెలలోనే మొదలైంది. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికార వైఎస్సార్‌సీపీ జెండా ఎగురుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ నేతలు కూడా గెలుపు కష్టమేనన్న భావనకు వచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దాదాపు 1.30 లక్షల మందికి ఉద్యోగాలు, దాదాపు 4 లక్షల మందికి ఐదు వేల గౌరవ వేతనంతో వాలంటీర్‌ పోస్టులు ఇవ్వడంతో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ ఖాయమనే మాట గట్టిగా వినపడుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిస్తేజంలో ఉండగా.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాత్రం ఉత్సాహంగా ఉన్నారు. మళ్లీ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థను గెలుచుకుంటామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా మారిన తర్వాత గత మూడు పర్యాయాలు కూడా రాజమహేంద్రవరం కార్పొరేషన్‌పై టీడీపీ జెండాయే ఎగిరింది. 2014లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో 50 డివిజన్లకుగాను వైఎస్సార్‌సీపీ కేవలం 7చోట్లనే గెలిచింది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఒకరు, బీజేపీ తరఫున ఒకరు, స్వతంత్రులు ఐదు చోట్ల నెగ్గారు.

వరుసగా నాలుగోసారి కూడా కార్పొరేషన్‌ను గెలుస్తామని టీడీపీ నేతలు గంటా పథంగా చెబుతున్నారు. టీడీపీ నేతలు ఈ ధోరణిలో ఉండడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. ఒకటి.. రాజమహేంద్రవరం నగరపాలకసంస్థలో టీడీపీకి బలమైన కేడర్‌తోపాటు ఓటు బ్యాంకు ఉంది. రెండోది.. వైఎస్సార్‌సీపీకి ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలమైన కేడర్‌ లేదు. మూడోది.. వైఎస్సార్‌సీపీలో నేతల మధ్య కుమ్ములాటలు. ఈ మూడు కారణాల వల్ల ఈ సారి కూడా కార్పొరేషన్‌పై పసుపు జెండా ఎగురువేస్తామని ఆ పార్టీ నేతలు నొక్కి వక్కాణిస్తున్నారు.

గడిచిన ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిసింది. రూరల్‌ నుంచి సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు, దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని గెలుపొందారు. కార్పొరేషన్‌లో ఉన్న 50 డివిజన్లకు గాను 8 డివిజన్లు రాజమహేంద్రవరం రూరల్‌ అసెంబ్లీపరిధిలోనివి. రాజమహేంద్రవరం నగరానికి చుట్టు పక్కలా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న 23 పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేసే ప్రతిపాదనలు గత ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయంపై కోర్టు కేసులు నడుస్తున్నాయి. 23 పంచాయతీలు రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాల పరిధిలోవి. పంచాయతీలు విలీనం అయితే 50 డివిజన్లు కాస్త 75కు పెరుగుతాయి.

రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి కార్పొరేషన్‌లో కలుస్తుంది. వైఎస్సార్‌సీపీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం ఎంపీగా మార్గానిభరత్‌లు ఇద్దరూ యువకులే. ఇక ఎన్నికల తర్వాత సిటీ కోఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు స్థానంలో ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శిఘాకోళ్లపు శివరామసుబ్రమణ్యంను నియమించారు. రూరల్‌ కోఆర్డినేటర్‌గా ఆకుల వీర్రాజు కొనసాగుతున్నారు. కో ఆర్డినేటర్‌ పదవి లేకపోయినా రౌతు సూర్యప్రకాశరావు పార్టీలో చురుకుగా ఉంటున్నారు. సిటీలో తన క్యాడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. 2014లో సిటీ ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున గెలిచిన ఆకుల సత్యనారాయణ 2019లో రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. ఎన్నికల అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరారు.

వైఎస్సార్‌సీపీలో నాయకులు దండిగా ఉన్నా వారి మధ్య సఖ్యత లేదని పరిశీలకులు చెబుతున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు, ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. ఇక సిటీ కో ఆర్డినేటర్‌ శిఘాకోళ్లపు శివరామసుబ్రమణ్యం, ఎంపీ భరత్‌ రామ్‌ల మధ్య సఖ్యత లేదు. రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు అటు ఎమ్మెల్యే రాజాతోపాటు, ఇటు ఎంపీ భరత్‌తోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రౌతు సూర్యప్రకాశరావుకు జక్కంపూడి వర్గానికి మొదట నుంచీ సత్సంబంధాలు లేవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో జక్కంపూడి వర్గం నగరంలో సహకరించకపోవడంతోనే రౌతు భారీ ఓటమిని చవిచూశారని చెబుతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ.. వ్యాపారవేత్తగా తన ప్రయోజనాలు కోసం అందరితోనూ సఖ్యతతో ఉంటున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు ఎవరికి వారే సొంతంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఒకరి కార్యక్రమంలో మరొకరు పాల్గొనడంలేదు.

అధికార పార్టీలో నేతలు, ప్రజా ప్రతినిధుల మధ్యకుమ్ములాటలు, ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో కేడర్‌ లేకపోవడం, తమకు ఉండడంతోనే టీడీపీ నేతలు కార్పొరేషన్‌ గెలుపుపై గట్టి ధీమాతో ఉన్నారు. టీడీపీలో కూడా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కుటుంబానికి, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిల మధ్య కూడా ఆది నుంచీ వర్గపోరు నడుస్తోంది. అయితే ఎన్నికలు వచ్చే సమయానికి ఎవరికి వారు పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తారని గత చరిత్ర చెబుతోంది. వైఎస్సార్‌సీపీ గెలుపునకు ఒకే ఒక్క మార్గం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్‌ సర్కార్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనే ఆ పార్టీ గెలుపు ఆధారపడి ఉందంటున్నారు. కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ విజయాన్ని జగన్‌ సర్కార్‌ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయా..? లేదా ఎప్పటిలాగే టీడీపీ జెండా ఎగురుతుందా..? వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp