మొన్న విశాలాంధ్ర.. నిన్న విభజితాంధ్ర.. నేడు వాజ్యాంధ్రా .

By Sanjeev Reddy Sep. 26, 2020, 06:10 pm IST
మొన్న విశాలాంధ్ర.. నిన్న విభజితాంధ్ర.. నేడు వాజ్యాంధ్రా .

రాజకీయ ప్రేరేపిత కేసులు, పిల్, పిటిషన్లు, స్టేలు కాదేదీ కోర్టు మెట్లకనర్హం. ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న ట్రెండ్ ఇదే . వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండి ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయాలకు, సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా దాదాపు ప్రతి రోజూ ఓ కేసు గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి . వీటిలో అగ్రభాగం టీడీపీ పార్టీ, ఆ పార్టీ నేతలు, వారి సంబంధీకులు వేసిన కేసులే ఎక్కువ. రోజురోజుకీ కాదేదీ కేసులకనర్హం అన్నట్టు తయారయ్యింది పరిస్థితి .

ఓ పక్క అవినీతి అక్రమాల కేసుల్లో విచారణ ఎదుర్కోబోతున్న పలువురు అధికారులు , నాయకులు కోర్టుల నుండి స్టేలు పొందుతుండగా , పాలనా కార్యకలాపాలకు, సంక్షేమ పధకాలకీ, ఇంగ్లీష్ మీడియం విద్య లాంటి విధాన మార్పులకు కోర్టులు ఇచ్చిన కొన్ని స్టేలు అడ్డుగోడల్లా నిలుస్తున్నాయి అని చెప్పొచ్చు. శాసనసభలో తీర్మానించబడి గవర్నర్ ఆమోదముద్ర పడిన నిర్ణయాలు సైతం స్టేటస్ కో ఆదేశాలతో అమలు కాక ఆగిపోగా ప్రభుత్వం ఈ అంశాల పై సుప్రీం కోర్టు మెట్లెక్కడం , అమరావతి భూ వివాదం పై స్టే ఇవ్వడంతో పాటు మీడియా కూడా ప్రస్తావించకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది అని చెప్పొచ్చు . ఈ అంశాల పై వైసీపీ ఎంపీలు ఇటీవల పార్లమెంట్ లో గళమెత్తగా, మీడియా ప్రతినిధులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని కలిసి తమ పై ఆదేశాలు వెనక్కి తీసుకోమని కోరడం తెలిసిన విషయమే .

వీటికి కొనసాగింపుగా నిన్న ముఖ్యమంత్రి, ఇరువురు మంత్రులు, టీటీడీ చైర్మన్, ఈవోలు ఏ అధికారంతో పదవుల్లో కొనసాగుతున్నారో వివరణ ఇవ్వాలని కోరుతూ రాజధాని అమరావతి పరిసరప్రాంత గ్రామమైన వైకుంఠపురం వాసి ఏ.సుధాకర్ బాబు హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు .

పిటిషన్ ఎవరైనా దాఖలు చేయొచ్చు, కానీ అది విచారణార్హమా కాదా అన్నది పరిశీలించి అడ్మిట్ చేసుకోవడమో లేదా అనర్హమైనదిగా నిర్ధారించి డిస్మిస్ చేయడమో జరుగుతుంది సహజంగా . రాజ్యాంగ బద్ద నియామకాలను ప్రశ్నిస్తూ దాఖలైన ఇలాంటి పిటిషన్ డిస్మిస్ కాకుండా దఖలుపడటం ఆశ్చర్యకరం. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ప్రజలు ఎన్నుకొన్న వారిని ఎన్నికల కమిషన్ నిర్ధారించిన తరువాత గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి ముఖ్యమంత్రికి, మంత్రులకు అధికార భాద్యతలు అప్పచెబుతారు. ఎన్నికల్లో కానీ, విజేతల నిర్ణయంలో కానీ అక్రమాలు జరిగిన సందర్భాల్లో, ఏదేని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప దీనిలో జోక్యం చేసుకొనే అధికారం మరో రాజ్యాంగ బద్ద వ్యవస్థ అయిన న్యాయ స్థానాలకు లేదనే చెప్పొచ్చు .

ఇప్పుడు పిటిషనర్ కోరిక మేరకు ఏ అధికారంతో పదవుల్లో కొనసాగుతున్నారో చెప్పాలి అంటే వారికా అధికారాలిచ్చిన ఎన్నికల కమిషనర్, గవర్నర్ లే సమాధానం చెప్పాలి. మరి ఈ పిటిషన్ విచారిస్తే వారిని కోర్టుకి పిలిపించాల్సి రావొచ్చు. పిలుస్తారా లేదా అన్నది ఆసక్తికరమైన విషయం . ప్రభుత్వాధికారులు కానీ, రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న నాయకులు కానీ ఏదేని ఒక నిబంధన లేదా చట్టాన్ని పాటించకపోవడమో, మీరడమో చేస్తే అది సవరింపబడేట్లు కోర్టు సూచనలు చేస్తుంది కానీ వారికి రాజ్యాంగ బద్దంగా లభించిన పదవులలో కొనసాగే అర్హతల విచారణ చేసే హక్కు అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో తప్ప ఇలాంటి విషయాల్లో కోర్టులకు రాజ్యాంగం కల్పించలేదు అనేది నిపుణుల మాట .

పిటిషనర్ ప్రధానంగా ప్రస్తావించిన అంశం డిక్లరేషన్. తిరుమల గుడికి అన్య మతస్తులు దర్శనార్థం వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి అనే నిబంధన జగన్ పాటించలేదు అని. ఈ విషయంలో పలు ప్రశ్నలు ఉద్భవిస్తాయి. ఈ నిబంధన ఎప్పటిది, అందులో పొందు పరిచిన అంశాలు ఏమిటీ అన్న వివరణ ఇంతవరకూ ఎక్కడా ప్రస్తావించబడలేదు . ఈ నిబంధన అన్య మతస్తులకయితే ఏ ఏ మతస్తులు అన్య మతస్తులుగా పరిగణింప బడతారు అన్నది కూడా ప్రశ్నర్థకమే.

గతంలో డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల స్వామి వారి దర్శనం చేసుకొన్న వారిలో పలువురు ప్రముఖులున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం భారత భూభాగం పై పుట్టిన కుల మతాలన్నీ హిందూ మతంగానే పరిగణించబడతాయి కాబట్టి వారిలో కొందరికి డిక్లరేషన్ అవసర్లేదు అని ఒక వాదన . కానీ భారత రాజ్యాంగం రూపొందడానికి పూర్వమే డిక్లరేషన్ నిబంధన ఉన్నందున నాడు ఆయా మతాలు హిందూ మత పరిధి కానందున వారు కూడా నిబంధన మీరినట్లే అని ఈ పిటిషన్ విచారణార్హం అయితే మరికొందరి పై కూడా పిటిషన్ వేయవచ్చని కొందరు న్యాయ నిపుణుల అభిప్రాయం.

ఇదిలా ఉండగా భారత దేశంలో పుట్టిన కుల మతాలన్నీ హిందూ అనుబంధంగా నిర్ధారించి రూపొందించిన చట్టాల్లో బౌద్ధం పరిగణనలోకి తీసుకోబడలేదు. ఈ గడ్డ పై పుట్టినా కానీ విదేశాల్లో తప్ప ఇక్కడ పెద్దగా ప్రాచుర్యం పొందని కారణంగా హిందూ మత సంబంధిత చట్టాల్లో చోటుచేసుకోలేదు. ఈ పిటిషన్ సందర్భంగా ఈ అంశం కూడా ప్రస్తావనకు రావొచ్చు. మరొకరు ఇదే డిమాండ్ చేస్తూ పిటిషన్ వేయొచ్చు కూడా. మొత్తంగా చూస్తే హై కోర్ట్ వేదికగా ఈ అంశం పలు దుమారాలు రేపుతుందా చల్లబడిపోతుందా అన్నది ఆసక్తికరం .

ఈ పిటిషన్ విచారణకు వెళ్తే ప్రతివాది తరుపు నుండి ఒక ప్రధాన ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దర్శనార్థం వెళ్లిన భక్తుడికి విశ్వాసాలకు సంభందించిన ప్రశ్నలు , పరీక్షలు ఉండొచ్చు కానీ, ఒక రాష్ట్ర పరిపాలకుడిగా, రాష్ట్ర పరిధిలోని ఆలయ ప్రతినిధుల ఆహ్వానం మేరకు వెళ్లిన ఆహ్వానితుడిగా అక్కడి ఆచార వ్యవహారాలు విధిగా గౌరవిస్తాము కానీ హిందూ ధర్మంలో ఆహ్వానితుడికి విశ్వాస ప్రకటన నిబంధన ఉంటుందా ?. ఇదే ప్రకారం ఇతర ధర్మాల వారు కూడా నిబంధనలు ఏర్పాటు చేసుకొని మా ఆలయాలకు వచ్చేవారు విశ్వాస ప్రకటన పై సంతకాలు చేయాలంటే పరిపాలకుడిగా అన్ని మతాల్ని, అన్ని వర్గాల్ని, వారి ఆహ్వానాలని గౌరవించవలసిన వారు ఏది పాటించాలి, ఎవరిది విశ్వసించాలి, వారి వ్యక్తిగత విశ్వాసాలకు భారత రాజ్యాంగం ప్రకారం ఉండాల్సిన రక్షణ ఏమవుతుంది అన్న ప్రశ్న కోర్టు ముందు వ్యక్తమైతే ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి .

ముఖ్యమంత్రి జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు అని ప్రతిపక్షాలు చేస్తున్న వివాదం గురించి చూస్తే డిక్లరేషన్ నిబంధనల ప్రకారం కుటుంబ పెద్ద ఒకసారి డిక్లరేషన్ ఇస్తే ఆ కుటుంబంలో వ్యక్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు . ఆ ప్రకారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో డిక్లరేషన్ ఇచ్చిన అనంతరం ఆరు సార్లు శ్రీవారిని దర్శించుకోవడమే కాకుండా పట్టు వస్త్రాలు కూడా సమర్పించుకున్నారు . ఆ తరువాత ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర పూర్తయిన పిమ్మట నడక దారిలో ఏడుకొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకోవడమే కాక గత ఏడాది ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించారు .

నాడైనా నేడైనా ఈ అంశం పై చంద్రబాబు అండ్ కో విమర్శలు చేసేది చేస్తుంది మాత్రం వైఎస్సార్ ని కానీ , జగన్ ని కానీ ప్రజల నాయకులుగా కాక ఒక కులానికి , మతానికి పరిమితం చేసి తద్వారా రాజకీయ లబ్ది పొందుదామనే కుట్రలో భాగంగానే తప్ప మరొకటి కాదన్నది జగమెరిగిన సత్యం ..

ఏదేమైనా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలకు పనికిరాని , అర్థంలేని , అనవసరమైన వివాదాలతో కోర్టులు చర్చనీయాంశం అవ్వడంలో తెలుగుదేశం పాత్ర ప్రధానం అని చెప్పొచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp