ఆ సిబిఐకి ఈ సిబిఐకి తేడా ఉంటుందా..?

By Voleti Divakar Sep. 17, 2020, 09:34 pm IST
ఆ సిబిఐకి ఈ సిబిఐకి తేడా ఉంటుందా..?

కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కేసుల దర్యాప్తుల విషయంలో తేడాలు చూపిస్తుందా?. తెలుగుదేశం పార్టీ ద్వంద్వ విధానాన్ని చూస్తే దీనిపై సామాన్య ప్రజలకు కూడా అనుమానాలు కలుగుతాయి. రాజధాని అమరావతిలో భూముల కుంభకోణంలో సిబిఐ విచారణను వ్యతిరేకిస్తున్న టిడిపి, తాను అధికారంలో ఉండగా రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తును నిషేధించిన ఆదే టిడిపి విశాఖపట్నంలో భూముల కొనుగోలుపై మాత్రం సిబిఐ విచారణకు డిమాండ్ చేయడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఎందుకీ రెండు నాల్కల ధోరణి ?. ఆంతర్వేది రథం దగ్గం కేసులో కూడా సిబిఐ విచారణను టిడిపి నాయకులు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే ఈ సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిబిఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

కానీ రాజధాని అమరావతి భూముల కుంభకోణం విషయంలో మాత్రం సిబిఐ, ఎసిబి దర్యాప్తులను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్నది మాత్రం చర్చోపరచర్చలకు దారితీస్తోంది. రాజధాని భూముల కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సిబిఐ, ఎసిబి విచారణలను ఆపార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తోంది.

చంద్రబాబు ఆండ్ కో సామాజిక వర్గానికే చెందిన కొంత మంది న్యాయమూర్తులు, న్యాయాధికారుల బంధువులు కూడా ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఎసిబి అధికారులు కేసులు నమోదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కుంభకోణం బట్టబయలైతే దేశవ్యాప్తంగా టిడిపి పరువు బజారున పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే హడావుడిగా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి మరీ వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

అదే టిడిపి నేతలు ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నంలో జరిగిన భూ కొనుగోళ్లపై సిబిఐ విచారణకు డిమాండ్ చేయడం చిత్రంగా కనిపిస్తోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్ణయం నుంచి భూసేకరణ, అసైన్డ్ భూముల కొనుగోళ్లు తదితర వ్యవహారాల్లో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ప్రాథమిక ఆధారాలను కూడా దర్యాప్తు సంస్థలు సేకరించాయి. ఆయితే విశాఖపట్నంలో భూసేకరణ, అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం వంటి వ్యవహారాలు జరగలేదు. కేవలం చట్టబద్ధంగా భూముల కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. ఇక్కడ కూడా రాజధాని వస్తుందన్న ఉద్దేశంతోనే భూములు కొనుగోలు చేసి ఉండవచ్చు. రాజధానిపై లీకేజీలు ఇచ్చి పేదల  అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవడానికి.. చట్టపరంగా భూముల కొనుగోళ్లకు మధ్య వ్యత్యాసం లేదా ?.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp