TDP Devineni Uma - బాబు పోరాడుతున్నారట!

By Aditya Oct. 27, 2021, 08:10 pm IST
TDP Devineni Uma - బాబు పోరాడుతున్నారట!

తమ నాయకుడు చంద్రబాబు పోరాడుతుంటే వైఎస్సార్‌ సీపీ నాయకుడు విజయసాయిరెడ్డికి ఢిల్లీలో వణుకువస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం విలేకరుల సమావేశంలో ఓ వింత వ్యాఖ్య చేశారు. రాజు వెడలె రవి తేజములలరగ అన్నట్టు సీనియర్‌ నాయకులను వెంటబెట్టుకుని, అనుకూల మీడియా ఓవర్‌ బిల్డప్‌ల మధ్య ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఉస్సూరుమంటూ తిరిగివచ్చినా ఆయన పోరాడేశారంటున్న ఉమ స్టేట్‌మెంట్‌ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

356 ఆర్టికల్‌ను ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, డీజీపీని రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రధానిని, హోంమంత్రిని కలుస్తానని ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడ వారి అపాయింట్‌మెంట్‌ దొరక్క తీవ్ర అవమానంతో వెనక్కి వచ్చారు. దాన్ని మరుగుపరచడానికి ప్రధాని మోదీని కలవడానికి జగన్‌, విజయసాయి ఎందుకు భయపడుతున్నారని ఉమ విచిత్రమైన ప్రశ్న వేశారు. ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పారని చెప్పుకొనే చంద్రబాబు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఇంట్లో రెండు రోజుల పాటు ఎదురుచూసినా ఫలితం లేక రాష్ట్రపతిని కలిసి వెనక్కి వచ్చారు కదా! అయినా చంద్రబాబు పోరాడేశారంటూ ప్రకటించేస్తే జనం నమ్మేస్తారనుకుంటున్నారా?

Also Read : NCRB Data Over Ganja - బాబు అబద్దాలు అతకడం లేదు ! గంజాయిపై వాస్తవాలు ఇవీ !

మళ్లీ గుర్తుకువచ్చిన ప్రత్యేక హోదా

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదా డిమాండ్‌ను గాలికొదిలేసి ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించింది తమ హయాంలోనే. ఆ విధంగా రాష్ట్రానికి తీరని నష్టం చేసి ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా పల్లవి ఎత్తుకోవడం ఎందుకు. 28 మంది ఎంపీలు ఉన్నా ఎందుకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారు అని గొంతెత్తి అరిచేస్తే బాబు షో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన విషయం పక్కకుపోతుందని భావిస్తున్నారా? తమ పార్టీ ఎంపీల సహకారం అవసరం లేకుండా బీజేపీ సొంత బలంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కనుక ప్రత్యేక హోదా విషయంలో తాము డిమాండ్‌ చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి జగన్‌ ఎప్పుడో స్పష్టం చేశారు. కాకపోతే ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎప్పుడూ అడుగుతూనే ఉంటామని కూడా చెప్పారు. అలా సందర్భం వచ్చిన ప్రతిసారీ అడుగుతున్నారు కూడా.

రెండు గొంతుకల సిద్ధాంతం కరెక్టా?

రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం, ప్రత్యేక హోదా విషయంలో రెండు గొంతుకల సిద్ధాంతం అనుసరించిన తమ అధినేత చంద్రబాబు వైఖరి కరెక్టు అని ఉమా భావిస్తున్నారా. రాష్ట్రం ఏమైపోయినా ఫరవాలేదు, తమ పార్టీ ‘పచ్చ’గా ఉంటే చాలనుకొని అధికారంలో ఉండగా ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టి ఇప్పుడు నాలుక ఎటు తిరిగితే అలా మాట్లాడేయడమే రాజకీయమా? బీజేపీతో దోస్తీ కట్టి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారం వారితో పంచుకొని విభజన చట్టంలోని అంశాలను అమలు చేయించలేకపోయిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆ విషయం ఎవరికీ తెలియనట్టు మా నాయకుడు చంద్రబాబు పోరాడుతున్నారు. ప్రత్యేక హోదాపై మీరేం చేస్తున్నారు అంటూ అధికార పార్టీని ప్రశ్నించేస్తే టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ చేసిన నిర్వాకం ఏమిటని జనం అనుకోరా?

Also Read : Chandrababu Delhi Tour-చంద్ర‌బాబుకు ఇప్ప‌టికైనా అర్థ‌మైన‌ట్లేనా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp