కుప్పం ప‌ర్య‌ట‌న‌లో త‌ప్ప‌ట‌డుగులు

By Kalyan.S Feb. 27, 2021, 01:30 pm IST
కుప్పం ప‌ర్య‌ట‌న‌లో త‌ప్ప‌ట‌డుగులు

పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం తొలిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన చంద్రబాబు గుడుపల్లె, కుప్పంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తల వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. త‌ర్వాత తేరుకుని ‘‘పొరపాటు జరిగింది.. మీరు ఎన్నో త్యాగాలు చేశారు.. మీకోసం ఆలోచించి ఉంటే బాగుండేది.. మిమ్మల్ని విస్మరించా. ఇకపై మీ కోసం 25% సమయం కేటాయిస్తా.. మీరంతా చెప్పినట్లు వింటా..’’ అంటూ బుజ్జగిస్తూ ముందుకు సాగారు. పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా చేశారని, నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. చోటా మోటా నాయకులు ఎగిరి పడుతున్నారని, చిన్న కాలువను కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. తాను పులివెందులకు నీళ్లిస్తే అక్కడ ప్రజలు తనకు ఓటు వేశారన్నారు. ఈ ప్రభుత్వం కుప్పానికి ఎందుకు నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. కుప్పం పర్యటన సందర్భంగా గురువారం రాత్రి బస్టాండ్‌ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు సభ్యత మరచి ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార యంత్రాంగంపై వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగారు. అసభ్యంగా మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఓట‌మి పాలైనా బాబు వ్య‌వ‌హార‌శైలిలో మార్పు రాలేద‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. అధికారుల ప‌ట్ల చుల‌క‌న భావంతో మాట్లాడ‌డం మ‌రోసారి బాబు వైఖ‌రిని స్ప‌ష్టం చేసింద‌ని చెబుతున్నారు. ‘‘నా దగ్గర నంగినంగిగా పని చేసిన కలెక్టర్లు, ఎస్పీలను ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. వారి ప్రవర్తన నాకు ఒక గుణపాఠం. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎవరినీ వదిలిపెట్టను... నేను వస్తే వారిపై కేసులు పెట్టి శిక్షిస్తా. మీపై ఎన్ని కేసులు పెట్టినా భయపడొద్దు. నేను వచ్చాక ఒక్క సంతకంతో అన్ని కేసులు మాఫీ చేస్తా’’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. స్థానికంగా నేత‌లు చెలాయిస్తున్న ఆధిప‌త్య ధోర‌ణిపై కార్య‌క‌ర్త‌లు ఫిర్యాదు చేసిన బాబు స‌రైన రీతిలో స్పందించ‌లేద‌ని ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పైగా వారికి స‌ర్దిచెప్పే నెపంతో త‌ప్పులు చేసిన వారిని వెన‌కేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డ్డాడంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. చంద్రబాబు బెంగళూరు నుంచి గుడుపల్లెకు వస్తున్న మార్గంలో కొడతనపల్లి వద్ద కాన్వాయ్‌ను ఆపి స్థానికులతో మాట్లాడారు. ఆ సమయంలో శివ అనే కార్యకర్త చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా స్థానిక నాయకులు అడ్డుకోవడంతో జేబులోని పెట్రోల్‌ ప్యాకెట్‌ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.

కుప్పం ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు, తీరుపై పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. దమ్ముంటే చంద్రబాబు.. పుంగనూరులో పోటీ చేయాలని రాష్ట్ర సవాల్‌ విసిరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుప్పంలో ఓడిపోయినా చంద్రబాబుకు కనువిప్పు కలగలేదని ఆయన ధ్వజమెత్తారు. ‘‘కుప్పం ఓటమితో చంద్రబాబులో అసహనం విపరీతంగా పెరిగింది. కరోనా కష్టకాలంలో కూడా చంద్రబాబు కుప్పం వైపు చూడలేదు. ఇప్పుడు కుప్పంలో ఓటమిపాలయ్యే సరికి ప్రజలు గుర్తుకొచ్చారు. పులివెందుల, పుంగనూరు వచ్చి చంద్రబాబు ఏం చేస్తారు?.చంద్రబాబు అక్రమంగా మిథున్‌రెడ్డిని 15 రోజులు జైల్లో పెట్టించాడు. గతంలో చంద్రబాబు పథకాలు వాళ్ల అబ్బ సొత్తుతో అమలు చేశారా?’’ అంటూ పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌.. సంక్షేమ పాలన చేస్తున్నారని ఆయన అన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp