ఓటమికి మనం కారణం కాదంటే పోలా..

By Jaswanth.T Nov. 24, 2020, 10:00 am IST
ఓటమికి మనం కారణం కాదంటే పోలా..
ఏం చేసినా గెలవం అని తెలిసిపోయినప్పుడు, సదరు ఓటమికి తామే కారణమని ఒప్పుకోకపోవడం ఇప్పుడు నడుస్తున్న రాజకీయం. సరిగ్గా ఈ రాజకీయాన్ని ఒంటబట్టించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తిరుపతి ఉప ఎన్నిక రూపంలో భారీ స్కెచ్‌ వేసినట్టుగా సర్వత్రా భావిస్తున్నారు. సాధారణంగా తమ పార్టీ తరపున ఎంపిక చేయబోయే అభ్యర్ధిని ముందుగానే పార్టీ అధినేతలు పిలిపించి మాట్లాడడం సహజం. కానీ ముందుగానే తిరుపతి ఉప ఎన్నికకు అభ్యర్ధిని ప్రకటించి గమ్మున కూర్చున్న చంద్రబాబు ఈ పనిని మాత్రం చేయలేదు. పైగా అభ్యర్ధిని ఎంపిక చేయడంలో మినిమమ్‌ ప్రాధాన్యలను కూడా పరిగణనలోకి తీసుకున్న దాఖలాల్లేవు.

ఇప్పటికే టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించిన పనబాక లక్ష్మి రెండుసార్లు ఓటమిపాలయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీ కేడర్‌ను, నియోజకవర్గాన్ని అంటిబెట్టుకుని ఉన్నారా? అంటే అదీలేదు. పైగా టీడీపీ నుంచి బీజేపీలోకి మారిపోయే ప్రయత్నాల్లో ఉన్నారన్న టాక్‌ కూడా జోరుగానే విన్పిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ పనబాకనే ఎందుకు అభ్యర్ధిగా ఎంపిక చేసింది? అన్నది రాజకీయంగా ఆసక్తికర ప్రశ్నగా మారిపోయింది.

అయితే చంద్రబాబు వ్యూహాన్ని, ఓటమి తరువాత బీజేపీతో వన్‌సైడ్‌ లవ్‌లో ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది నారా వారి భారీ స్కెచ్‌ అని అర్ధమవుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. టీడీపీ స్వయంగా పోటీ చేస్తే తిరుపతి పార్లమెంటు స్థానం గెల్చుకోవడం కల్ల. ఒక పక్క అధికార పార్టీ, మరో పక్క బీజేపీ–జనసేనలు సంయుక్తంగా అభ్యర్ధులను నిలబడెతే అక్కడ టీడీపీ మూడో స్థానంలోకి వెళ్ళినా ఆశ్చర్య పోనక్కర్లేదన్న అంచనాలున్నాయి. దీనికి తోడు అక్కడ టీడీపీ తరపున పోటీకి పెద్దగా పేరున్నవాళ్ళెవ్వరూ ఆసక్తిచూపిస్తున్న దాఖలాలు కూడా లేవు.

ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీలోకి వెళ్ళిపోయే ఆలోచనలో పనబాక ఉంటే, ఆమెనే టీడీపీ అభ్యర్ధిగా ముందు ప్రకటించడం ద్వారా బీజేపీతో భవిష్యత్తు స్నేహానికి బాట వేసుకునే సుదూర ఆలోచనతోనే చంద్రబాబు అభ్యర్ధి ప్రకటనగా భావిస్తున్నారు. అంటే టీడీపీలో నుంచి వెళ్ళిపోయి బీజేపీలో చేరినట్లుగానే ఉంటుంది గానీ, ఇంతకు ముందు వెళ్ళిన వారికి మాదిరిగానే టీడీపీకి టచ్‌లోనే ఉండే విధంగా ఇది వ్యూహమన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. తద్వారా బీజేపీకి ఒక అభ్యర్ధిని చూపించడంతో పాటు, తాము గెలవలేకపోయామన్న నిందను కూడా మోసే పని టీడీపీకి ఉండదన్న మాట. ఈ అద్భుతమైన వ్యూహంలో భాగంగానే ముందస్తుగా అభ్యర్ధి ప్రకటనని చెబుతున్నారు. నేరుగా పార్టీ అధినేతే అభ్యర్ధిగా ప్రకటించినప్పటికీ పనబాక ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో పార్టీ కేడర్‌కు కూడా అందుబాటులోకి రాకుండా మౌనం పాటించడం వెనుక కూడా, బీజేపీ చెయ్యందిస్తుందన్న ఆశేనన్న గుసగుసలు కూడా విన్పిస్తున్నాయంటున్నారు.

అయితే ఒక వేళ చంద్రబాబు ఆసించినట్టుగా బీజేపీలోకి పనబాక చేరేందుకు ఆ పార్టీ అధిష్టానం ఒప్పుకోకపోతే ఏంటి పరిస్థితి? అన్నదే ఇప్పుడు రసవత్తరంగా మారిందంటున్నారు. చంద్రబాబు అభ్యర్ధి మౌనం, పోటీ జరగబోయే స్థానంలో బలాబలాను పరిశీలిస్తే ప్రస్తుతం అనేక ఊహాగానాలకు తావిస్తోందంటున్నారు. ఒకటి అభ్యర్ధి పచ్చకండువాతో జనబాహుళ్యంలోకి రావడం గానీ, లేదా ఇతర పార్టీలు కూడా తమతమ అభ్యర్ధులను ప్రకటించడం గానీ జరిగితే తప్ప ఈ ఊహాగానాలకు తెరపడే పరిస్థితులు కన్పించడం లేదంటున్నారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp