Chandrabau poll promises - బాబు ఉచితంగా ఇళ్లు పంచేస్తారట!

By Aditya Nov. 22, 2021, 08:30 pm IST
Chandrabau poll promises - బాబు ఉచితంగా ఇళ్లు పంచేస్తారట!

తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో రాష్ట్రంలో పేదలకు ఉచితంగా ఇళ్లు పంపిణీ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఒక హామీ ఇచ్చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో బాబు ఉచిత హామీలు అప్పుడే మొదలెట్టేశారని జనం అనుకుంటున్నారు. టీడీపీ ముఖ్యనేతలతో సోమవారం ఆయన  టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు, వాటిలో నిర్మించిన ఇళ్లకు క్రమబద్ధీకరణలో రూ.10 వేలు, రూ.20వేలు వసూలు చేస్తున్నారని చెబుతూ ఎవరూ ఆ డబ్బులు కట్టవద్దు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోగా పేదలు అందరికీ ఇళ్లు పంచేద్దామని అని అన్నారు.

గతంలో అటకెక్కిన ఉచితాల మాటేమిటో?

ప్రతి ఎన్నికల ముందు ఉచిత హామీలు ఇవ్వడం చంద్రబాబుకు అలవాటేనని, ఆనక వాటిని పట్టించుకోరనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. అందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈయనను ఆల్‌ ఫ్రీ బాబు అని చమత్కరించేవారు. 2014 ఎన్నికల వేళ చంద్రబాబు రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 87,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తామని, అంతవరకూ ఎవరూ బ్యాంకులకు చెల్లించవద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక అసలైన అర్హులు,  స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ వంటి సవాలక్ష నిబంధనలు తెచ్చి అయిదేళ్లలో కేవలం రూ. 17,000 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేశారు. ఈయన హామీలను నమ్మిన రైతులు బ్యాంకులకు సొమ్ము చెల్లించకపోవడంతో అసలు, వడ్డీ తడిసి మోపెడై అవి తీర్చలేక అవస్థలు పడ్డారు. డ్వాక్రా మహిళలకు కూడా వారు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు చెల్లించవద్దని ఇలాంటి హామీనే ఇచ్చి అధికారంలోకి వచ్చాక అసలు, వడ్డీ చెల్లించకపోవడంతో వారూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికిచ్చే సున్నా వడ్డీని పూర్తిగా అటకెక్కించారు.

615 హామీలు వెబ్‌సైట్‌ నుంచి మాయం!

2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనాన్ని తట్టుకొని గెలవలేమనే భయంతో చంద్రబాబు అన్ని వర్గాల వారికీ ఎడపెడా హామీలు ఇచ్చేశారు. ఆ విధంగా మొత్తం 615 హామీలతో సుదీర్ఘమైన మేనిఫెస్టోను అట్టహాసంగా విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక వాటి ఊసే మరచిపోయారు. ప్రతిపక్షం విమర్శిస్తోందని, ప్రజలు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మేనిఫెస్టోనే మాయం చేసేశారు కూడా. హామీల అమలులో ఇంతటి ట్రాక్‌ రికార్డు ఉన్న చంద్రబాబు పేదలందరికీ ఉచితంగా ఇళ్లు ఇచ్చేస్తానని ప్రకటించడంతో ఇప్పుడు జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

అధి‍కారంలోకి వచ్చే సీనుందా?

2019 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన స్థానిక, మున్సిపల్‌, పరిషత్‌, ఉప ఎన్నికల్లో వరుస ఓటములు చవిచూసిన తెలుగుదేశం పార్టీకి 2024లో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేంత సీనుందా? అన్న విమర్శలు అధికారం పక్షం నుంచి వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు జోరందుకున్నాయి. మరోపక్క ప్రతి ఎన్నికకు ఓటింగ్‌ శాతాన్ని పెంచుకుంటూ బలీయంగా తయారైన వైఎస్సార్‌ సీపీని రోజురోజుకు ప్రజాబలం కోల్పోతున్న టీడీపీ ఢీకొనగలదా? అన్న సందేహాలు ఆ పార్టీ నేతల్లోనే ఉన్నాయి. అందుకే పార్టీని పటిష్టం చేయాల్సింది పోయి ఇప్పటి నుంచి ఉచిత హామీలు ఇస్తే జనంలో నవ్వులపాలవడం తప్ప ప్రయోజనం ఏముంటుదని తమ్ముళ్లే పెదవి విరుస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp