ప్చ్‌.. లోకేష్‌

By Karthik P Jan. 20, 2021, 08:00 am IST
ప్చ్‌.. లోకేష్‌

భావి నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఊహించుకుంటున్న నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ పనితీరు.. ఆయనపై ఆశలు పెట్టుకున్న వారందరిలో నిరుత్సాహాన్ని నింపుతోంది. దాదాపు పదేళ్ల నుంచి సానబడుతున్నా.. లోకేష్‌ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండడమే వారి నిరుత్సాహానికి కారణమవుతోంది. అప్పుడప్పుడు బయట కనిపించడం.. ఆ తర్వాత ట్విట్టర్‌కే పరిమతమవడంతోనే లోకేష్‌ రాజకీయం సాగుతోంది. ట్విట్టర్‌ను వదిలి బయటకు రారు. వచ్చి మాట్లాడరు అంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నా.. చినబాబు తీరు మాత్రం మారకపోవడం ఆయన అభిమానులకు సైతం రుచించడంలేదు.

రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా.. తాను మాత్రం ట్విట్టర్‌ నుంచే రాజకీయలు చేస్తానని నారా లోకేష్‌ నిత్యం నిరూపించుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వం, సీఎం వైఎస్‌ జగన్‌పై రోజూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ట్విట్టర్‌ రాజకీయం సులువుగా ఉండడం చినబాబుకు నచ్చుతున్నట్లుగా ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌ తాజా ఢిల్లీ టూర్‌పై కూడా ఎప్పటిలాగే ట్విట్టర్‌లో విమర్శలు, ఒపినియన్‌ పోల్‌ చేపట్టారు. ప్రత్యేక హోదా, వివేకానందరెడ్డి ఘటన, మూడు రాజధానులు, దేవాలయాలపై దాడులు అంశాలను పోస్ట్ చేస్తూ.. వీటిలో దేని కోసం జగన్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లారు..? అంటూ ఒపినియన్‌ పోల్‌ పెట్టారు. కేంద్రం మెడలు వంచుతానన్న వైఎస్‌ జగన్‌ తానే తలదించుకుని ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారంటూ విమర్శించారు. ఒపినియన్‌ పోల్‌కు మోదీ, జగన్‌ ఉన్న ఓ ఫోటోను జత చేశారు.

లోకేష్‌ ట్విట్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌ అంటూ ట్విట్‌లోని తప్పులను ఎండగడుతున్నారు. ఢిల్లీలోని పెద్దలకు వైఎస్‌ జగన్‌ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారంటూ చెబుతున్న లోకేష్‌.. అందుకు వాడిన ఫోటోను నోట్‌ చేస్తూ చేసిన తప్పును ఎత్తి చూపుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత తొలిసారి ప్రధాని మోదీ తిరుమల వచ్చారు. ఆ సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధానిని కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించేలా.. ఒక పుష్పంతో మోదీకి వైఎస్‌ జగన్‌ స్వాగతం పలికారు. ఆ చిత్రంలో అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ కూడా ఉన్నారు. నాటి ఫొటోను పోస్టు చేసిన లోకేష్‌.. వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారంటూ విమర్శించి.. నవ్వులపాలవుతున్నారు. ఈ ఫొటోను చూసిన టీడీపీ అభిమానులు కూడా లోకేష్‌ పనితీరులోని డొల్లతనాన్ని ఎలా కప్పిపుచ్చాలో తెలియక తికమకపడుతున్నారు. మరి నారా లోకేష్‌ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆశించినట్లుగా ఎప్పుడు రాజకీయాలు చేస్తారో కాలమే తేల్చాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp