బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు టీడీపీ త‌హ‌త‌హ‌

By Sodum Ramana Nov. 29, 2019, 08:10 am IST
బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు టీడీపీ త‌హ‌త‌హ‌

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఏపీ ప్ర‌తిప‌క్ష టీడీపీ క్ర‌మంగా లొంగిపోతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ఏడాది ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి హోదాలో ప్ర‌ధాని మోడీపై ఒక ర‌క‌మైన యుద్ధ‌మే ప్ర‌క‌టించారు. ప్ర‌ధానికి, బీజేపీకి వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా తానే కాంగ్రెస్ స‌హా అన్ని పార్టీల‌ను ఏక‌తాటిపైకి తీసుకొచ్చాన‌ని బాబు ప‌దేప‌దే చెప్పేవాడు. ఇక ఎల్లోమీడియా అయితే ఆకాశ‌మే హ‌ద్దుగా బాబును పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తింది. ఆలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న‌ట్టు...ప్ర‌ధాని అభ్య‌ర్థిగా బాబే అని ఒక ద‌శ‌లో రాసిప‌డేశారు.

రెండోసారి కూడా కేంద్రంలో మోడీ నేతృత్వంలో అధికారం చేప‌ట్ట‌డం, రాష్ర్టంలో టీడీపీ అధికారం కోల్పోవ‌డంతో ఆ పార్టీ ప‌రిస్థితి త‌ల్ల‌కిందులైంది. అనుకున్న‌దొక్క‌టి అయ్యిందొక్క‌టి అనే చందాన కేంద్రంలో కాంగ్రెస్ నాయ‌క‌త్వంలో, రాష్ర్టంలో మ‌రోసారి తాను అధికారంలోకి వ‌స్తామ‌నుకున్న చంద్ర‌బాబు అంచ‌నాలు త‌ప్పాయి. అంతేకాకుండా మోడీని తాను త‌ప్ప దేశంలో ఏ నేత కూడా ఎదుర్కోలేర‌నే క‌ల‌రింగ్ ఇచ్చిన చంద్ర‌బాబు అహంకారాన్ని అధికార మార్పిడి క్ర‌మంగా దింపేస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇటీవ‌ల బీజేపీ విష‌యంలో టీడీపీ వైఖ‌రిలో సానుకూల‌త క‌నిపిస్తోంది. బీజేపీతో మైత్రీబంధం ఏర్ప‌ర‌చుకోడానికి టీడీపీ త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్టు ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను చేర్చుకున్నా బీజేపీని చంద్ర‌బాబు స‌హా టీడీపీ నేత‌లెవ‌రూ క‌నీసం మాట‌మాత్రం కూడా త‌ప్పు ప‌ట్ట‌డం లేదు. దీంతో ఆ న‌లుగురిని చంద్ర‌బాబే పంపార‌ని విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

మ‌హారాష్ట్ర ప‌రిణామాల‌పై బీజేపీ వైఖ‌రిని త‌ప్పు ప‌ట్ట‌క‌పోగా, కాంగ్రెస్ తీరును టీడీపీ నేత‌లు టీవీ చ‌ర్చ‌ల్లో త‌ప్పు ప‌డుతుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అలాగే ఆంగ్ల‌మాధ్య‌మం విష‌య‌మై సీఎం జ‌గ‌న్ ఉప‌రాష్ర్ట‌ప‌తి వెంక‌య్య‌ను ప్ర‌శ్నిస్తే...ఏమో రేపు ప్ర‌ధానిని కూడా అనేట్టున్నాడ‌ని చంద్ర‌బాబు ప్రేమ ప్ర‌క‌టిస్తున్నాడు. మ‌రోవైపు దేశ చిత్ర‌ప‌టంలో అమ‌రావ‌తిని చేర్చినందుకు అమిత్‌షాకు గ‌ల్లా జ‌య‌దేవ్ నేతృత్వంలో టీడీపీ ఎంపీలు కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డం, మ‌ళ్లీ వ‌స్తుంటామ‌ని వారు అంటే, ఎప్పుడైనా మీరు రావ‌చ్చ‌ని కేంద్ర‌హోంమంత్రి ఆహ్వానం ప‌ల‌కడాన్ని ఏపీ ప్ర‌జానీకం గ‌మ‌నిస్తోంది.

ప్ర‌స్తుతానికి వ‌స్తే గ‌ల్లా జ‌య‌దేవ్ పార్ల‌మెంట్‌లో జీరో అవ‌ర్‌లో మాట్లాడుతూ ఒక ప‌క్క ప్ర‌ధాని మోడీ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే, మ‌రోప‌క్క ఏపీ ప్ర‌భుత్వం త‌ర్క విరుద్ధ , అహేతుక నిర్ష‌యాలు తీసుకుంటోంద‌ని ఆరోపించారు. ఎంత‌లో ఎంత మార్పు. మిస్ట‌ర్ ప్రైమ్ మినిస్ట‌ర్ అని గ‌తంలో గ‌ల్లా జ‌య‌దేవ్ ధైర్యంగా లోక్‌స‌భ స‌మావేశాల్లో ప్ర‌శ్నించార‌ని ఆయ‌న‌కు పాలాభిషేకం, స‌న్మానం చేసిన ఉదంతాలు ఇంకా ప్ర‌జ‌లు గుర్తు పెట్టుకునే ఉన్నారు. ఇప్పుడేమో ప్ర‌ధానిని, అమిత్‌షాను మ‌చ్చిక చేసుకునేందుకు ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.

ప్ర‌ధాని ఆశీస్సుల కోసం చంద్ర‌బాబు మొద‌లుకుని, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల త‌హ‌త‌హ చూస్తుంటే ఔరా ఏమీ రాజ‌కీయాలు అనిపించ‌క మాన‌వు. అయితే టీడీపీ ఎంత ద‌గ్గ‌ర కావాల‌నుకుంటున్నా గ‌త అనుభ‌వాల దృఫ్ట్యా చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని ఆ పార్టీని బీజేపీ ఏ మాత్రం న‌మ్మ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కాక‌పోతే రాజ‌కీయాలు న‌మ్మ‌కాల‌పై కాకుండా అవ‌స‌రాల‌పై న‌డుస్తుంటాయి. అందువ‌ల్ల భ‌విష్య‌త్‌లో ఎవ‌రెవ‌రి మ‌ధ్య ఎలాంటి సంబంధాలుంటాయో చెప్ప‌లేం. దానికి మ‌హారాష్ర్ట రాజ‌కీయాలే స‌జీవ సాక్ష్యం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp