TDP Bandh - ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పేలవమైన బంద్ బాబు హస్తిన టూర్ కి అడ్డంకులు కల్పిస్తుందా

By Raju VS Oct. 20, 2021, 09:30 pm IST
TDP Bandh - ఆంధ్రప్రదేశ్  చరిత్రలోనే పేలవమైన బంద్ బాబు హస్తిన టూర్ కి అడ్డంకులు కల్పిస్తుందా

టీడీపీ ఆవిర్భావానికి ముందు గానీ, ఆ తర్వాత గానీ రాష్ట్రంలో ఎన్నడూ ఒక బంద్ పిలుపు ఇంత పేలవంగా ముగిసిన చరిత్ర లేదు. అందులోనూ ప్రధాన ప్రతిపక్షం ఇచ్చే పిలుపులకు ఇంత పలుచనగా ప్రజా స్పందన అనూహ్యంగానే చెప్పాలి. ఏదో మూల, ఏదో స్థాయిలో నిరసనలు కనిపించడం బంద్ కార్యక్రమాల్లో భాగంగా ఉంటుంది. ఇటీవల వామపక్షాలు, రైతు సంఘాలు రెండు మూడు బంద్ లు నిర్వహించాయి. ఆ సమయంలోనే కొంత ప్రభావం కనిపించింది. కానీ బుధవారం నాటి టీడీపీ బంద్ అన్నింటికన్నా నామమాత్రంగా అసలు స్పందనే లేకుండా గడిచిపోయింది. చివరకు చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థల వ్యాపారాలు కూడా తెరిచుకోవాల్సిన పరిస్థితి ఈ బంద్ సందర్భంగా కనిపించడం విశేషమే.

రాజకీయ పార్టీలు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతుంటాయి. కేవలం తమ కార్యకర్తలే నిర్వహించే ఆందోళనలుంటాయి. ప్రజలతో కలుపుకుని సాగించే పోరాటాలు కూడా ఉంటాయి. అప్పటి ప్రజా స్పందనను బట్టి నిరసన రూపాలుంటాయి. ధర్నాలు, రాస్తారోకోలు, పికెటింగ్ లు, అంతిమంగా బంద్ ద్వారా ప్రజాగ్రహం వెల్లడించే పద్ధతి ఉంటుంది. కానీ టీడీపీ నేతల వ్యూహాత్మక తప్పిదాలకు తాజా బంద్ మరో ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రజా స్పందనను బట్టి కార్యాచరణ ఉండాల్సిన దశలో తాము ఊహించుకుని పిలుపులివ్వడం టీడీపీ పరువు తీసుకున్నట్టయ్యింది.

ప్రజలు బంద్ వంటి నిరసనలకు సిద్ధంగా లేకపోయినప్పటికీ ఏకపక్షంగా బంద్ కి పిలుపునివ్వడం మొదటి తప్పిదం. అదే సమయంలో టీడీపీకి రాజకీయంగా గడ్డు పరిస్థితి ఉన్న దశలో ఇతర పార్టీల సహకారం లేకపోవడం మరో లోపం. ముఖ్యంగా పోరాడే పార్టీలు టీడీపీని విశ్వసించకపోవడంతో ఆపార్టీ కార్యకర్తల అండదండలు లేకుండా బంద్ నిర్వహించడానికి టీడీపీ శ్రేణులే సిద్ధం కాలేని స్థితి ఏర్పడింది. కొందరు నేతలు పోలీసులకు కాల్ చేసి తమను గృహనిర్బంధం విధించినట్టు ప్రకటించాలని వేడుకోవడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. తాము అరెస్ట్ కాకపోతే బంద్ ఎందుకు పాటించలేదనే ప్రశ్నలు వస్తాయి కాబట్టి మా ఇంటికి ఇద్దరు కానిస్టేబుళ్లను పంపించాలని కొందరు టీడీపీ నేతలు వేడుకోవడం విశేషంగా చూడాలి.

Also Read : TDP Bandh-టీడీపీని బేజారెత్తించిన బంద్, బెజవాడలోనే కనిపించని ప్రభావం

టీడీపీ శ్రేణులే బంద్ పాటించడానికి సిద్ధంగా లేని దశలో చంద్రబాబు బంద్ కి పిలుపునివ్వడం ద్వారా ఆపార్టీ మరోసారి ప్రజలకు దూరంగా ఉందని తేటతెల్లం అయ్యింది. ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉందని ఊహించుకుంటున్న టీడీపీ నేతలకు అక్కడక్కడా ప్రజల నుంచి బంద్ పిలుపుని వ్యతిరేకిస్తూ వచ్చిన సంకేతాలు గమనిస్తే వారి వైఫల్యం అర్థమవుతుంది. తమ ఊహాలకు వాస్తవానికి పొంతనలేదని తెలుస్తుంది. అదే సమయంలో అధికార పార్టీ కూడా పోటీ నిరసనలకు పిలుపునివ్వడం టీడీపీని ఇరకాటంలోకి నెట్టేసింది. తగినంత డిఫెన్స్ చేసుకోలేని స్థితిలో పట్టాభి వ్యాఖ్యలుండడం పరువు తీసినట్టయ్యింది. దాంతో టీడీపీ ఆఫీసుల మీద దాడి చేశారని బాబు గగ్గోలు పెడుతున్నా జనంలో కాసింత కూడా కదలిక కనిపించకపోవడానికి కారణమయ్యింది. ఈ బంద్ విఫలమయ్యిందనే విషయాన్ని గుర్తించి రేపు మరో దీక్షకు చంద్రబాబు పూనుకుంటున్నప్పటికీ ఫలితం ఆశించడం సమస్యే అవుతుంది.

పైగా కేంద్ర హోం మంత్రిని కలుస్తున్నామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్న తరుణంలో తాజా ప్రజా స్పందనతో ఇంటిలిజెన్స్ రిపోర్ట్ బాబుకి కలవరం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా చంద్రబాబు ఆశించే స్పందన రాదని చెప్పడానికి తాజా బంద్ పిలుపు లో ఫెయిల్ అయిన తీరు చాటుతోంది. జనం మద్ధతు లేని చంద్రబాబుని బీజేపీ నేతలు సాదరంగా స్వాగతం పలికే ఛాన్స్ లేదు. పైగా గతంలో అధికారంలో ఉండగా వెలగబెట్టిన వ్యవహారాలు వెంటాడుతున్నాయి. దాంతో ఇవన్నీ కలిసి హస్తినలో కూడా చంద్రబాబుకి నిరాశ కల్పించే స్థితి ఖాయమని చెబుతున్నాయి. కానీ బాబు మాత్రం పచ్చ మీడియా సహాయంతో ప్రజలనే కాకుండా కేంద్రంలోని పెద్దలను కూడా భ్రమల్లో పెట్టాలనే యత్నంలో భాగంగా దీక్షలకు తెరలేపుతున్నారు. అవి కూడా ఫలితానివ్వకపోతే బాబు వ్యవహారం కుడితిలో పడ్డ ఎలుక మాదిరి అవుతుందనడంలో సందేహం లేదు.

Also Read : Chandrababu - Amit Shah - దాడిపై ఫిర్యాదు చేస్తారు సరే.. అమిత్‌ షా కారణం అడిగితే ఏం చెబుతారు..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp