రాజధానిలో బయటపడ్డ మాజీ మంత్రుల బినామీ అసైన్డ్ భూముల భాగోతం

By Surendra.R Dec. 15, 2019, 01:33 pm IST
రాజధానిలో బయటపడ్డ మాజీ మంత్రుల బినామీ అసైన్డ్ భూముల భాగోతం

అమరావతి రాజధాని భూ సమీకరణ కోసం సేకరించిన భూముల విషయంలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు భూముల పేరుతో భారీగా ప్రభుత్వం నుండి లబ్ది పోందినట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా గుర్తించింది.

ముఖ్యంగా రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన అసైన్డ్‌ భూములకు సంబంధించి ఓ మాజీ మంత్రి పెద్ద ఎత్తున లబ్ధిపోందారని, ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులకు కూడా ఇక్కడి లావాదేవీల్లో వాటా ఉన్నట్లు భావిస్తున్నారు.

భూమి లేని పేదలకు ప్రభుత్వం సాగు లేదా ఇళ్ళు నిర్మించుకునేందుకు కేటాయించిన భూములను అసైన్డ్ భూములు అంటారు. 1977 అసైన్డ్‌ చట్టం ప్రకారం ఈ అసైన్డ్ భూములను తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ, ఎలాంటి పరిస్థితుల్లో వాటిని అన్యాక్రాంతం చేయడానికి వీలు ఉండదు. అంటే అసైన్డ్ భూముల్ని అమ్మకూడదు, దానం చేయకూడదు, లీజుకు ఇవ్వకూడదు, మరే విధంగా కూడా ఇతరులకు బదలాయింపు చేయడానికి అవకాశం ఉండదు.

రాజధాని ప్రకటనకు ముందు ఈ ప్రాంతంలో జరిగిన అసైన్డ్‌ భూముల కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది.. ఈ నేపథ్యంలో జరిపిన పరిశీలనలో అసైన్డ్‌ భూముల వ్యవహారంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్లు ప్రచారం సాగుతోంది.

ప్రభుత్వం ఇప్పటికేే అభివృద్ధి చేసిన ప్లాట్లను పంపిణీ చేసిన 450 ఎకరాల అసైన్డ్‌ భూములకు సంబంధించిన పరిశీలనను అధికారులు పూర్తిచేశారు. దాదాపుగా ఈ ప్లాట్లన్నింటినీ అసైన్డ్‌ భూములు పోందిన అసలు యజమానులు కాకుండా ఇతరులు దక్కించుకున్నట్లు ఈ పరిశీలనలో తేలింది. ఇలా ప్లాట్లను దక్కించుకున్న ఇతరులలో అత్యధికులు ఆ మాజీ మంత్రి బినామీలుగా కూడా గుర్తించినట్లు సమాచారం.

ఆ మాజీ మంత్రికి, ప్లాట్లు దక్కించుకున్న వ్యక్తులకు మధ్య ఉన్న సంబంధాలను కూడా దాదాపుగా గుర్తించినట్లు తెలిసింది. దాదాపుగా ఈ లావాదేవీలన్నింటిలోనూ అసైన్డ్‌ భూముల వాస్తవ లబ్ధిదారులను బెదిరించారని, వారి నుండి తక్కువ ధరకు భూములను సోంతం చేసుకుని, ఆ తరువాత సమీకరణకు ప్రభుత్వానికి అప్పగించినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి అవకతవలకు పాల్పడిన సదరు మాజీ మంత్రులు ప్రభుత్వం నుండి ఆర్థికంగా భారీ లాభం పోందారని తేలింది. మరో 1100 ఎకరాల అసైన్డ్‌ భూముల్లోనూ ఇదే తరహాలో అవకతవకలు జరిగి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని కూడా పూర్థిస్తాయిలో ప్రభుత్వ అధికారులు పరిశీలించనున్నారు.

అసైన్డ్‌ భూముల విషయంలో ఎవరికి ప్రమేయం ఉన్నా వదిలేది లేదని, ప్రస్తుతం 450 ఎకరాలకు సంబంధించిన ప్లాట్ల కేటాయింపును రద్దు చేసి వాస్తవ లబ్దిదారులకు రిజిస్ట్రేషన్‌ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

ఈ అసైన్డ్ భూముల బినామీల కుంభకోణం వ్యవహారంలో ఉన్న టీడీపీ మాజీ మంత్రుల పేర్లను వైసీపీ ప్రభుత్వం బయట పెటుతుందో లేదో వేచి చూడాలి మరి..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp