ఈ పదవులో.. రబ్బరు సుత్తి

By Jaswanth.T Dec. 09, 2020, 08:00 pm IST
ఈ పదవులో.. రబ్బరు సుత్తి
రబ్బరు సుత్తిని గురించి సినిమాలో ఓ ఆసక్తికర డైలాగ్‌ ఉంటుంది.. ‘‘చూడ్డానికి సుత్తిలాగే ఉంటుంది కానీ కొట్టడానికి పనిచేయదు’’ అని. సరిగ్గా ఏపీ టీడీపీలో కొందరి నాయకుల పరిస్థితి అలాగే మారిపోయిందని వారి అనుచరులు తెగ మదన పడిపోతున్నారట. పోయిన వాళ్ళు పక్కపార్టీలోకి పోగా.. పార్టీనే అంటిపెట్టుకుని వేళ్ళాడుతున్న వాళ్ళు ఇంకొందరు మిగిలిపోయారు. వీళ్ళలో వెలుగులో ఉన్నవారు కొందరైతే, అధినేత తీరుతో చీకట్లోకి పోయినోళ్లు ఇంకొందరు. ఇలా నాయకులు చీకటి–వెలుగల్లోనే ఉండిపోతున్నారని గ్రహించి, ఇటీవలే జంబో కార్యవర్గాన్ని ప్రకటించి దానికి ఏపీ అధ్యక్షుడు అంటూ కింజారపు అచ్చెన్నాయుడికి బొట్టు పెట్టేసారు నారా చంద్రబాబు నాయుడు. ఇంత వరకు ఘనంగానే జరిగినట్టుగా ఉంది.

అయితే ఈ జంబో కార్యవర్గంలో ఎవరికీ పని అప్పగించకుండా.. అంతా తానే అయి చంద్రబాబు చేసుకుపోతుండడంతో ఇప్పుడంతా ముక్కున వేలేసుకుంటున్నారట. ముఖ్యంగా వెనుకబడిన సామాజికవర్గాలకు ప్రాధాన్యం అంటూ పలువురికి పదవులు కట్టబెట్టారు. వారెవరికీ కూడా తగినంతగా పని చెప్పడం లేదన్నది సదరు నాయకులతో ఉండే అనుచరులు నొచ్చుకుంటున్నారని రాజకీయవర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

ఇందుకు ముఖ్యంగా ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడినే ఉదాహరణగా వారంతాచూపిస్తున్నారట. అర్భాటంగా పదవి ప్రకటించారని, కానీ బాధ్యత స్వీకారాన్ని మాత్రం తూతూ మంత్రంగానే ముగించేసారన్నది మొట్టమొదటి అభియోగం. ఇంతకు ముందు అసెంబ్లీలో అచ్చెన్నాయుడికి ఇచ్చిన ప్రాధాన్యం కూడా ఇప్పుడు ఇవ్వడం లేదన్నది రెండోది. కనీసం చంద్రబాబు వెనకాలే గతంలో కూర్చునే వారని, కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా తీసేసారని మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గమనించి, ఇప్పుడు చెప్పుకుని వాపోతున్నారు.

దీనికితోడు ఏ కార్యక్రమం చేపట్టానీ చంద్రబాబే ముందుకు దూకేస్తుండడంతో ఇక అచ్చెన్న దూకుడుకు ఛాన్సేదని వాపోతున్నారట. మామూలుగానే దూకుడుగా ఉండే అచ్చెన్నాయుడుకి రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవి వస్తే ఇంకెంత దూడుకుడుగా ఉంటారోనని ఆ పార్టీ నాయకులు భారీ అంచనాలే వేసుకున్నారు. కానీ అందుకు భిన్నంగా పరిస్థితి ఉండడంతో వారంతా డీలా పడిపోతున్నారట.

ఎవరికి ఏ పదవి ఇచ్చినా చంద్రబాబును దాటి పనిచేసేందుకు కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఉండదని అచ్చెన్నాయుడికి పదవి ప్రకటించిన కొత్తలోనే విమర్శకులు తేల్చి చెప్పేసారు. ఇప్పుడుదే నిజమవుతోందని అచ్చెన్న అనుచర వర్గంతో పాటు, ఇదే భావనలో ఉన్న మిగిలిన కీలక నాయకుల అనుచరుల్లో కూడా గుసగుసలు విన్పిస్తున్నాయంటున్నారు.

అయితే చంద్రబాబు భవిష్యత్తు వ్యూహంలో భాగంగానే అచ్చెన్నాయుడిని నెమ్మదింపజేస్తున్నారని, రాన్రాను దూకుడు పెంచడం ఖాయమనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా అనుచరుల వైపునుంచి చూస్తే అన్నీ నిజాలుగానే తోస్తున్నాయి. టీడీపీ మద్దతుదారుల నుంచి చూస్తే వారన్నదీ కరెక్టేనేమో అనిపించకమానదు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడితో సహా, జంబో కార్యవర్గంలో చోటు పొందిన వాళ్ళంతా ఎప్పటికి తమ దూకుడు బైట పెడతారోనన్న ఉత్కంఠత ఇప్పుడు అంతటా కన్పిస్తోందంటున్నారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp