బీజేపీ, టీడీపీలు యంత్రాంగాన్ని అవమానిస్తున్నాయా..?

By Voleti Divakar Apr. 20, 2021, 09:03 pm IST
బీజేపీ, టీడీపీలు యంత్రాంగాన్ని అవమానిస్తున్నాయా..?

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలపై మొన్నటి వరకు గెలుపు పై ధీమా వ్యక్తం చేసిన ఆరెండు పార్టీలు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు కనిపిస్తున్నాయి . అందుకే తిరుపతిలో రీ పోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. నిజంగా గెలిచే పార్టీలైతే రీ పోలింగ్ కోరుకోవు. రీ పోలింగ్ జరిగితే పరిస్థితులు తారుమారవుతాయని భయపడతాయి. అయితే తెలుగుదేశం, బిజెపి పార్టీలు తిరుపతిలో రీ పోలింగ్ జరిపించాలని డిమాండ్ చేయడం ద్వారా పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్టయ్యింది . బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే డిమాండ్ చేస్తున్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సిపి దొంగ ఓట్లు వేయించిందని ఇరు పార్టీల నేతలు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. చంద్రబాబునాయుడు మరో అడుగు ముందుకు వేసి తిరుపతిలో ఏకంగా 2 లక్షల మంది దొంగ ఓటర్లు ఉన్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫోటో గుర్తింపు కార్డు విధానంలో ఇతర వ్యక్తులను పోలింగ్ కు తరలించి దొంగ ఓట్లు వేయించడం దాదాపు అసాధ్యం. నిజమైన ఓటరు స్థానంలో మరో వ్యక్తి చేత ఓటు వేయించడమే దొంగ ఓటు అంటే . ఇందుకోసం పార్లమెంటు పరిధిలోని వందలాది పోలింగ్ కేంద్రాల్లోని వేలాది అధికారులు , సిబ్బందిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. వీరిలో అందరూ అధికార పార్టీకి విధేయతగా ఉండరన్నది స్పష్టం. టిడిపి, బిజెపిలు ఈ విధమైన ఆరోపణలు చేయడం అధికారులు, సిబ్బంది నిబద్ధతను అవమానించడమే అవుతుంది .

ప్రతిపక్షాలు ఆరోపించిన విధంగా గెలుపోటములను ప్రభావితం చేసేంత దొంగ ఓట్లు వేయించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇదే నిజమైతే గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీయే అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించేది. ఇక ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఓటర్లను స్వస్థలాలకు తీసుకుని వచ్చి ఓట్లు వేయించడం అన్ని పార్టీలు చేసే పనే. తిరుపతిలో కూడా ఈ విధానాన్నే అనుసరించి ఉండవచ్చు. ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో.. ఎన్నికలు జరిగిన తీరును తప్పుబట్టడం ఎన్నికలు నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని, అందులో భాగస్వాములైన యంత్రాంగాన్ని నిందించినట్లే భావించాలి.

Also Read : ఫిర్యాదు చేస్తే సరా..? లాజిక్‌తో పనిలేదా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp