Sasikala - అరవ రాజకీయాల్లో చిన్నమ్మ మళ్లీ సందడి.. ?

By Thati Ramesh Oct. 17, 2021, 01:45 pm IST
Sasikala - అరవ రాజకీయాల్లో చిన్నమ్మ మళ్లీ సందడి.. ?

అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమయ్యారనే వార్తలకు బలం చేకూర్చేలా చిన్నమ్మ అడుగులు వేస్తున్నారు. AIADMK అసంతృప్త నేతలకు ఆడియో మెసేజ్ లు పంపడం దగ్గర నుంచి ఆమె చేపడుతున్న సెలెక్టివ్ ఓదార్పు యాత్రలు చూస్తుంటే ఏదో పెద్ద వ్యూహమే ఉన్నట్లు అనుమానించాల్సి వస్తుంది.

భారీ సంఖ్యలో ఉన్న అభిమానగణంతో కలిసి మెరీనా బీచ్ దగ్గర ఉన్న జయలలిత సమాధి దగ్గరకు చేరుకున్న శశికళ, తన నెచ్చలికి పుష్పాంజలి ఘటించి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ర్యాలీలో శశికళ ప్రయాణించిన కారుపై అన్నాడీఎంకే జెండా ఉంచడం పై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ తమ జెండాను ఎలా పెట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శశికళ అభిమానులు కూడా అన్నాడీఎంకే జెండాలతోనే చిన్నమ్మకు స్వాగతం పలకడం మరో విశేషం.

సుమారు 9 నెలల తర్వాత జయలలిత స్మారకాన్ని శశికళ సందర్శించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తన మేనల్లుడు సుధాకరన్ కూడా జైలు నుంచి విడుదలయ్యారు. సుధాకరన్ ను జయలలిత పెంపుడు కుమారుడు అంటూ ప్రచారం జరగగా.. తర్వాత దానిని ఖండిస్తు ప్రకటన చేశారు.

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన శశికళ.. ఈ ఏడాది జనవరిలో విడుదలయ్యారు. ఆ సమయంలో ఆమె జయలలిత సమాది దగ్గరకు వెళ్లేందుకు కోవిడ్ నిబంధనలు కారణంగా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమె కూడా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి సైలెంట్ అయ్యారు. దాదాపు 9 నెలల తర్వాత ఆమె మళ్లీ ఆమె రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారికంగా మద్దతు తెలపలేదు. శశికళ మరో మేనల్లుడైన టీటీవీ దినకరన్ స్థాపించిన ‘అమ్మ మక్కల్ మున్నేట కళగం(ఏఎంఎంకే)’ పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరిగినా అదీ జరగలేదు.

సీఎం స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అన్నాడీఎంకే బలహీనపడుతోందని ఆపార్టీ అభిమానులు బయపడుతున్నారు. పళనిస్వామి, పన్నీరుసెల్వం మధ్య ఆధిపత్యపోరుతోనే గత ఎన్నికల్లో ఓడినట్లు భావిస్తున్నారు. ఈ కష్టసమయంలో శశికళ రీఎంట్రీతో పార్టీకి మేలు జరుగుతుందని కొందరు అసంతృప్తనేతలు భావిస్తున్నారు. అన్నాడీఎంకే స్థాపించి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆ పార్టీ సెలబ్రేషన్స్ కు సమాయత్తం అవుతున్న సమయంలో శశికళ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది.

2024 లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓట్ల శాతం పెంచుకునే వ్యూహంలో భాగంగానే ఈ పరిణామాన్ని చూడాల్సి వస్తుంది. డీఎంకే ను ఎదుర్కుని గెలవాలంటే శశికళ అవసరమని భావిస్తున్నట్లు ఉన్నారు. అందులో భాగంగానే చిన్నమ్మ రీఎంట్రీపై హడావుడి చేస్తున్నారనే వాదన కూడా ఉంది.

Also Read : Manmohan Ex PM- మన్మోహన్ ఆరోగ్య పరిస్థితి మీద మంత్రి కామెంట్స్ తో అనుమానాలు.. వైద్యులు ఏమన్నారంటే?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp