స్టాలిన్ సంచలన నిర్ణయం - రఘురామ రాజన్ ,అరవింద్ సుబ్రమణ్యన్ లతో ఆర్ధిక సలహా మండలి ఏర్పాటు

By Raju VS Jun. 22, 2021, 10:30 am IST
స్టాలిన్ సంచలన నిర్ణయం - రఘురామ రాజన్ ,అరవింద్ సుబ్రమణ్యన్ లతో ఆర్ధిక సలహా మండలి ఏర్పాటు

ప్రధానమంత్రి స్థాయిలో ఆర్థిక సలహాదారులు చాలాకాలంగా ఉన్నారు. కానీ తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఆర్థిక సలహాదారుల మండలి ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఎంకే స్టాలిన్ తాజాగా అంతర్జాతీయ ఆర్థిక నిపుణులతో సలహా మండలి ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఈ సలహా మండలిలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తో పాటుగా నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో, భారత ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్లతో పాటు ఆర్థికవేత్త జీన్ డ్రేజ్ , కేంద్ర ప్రభుత్వ మాజీ ఫైనాన్స్ కార్యదర్శి ఎస్ నారాయణ్ కూడా ఈ డ్రీమ్ టీమ్ లో ఉంటారు. దీనికి సంబంధించి వారి నియామకాలను ఖరారు చేస్తూ గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ అధికారిక ప్రకటన చేశారు.

తమిళనాడు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ఈ బృందాన్ని డ్రీమ్ టీమ్ గా పేర్కొనడం విశేషంగా మారింది. తమిళనాడు ఆర్థిక మంత్రిగా ఉన్న పళివెల్ త్యాగరాజన్ గతంలో యూఎస్, సింగపూర్ వంటి దేశాల్లో బ్యాంకర్ గా పనిచేసిన అనుభవం ఉంది. దాంతో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే యత్నంలో ఈ డ్రీమ్ టీమ్ ప్రయోగం చేసినట్టు చెబుతున్నారు. "రాష్ట్రాభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికోసం అంతర్జాతీయ నిపుణుల అనుభవాన్ని అందిపుచ్చుకుంటే ప్రయోజనం అని భావిస్తున్నాం ”అంటూ పళివెల్ తెలిపారు.

ప్రొఫెసర్ రాజన్ మరియు డాక్టర్ సుబ్రమణియన్ ఇద్దరూ తమిళులే. అదే సమయంలో ఇటీవల రఘురామ్ రాజన్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డీమోనటైజేషన్ వంటివి విఫల ప్రయోగాలుగా ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన నియామకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ప్రొఫెసర్ డుఫ్లో కి తమిళనాడుతో అనుబంధం ఉంది. జె-పాల్ ద్వారా ఆయన పనిచేస్తున్నారు. ఆయన అంతర్జాతీయ అనుభవం మరియు రాష్ట్రంతో ఉన్న సంబంధాలను వినియోగించుకోవాలని నిర్ణయించినట్టు ” పళివెల్ వివరించారు.

అభిజిత్ బెనర్జీ జీవిత భాగస్వామి కూడా అయిన డుప్లో గతంలోనే అబ్దుల్ లతీఫ్ తో కలిసి జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ ( జె పాల్) సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. నారాయణ్ కూడా ‘తమిళనాడులో ద్రావిడ ఇయర్స్- పాలిటిక్స్ అండ్ వెల్ఫేర్’ పుస్తక రచయితగా పరియస్తులు. మొత్తంగా ప్రముఖ ఆర్థిక వేత్తలతో ఏర్పాటు చేసిన ఈ డ్రీమ్ టీమ్ ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరమే.

Also Read : తెలంగాణాతో నీటి తగాదా కొనసాగుతున్న సమయంలో ఏపీకి ఊరటనిచ్చిన ఒడిశా వివాదం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp