మూడు దశాబ్ధాల కల వెలిగొండ ...సాకారం దిశగా జగన్ సమీక్ష

By Siva Racharla Feb. 20, 2020, 11:56 am IST
మూడు దశాబ్ధాల కల  వెలిగొండ ...సాకారం దిశగా జగన్ సమీక్ష

మరో లాతూర్, జనవరి నెలలో బిందె నీరు 5 రూపాయలు, ఫ్లోరైడ్ వలన బాల్యంలోనే పిల్లలు వృద్దులవుతున్నారు, వెయ్యి, పన్నెండొందల అడుగుల్లో కూడ నీళ్లు పడటం లేదు... ఏమి చెయ్యాలి? ఈ సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత అవసరం లేదా?

ఈ సమస్యలు పరిష్కారం కోసం నిర్మించతలపెట్టిన నీటి ప్రాజెక్ట్ శిలాఫలకం మరికొద్ది నెలలలో సిల్వర్ జూబ్లీ చేసుకుంటుంది. ఆ శిలాఫలకం వేసిన నేత 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నా దానికి విముక్తి కలగలేదు...మాటలు తప్ప చిత్తశుద్ధి ఏది.. ?

ఒకటే పరిష్కారం? వెలిగొండ ప్రాజెక్టు..

పశ్చిమప్రకాశం,నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కడప జిల్లాలోని బద్వేల్ ప్రాంత నీటి సమస్యను తీర్చే వెలిగొండ ప్రాజెక్ట్ కోసం 1975 నుంచి అనేక మంది నాయకులు ముఖ్యంగా CPI నాయకులు & మాజి MLA అయిన పూలసుబ్బయ్యగారు,CPM మాజి MLA సూరాపాపిరెడ్డిలాంటి వారు పొరాటం మొదలుపెడితే 1990 నాటికి prof.నాగిరెడ్డిగారి నాయకత్వంలో అన్ని పార్టీల అఖిలపక్షంగా ఉద్యమం చేశారు.

MV రమణారెడ్డి, వైస్సార్, మైసూరా రెడ్డి తదితరులు నిర్వహించిన రాయలసీమ నీటి ఉద్యమంలో వెలిగొండ గురించి కూడా డిమాండ్ చేశారు. అప్పట్లో గిద్దలూరు నియోజకవర్గం నంద్యాల లోక్ సభ పరిధిలో ఉండటం వలన కావచ్చు లేక మార్కాపూరం డివిజన్ గతంలో కర్నూల్ జిల్లాలో ఉండటం వలన కావచ్చు రాయలసీమ ప్రాజెక్టుల మీద చర్చ జరిగిన ప్రతిసారి వెలిగొండ గురించి కూడా మాట్లాడేవారు.

Read Also: నీటి కలల సాకారం దిశగా- మూడు శంకుస్థాపనలు

నాటి రాయలసీమ నీటి ఉద్యమ నాయకులతో చర్చించకుండా ,హడావుడిగా కేవలం 1989 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని NTR 1988 నవంబర్ లో హంద్రి-నీవ, గాలేరు-నగరి పథకాలకు శంకుస్థాపన చేయటంతో పాటు వెలిగొండ సర్వేకు GO విడుదల చేశారు. Technical report 1989లో ప్రభుత్వానికి అందింది. పని జరిగింది మాత్రం శూన్యం.

1989-1994 మధ్య ముగ్గురు కాంగ్రెస్ నాయకుల సిగపట్ల మధ్య వెలిగొండ అటకెక్కింది. రైతు నాయకులు, అప్పటి CPM రాష్ట్ర కార్యదర్శి అయినా కొరటాల సత్యనారాయణ చొరవతో చంద్రబాబు 05-Mar-1996న మొదటిసారి వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. బాబుగారు శంకుస్థాపన అయితే చేశారు కాని కనీసం 2 కోట్లు కూడ వెలిగొండ మీద ఖర్చుపెట్టలేదు.

2004లో YS అధికారంలోకి వచ్చిన తరువాత జలయజ్ఞంలో భాగంగా వెలిగొండకు 27-Oct-2004న బాబుగారు శంకుస్థాపన చేసిన గొట్టిపడియ దగ్గర మళ్ళి శంకుస్థాపన చేసి నిధులు విడుదల చేశారు.మొదట 1996లో 980 కోట్ల అంచనా కాగా 2005 నాటికి 5,500 కోట్లకు చేరింది.YS 2004లోనే హంద్రి-నీవ, గాలేరు-నగరి ప్రాజెక్టులకు కూడ పునఃశంకుస్థాపనలు చేసి పనులు మొదలు పెట్టారు.

YS వెలిగొండతోపాటు ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టు మరియు రామతీర్ధం రిజర్వాయర్లకు కూడ 2004లోనే శంకుస్థాపన్లు చేసి 2009 ఎన్నికలకు ముందే వాటిని పూర్తి చేసి ప్రారంబోత్సవం చేశారు.ఇప్పుడు ఒంగోల్ టౌన్ & డివిజనుకు ఈప్రాజెక్టుల నుంచే తాగు & సాగు నీరు అందుతుంది. నాగార్జున సాగర్ కుడికాలువ రామతీర్ధం రిజర్వాయర్ లో కలుస్తుంది.

వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం,నెల్లూరు జిల్లాలో తీవ్ర కరువు ప్రాంతాలకు మరియు కడప జిల్లా బద్వేల్ ప్రాంతానికి సాగు & తాగు నీరు అందించటం కోసం ఉద్దేశించినది.

ప్రాజెక్టు వివరాలు

శ్రీశైలం డ్యాం ఎగువున నల్లమల అడవిలో "కొల్లం వాగు" కృష్ణా నదిలో కలిసేచోట నుంచి gravity తో 43.5TMCల వరద నీటిని 200 మీటర్ల approach canalతో నీటిని పారించి అక్కడి నుంచి 18.8 కి.మీ పొడవున 2 సమాంతర సొరంగాల (tunnels) ద్వారా దోర్నాల-కర్నూల్ రహదారిలో "కొత్తూరు" వరకు నీటిని పారించి అక్కడ నుంచి సుమారు 22 కి.మీ పొడవైన కాలువ ద్వార పారించి "నలమల సాగర్"లో నిలవ చేసి అక్కడి నుంచి వివిధ కాలువల ద్వార నిర్దేశిత ప్రాంతాలకు నీటిని అందించాలి.

Read Also: ఆశలు రేపుతున్న జగన్-నీటి ప్రాజెక్టులు

కొండల శ్రేణిలో గ్యాప్ వున్న సుంకేసుల, గొట్టిపడియ మరియు కాకర్ల అనే మూడు ఊర్ల దగ్గర గోడలలాగ ఆనకట్టలు కట్టి సుమారు 20 కి.మీ పొడవైన సహజమైన "నలమల సాగర్" రిజర్వాయర్ను నిర్మించారు. ఇలాంటి సహజమైన రిజర్వాయర్ మరొకటి మనదగ్గరలేదు.ఈ రిజర్వాయర్ నల్లమలను ఆనుకొని వుండటం వలన అనేక అడవి వాగులు వచ్చి ఇందులో కలుస్తున్నాయి.

నలమలసాగర్ నుంచి 5 కాలువ ద్వారా నీటిని నెల్లూరు జిల్లా ఉదయగిరి, కడప జిల్లా బద్వేల్,ప్రకాశం జిల్లలో వున్న 23 మండలాల లోని 15 లక్షల మందికి తాగునీరు 4.38 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలి అన్నది లక్ష్యం.

నలమల సాగర్ పూర్తి అయ్యింది, అన్ని కాలువలు దాదాపు పూర్తి అయ్యాయి కాని కృష్ణా నది నుంచి నీటిని నలమలసాగరుకు చేరే రెండు సొరంగాలు (టన్నెల్లు) పూర్తికాలేదు. ఈ టన్నెల్లు తవ్వటానికి 2006లో జర్మని నుంచి మిషనులు(TBM) తెప్పించారు.అవి కొద్ది దూరం సొరంగాన్ని తవ్విన తరువాత ఇసుక, మెత్తని మట్టి రావటంతో ఆగిపోయేవి.రిపేరు చెయ్యటానికి నెలల కొద్ది సమయం పట్టేది,ప్రతిసారి జర్మని నుంచి ఇంజనీర్లు రావాల్సి వచ్చేది.

అడవిలోకి ఈమిషన్లను చేర్చటానికి కూడ అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. వెలిగొండ సొరంగాలు తవ్వుతున్న ప్రాంతం నల్లమల అటవి ప్రాంతం కావటం పైగా అది టైగర్ రిజర్వుడ్ జోన్ కావటంతో భారీ వాహనాలు వెళ్ళటం కష్టం అయ్యింది,ఒక దశలో మిషన్లను నది మార్గంలో తరలించాలని భావించారు.

బాల అరిష్టాలు దాటుకొని 2007 చివరి నుంచి పనులు నిరంతరాయంగా జరగటం మొదలైంది.

2014 ఎన్నికల నాటికి మొత్తం 18.8 కి.మీ. కాను మొదటి సొరంగం 12.06 కి.మీ,రెండవ సొరంగం 8.747 కి.మీ పూర్తి అయ్యాయి. 2014లో బాబుగారు అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సంవత్సరం వెలిగొండని పట్టించుకోలేదు.14-May-2015న బాబుగారు వెలిగొండ ప్రాజెక్ట్ను సందర్శించి కాంట్రాక్టరుకు 2016 చివరికి పనులు పూర్తి కావాలని గట్టి హెచ్చరిక చేశారు.దీనితో పనులు మళ్ళీ మొదలయ్యాయి.2016 చివరికి పనులు పూర్తి కాకపోవటంతో గడువును 2017 జూనుకు పెంచారు అయినా పనులు పూర్తి కాలేదు.

బాబుగారు రెండవసారి 16-Apr-2016న వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి పనుల జరుగుతున్న తీరు మీద అసహనం వ్యక్తంచేసి 2018 నాటికి "మొదటి దశ" 100% పనులు పూర్తి కావాలని గట్టి హెచ్చరిక చేశారు.

Read Also: ఏమి చెయ్యాలి?

మొదటి దశ అంటే కనీసం ఒక్క సొరంగం అన్న పూర్తి చెయ్యాలని లక్ష్యం, దాదాపు అన్ని ప్రాజెక్టుల్లో ఇలా మొదటి దశలు ప్రవేశపెట్టారు.

2014 నుంచి 2016 జూన్ నాటికి సొరంగం తవ్వింది అక్షరాల 980 మీటర్లు అంటే ఒక కిలోమీటర్ పనులు కూడ గత 2 సంవత్సరాలలో పూర్తి కాలేదు. 2016 జూన్ నుంచి నేటి వరకు తవ్వింది దాదాపు 750 మీటర్లు, అది ఒక సొరంగం మాత్రమే.మొత్తంగా గత మూడు సంవత్సరాల్లొ సొరంగం తవ్వింది 1.7 కి.మీ ,ఇంకా తవ్వపలసింది మొదటి సొరంగం 4 కి.మీ పైన,రెండవ సొరంగం దాదాపు 7.5 కి.మీ,ఇది వెలిగొండ ప్రగతి.

వెలిగొండకు ప్రధాన సమస్య నిధులు! డబ్బులు ఇవ్వకుండ ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని గడువులు పెట్టినా లాభంలేదు.

2015 బడ్జెట్లో 153 కోట్లు,2016 & 2017 బడ్జెట్లలో కేవలం 200 కోట్ల చొప్పున నిధులు ఇచ్చారు.ప్రాజెక్టు పూర్తి కావటానికి కావలసిన మొత్తం నిధులు 2,800 కోట్లు.ఇలా 150, 200 కోట్లు ఇచ్చి వెలిగొండని ఎప్పటికి పూర్తి చేస్తారు? అసలు పూర్తి చేసే ఉద్దేశ్యం వుందా?

తీర్ధయాత్రలకు వెళ్ళినట్లు అధికారపార్టి నాయకులు వెలిగొండ యాత్రకు వెళ్లారు .ఏ పదవి లేదని అసంతృప్తితో వున్న గాలి ముద్దుకృష్ణమ నాయుడి అధ్యక్షతన "ప్రాజెక్టుల పురోగతిని" పరిశీలించటానికి ఒక కమిటీని వేశారు.ఈ కమిటీ వెలిగొండను సందర్శించటానికి నెల ముందే కరెంటు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ కరెంట్ సరఫరా నిలిపేసింది.మూడు నాలుగు నెలలుగా కాంట్రాక్టర్ కూలి డబ్బులు ఇవ్వకపోవటంతో ఒరిస్సా నుంచి వచ్చిన కూలీలు వెనక్కు వెళ్ళిపోయారు.

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవటంతో ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు కొన్ని వారల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. నాలుగు కోట్లు బకాయి ఉంటే ఒక కోటో కోటిన్నరో కట్టి విద్యుత్ సరఫరా పునరుద్దించుకొనేవారు.. 4,5 నెలలు గడిచేసరికి కరెంట్ బిల్లు పెరగటం విద్యుత్ సరఫరా ఆగిపోవటం... ప్రతి సంవత్సరం ఇదే తంతు ..

పోలవరంలో చేసినట్లే వెలిగొండ పనులకు కూడా 2018 మార్చ్ లో 60(సి) నిబంధన కింద కొత్త కాంట్రక్టర్ ను తీసుకొచ్చి మొదటి టన్నెల్ కు 292 కోట్లు,రెండవ టన్నెల్ కు 720 కోట్లు అంచనాలకు అనుమతి ఇచ్చారు. మా బకాయిల సంగతేమిటి అంటూ పాత కాంట్రాక్టర్ నిలదీయడంతో 2018 ఆగస్టులో చంద్రబాబు వద్ద పంచాయితీ చేసి పాత కాంట్రాక్టర్ ఉద్యోగులకు ఐదు నెలల జీతాలతో పాటు యంత్రాల లీజు కింద కొంత మొత్తాన్ని ఇవ్వటానికి ఒప్పందం కుదిరింది.

2018 ఆగస్టు లెక్కల ప్రకారం 18.82 కి.మీ పొడవైన మొదటి టన్నెల్ 15.20 కి.మీ పనులు పూరికాగా 3.62 కి.మీ తవ్వవలసి ఉంది. రోజుకు 22 మీటర్ల చొప్పున 160 రోజుల్లో అంటే 2019 జనవరి నాటికి సొరంగం తవ్వేస్తామని చంద్రబాబు చెప్పారు. దాని ఆధారముగా ఎన్నికలకన్నా ముందే వెలిగిండ నుంచి నీళ్ళుఇస్తామని చంద్రబాబు భావావేశంతో ప్రకటించారు.

Read Also: నెరవేరుతున్న ఎగువ పెన్నా రైతుల కలలు - నీటి ప్రాజెక్టులు


2018 జూన్ నెలలో టన్నెల్ తవ్వకం మొదలు పెట్టిన రోజే కన్వేయర్ బెల్టు తెగిపోయింది. దీనితో ఐదు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. అక్టోబర్ నెలలో తాత్కాలిక మరమత్తులు చేసి టన్నెల్ తవ్వకం మొదలుపెట్టారు కానీ అవి ఎక్కువ రోజులు కొనసాగలేదు.

హెడ్ రెగ్యులేటర్ నిర్మిస్తున్న కొల్లం వాగు ప్రాంతానికి శ్రీశైలం నుంచి బోట్లో అడివిలో పోవాలి. ఇది శ్రమ, ఖర్చుతో కూడుకున్న పని కావటటంతో హెడ్ రెగ్యులేటర్ పనులు వాస్తవంగా ఎంత జరిగాయన్నది అధికారులకు కూడా అనుమానమే. 2017 చివరిలో మొదలుపెట్టిన హెడ్ రెగ్యులేటర్ పనులలో అశ్రద్ధ అవినీతితో పురోగతి లేకుండా పోయింది. ఈఈ స్థాయి అధికారి సెలవు పెట్టి మరి సబ్ కాంట్రాక్టు కింద పని తీసుకొని 11.96 కోట్ల అక్రమ బిల్లు పెట్టాడు. అప్పటి ENC జబ్బార్ కు అనుమానం వచ్చి విచారణ జరపడంతో అవినీతి వెలుగులోకి వచ్చింది.
జగన్ ముఖ్యమంత్రి అయిన చేపట్టిన తరువాత రివర్స్ టెండర్లో భాగంగా వెలిగొండ పనులలో 61.76 కోట్లు ఆదా అయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రాజెక్టు పూర్తే లక్ష్యంగా జగన్ సమీక్ష

అధికారుల లెక్క ప్రకారం నేటికి మొదటి సొరంగం 18.82 కి.మీ కాగా 17.2 కి.మీ ,రెండవ టన్నెల్ 11 కి.మీ తవ్వటం ,హెడ్ రెగ్యులేటర్ వద్ద 600 మీటర్ల సొరంగం పూర్తయ్యింది.

ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ టన్నెల్ వద్దే స్వయంగా పనుల పురోగతిని రివ్యూ చేస్తుండటం,హెడ్ రెగ్యులేటర్ పనులను కూడా పరిశీలించనుండటంతో వెలిగొండ పనుల మీద ఒక వాస్తవ అంచనాకు రావచ్చు. ముందుగా ప్రకటించినట్లు ఈ జూన్ నాటికి పనులు పూర్తి చేయటం సాధ్యం కాకపోవచ్చు. ఈ రోజు రివ్యూ తరువాత ముఖ్యమంత్రి జగన్ ఒక వాస్తవిక లక్ష్యాన్ని ప్రకటించి ,దాని ప్రకారం నిధులను కేటాయించాలి.

Read Also: నీటి వాడకం మీద ఆంధ్రజ్యోతి విష ప్రచారం ఎందుకు? అనంతపురం రైతుల మీద కోపమా?

చంద్రబాబు "అన్ని నేనే" మాటలు విని ప్రజలు విసిగెత్తిపోయారు.వెలిగొండకు నేనే పునాది వేసాను అని గర్వంగా చెప్పుకుంటున్న చంద్రబాబును 13 సంవత్సరాలు ముఖ్యంమత్రిగా ఉండికూడా వెలిగొండను  పూర్తిచేయకపోవటాన్ని బాబు వేసిన శిలాఫలకమే వెక్కిరిస్తుంది.

జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ మొదలు పెట్టిన వెలిగొండ 2014 నాటికి 65-70% పనుల్లో పూర్తైనా గత ఐదేళ్లలో కనీసం 6 కి.మీ సొంరంగం పనులు పూర్తి చేసి నీళ్లు ఇవ్వలేక పోయిన చంద్రబాబు మభ్యపెట్టే మాటలు ప్రజలు నమ్మరు.

ఈ రోజు రివ్యూ తరువాత జగన్ వెలిగొండ పనుల పూర్తికి ఒక నిర్దిష్ట అది కూడా వాస్తవిక లక్ష్యాన్ని ప్రకటించాలి..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp