పెగాసస్‌ నిఘా – సుప్రిం కీలక నిర్ణయం

By Karthik P Sep. 23, 2021, 01:00 pm IST
పెగాసస్‌ నిఘా – సుప్రిం కీలక నిర్ణయం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులు, మీడియా, న్యాయ, వ్యాపార రంగాల్లోని ప్రముఖులు, సామాజిక కార్యకర్తలపై పెగాసస్‌ స్పైవేర్‌తో నిఘా పెట్టిందనే ఆరోపణల నేపథ్యంలో.. దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సమగ్రతకు, వ్యక్తిగత గోప్యతకు ముప్పుగా పరిణమించిన ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రిం కోర్టు ఈ రోజు తన నిర్ణయాన్ని వెలువరించింది. పెగాసస్‌ నిఘా వ్యవహారాన్ని తేల్చేందుకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కమిటీ ఏర్పాటుపై వచ్చే వారం ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది.

సుప్రిం తాజా నిర్ణయంతో పెగాసస్‌ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఎన్ని ఆరోపణలు వచ్చినా. రాజకీయ పార్టీలు, పౌర సమాజం నుంచి విమర్శలు, ఒత్తిడిలు వచ్చినా.. పెగాసస్‌ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నోరు విప్పలేదు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు రోజు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత.. ప్రతి రోజు సమావేశాల్లో ఈ అంశంపై దర్యాప్తు చేయాలని, ప్రధాని ప్రకటన చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. సభా కార్యకలాపాలు స్తంభింపజేశాయి. అయినా మోదీ నోట నుంచి మాట రాలేదు. ఈ నేపథ్యంలో పలువురు సుప్రింను ఆశ్రయించారు.

Also Read : హెరాయిన్ కథలో విజయవాడ తర్వాత ఇప్పుడు కృష్ణపట్నం

సుప్రిం కోర్టు కూడా ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 13వ తేదీన జరిగిన విచారణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ.. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. ‘‘ కారణాలు ఏమైనా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడానికి ఇష్టపడడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఈ కారణంచేతనే తాము మధ్యంత ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. ఆ మేరకు ఈ రోజు సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కమిటీలో ఎంత మంది సభ్యులు ఉండాలి..? ఎవరిని సభ్యులుగా నియమించాలని..? అనే అంశాలపై నిర్ణయం తీసుకునేందకే వారం రోజుల గడువును సుప్రిం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ది వైర్, వాషింగ్టన్‌ పోస్టు వంటి వార్తా సంస్థలు ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందనే కథనాలు రాయడంతో.. ఈ విషయంపై దుమారం రేగింది. నిఘా జాబితాలో జర్నలిస్టులు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్, వివిధ రాజకీయ పార్టీల ముఖ్యనేతలు, సుప్రిం కోర్టు న్యాయమూర్తి, సుప్రిం కోర్టు ముఖ్య సిబ్బంది, వ్యాపార వేత్తలు ఉన్నారని పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. కర్ణాటకలోని కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి పెగాసస్‌ నిఘానే కారణమని వార్తలు రాయడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read : కోవిడ్ మృతులకు పరిహారం.. రాష్ట్రాలపైకి నెట్టేసిన కేంద్రం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp