నాగ‌లి ప‌ట్టిన రైతు గుర్తొచ్చాడు

By G.R Maharshi Jun. 23, 2021, 02:07 pm IST
నాగ‌లి ప‌ట్టిన రైతు గుర్తొచ్చాడు

బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాలు ఏక‌మ‌య్యే స‌మావేశం మంగ‌ళ‌వారం జ‌రిగింది. శ‌ర‌ద్‌ప‌వార్‌, ఒమ‌ర్ అబ్దుల్లా, య‌శ్వంత్ సిన్హా త‌ప్ప గ‌ట్టి నాయ‌కులు లేరు. అయితే ఒక అడుగైనా ప‌డింది. పాట‌ల ర‌చ‌యిత జావేద్ అక్త‌ర్ కూడా స‌మావేశంలో వుండ‌డం విశేషం. చ‌రిత్ర త‌న‌ని తాను తిర‌గ‌రాసుకుంటూ వుంటుంది.

చిన్న‌ప్పుడు పాత కాంగ్రెస్‌, కొత్త కాంగ్రెస్ గోడ రాత‌లు చూసిన‌ట్టు గుర్తు. ఊహ బాగా తెలిసేస‌రికి ఇందిర‌మ్మే ప్ర‌ధాని. ఎమ‌ర్జెన్సీ త‌ర్వాత స్కూల్లో నిరంతరం 20 సూత్రాల‌పై ర‌క‌ర‌కాల పోటీలుండేవి. నేను ఉప‌న్య‌సించాను కానీ, ఎంత బ‌ట్టీ ప‌ట్టినా ఆ సూత్రాలు గుర్తుకు రాలేదు. నేను టెన్త్‌లో వుండ‌గా పెద్ద వాళ్ల మాట‌ల్లో తెలిసింది ఏమంటే ఎమ‌ర్జెన్సీలో చాలా ఘోరాలు జ‌రిగాయ‌ని, జేపీ అనే వ్య‌క్తి నార్త్ ఇండియా అంతా ఏకం చేస్తున్నాడ‌ని. అయినా ఇందిర‌మ్మ మ‌హాశ‌క్తి. ఆమెని ఎవ‌రూ ఏం చేయ‌లేరు అనుకునే వాన్ని.

77లో ఎన్నిక‌లు. నాగ‌లి ప‌ట్టిన రైతు జ‌న‌తా గుర్తుగా వ‌చ్చాడు. ఆ బొమ్మ ఇష్ట‌మే కానీ, ఆవుదూడ అంత కాదు (రైతుల్ని ఒక మూల‌కి నెట్టేసిన‌ట్టే రైతు గుర్తులు కూడా ఇప్పుడు ఎన్నిక‌ల్లో లేవు). కాంగ్రెస్ త‌ర‌పున పుల‌య్య‌, జ‌న‌తాకి మాజీ జ‌డ్జి నారాయ‌ణ‌స్వామి , సీపీఐకి నీలం రాజ‌శేఖ‌ర‌రెడ్డి అనంత‌పురంలో నిల‌బ‌డ్డారు. వాళ్లిద్ద‌రు తెలియ‌దు కానీ, నీలం రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు ప‌రిచ‌య‌మే. సాయిన‌గ‌ర్‌లో వాళ్లింటి మీదుగా స్కూల్‌కి వెళ్లేవాన్ని. ప్ర‌చారం జోరుగా సాగినా జ‌న‌తా ఓడిపోయింది.

ఉద‌యం నుంచి కౌంటింగ్‌. రాత్రి 9కి ఫ‌లితం. సంతోషంతో నిద్ర‌పోయాను. అర్ధ‌రాత్రి రోడ్డు మీద పెద్ద కేక‌లు. ఆవూ, దూడ రెండూ ఓడిపోయాయ‌ని కొంత మంది అరుస్తూ వెళుతున్నారు. ఇందిర‌, సంజ‌య్ ఇద్ద‌రూ ఓడిపోయారు. జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ ప‌వ‌ర్ అర్థ‌మైంది.

ఎమ‌ర్జెన్సీలో జ‌రిగిన ఘోరాలు సీరియ‌ల్‌గా వ‌చ్చాయి. ల‌లితాక‌ళాప‌రిష‌త్‌లో ఆస్కార్ ఫెర్నాండేజ్ వ‌చ్చి జైల్లో త‌న‌ని ఎంత హింసించారో చెబితే క‌ళ్ల‌లో నీళ్లొచ్చాయి. జ‌న‌తాలో రాజ్‌నారాయ‌ణ్ అనే క‌మెడియ‌న్ ఇందిర‌ని ఓడించాడు. గెలిచిన త‌ర్వాత గ‌డ్డాలు, మీసాలు తీసేశాడు. జ‌న‌తా కొంప కూల్చ‌డానికి ఇత‌నూ ఒక కార‌ణం. రాజ‌కీయాలపై ఆస‌క్తి పెరిగినా ఇందిర‌మ్మ అంటే అభిమాన‌మే, కోపం లేదు. షా క‌మిష‌న్ పేరుతో వేధిస్తున్నార‌ని బాధ‌.

జ‌న‌తా ఫైటింగ్ ఎక్కువైనప్పుడు క‌మెండో ప‌త్రిక‌లో ఒక కార్టూన్ వ‌చ్చింది. ఒక కాగ‌డా ప‌ట్టుకుని రాజ్ నారాయ‌ణ్ నేను మీతో వ‌స్తా అంటూ వుంటే మిగిలిన నాయ‌కులు పిక్క బ‌లం కొద్దీ పారిపోతూ వుంటారు. వేసిందెవ‌రో తెలియ‌దు కానీ, చాలా సేపు నవ్వాను.

ఎన్టీఆర్ వ‌చ్చే వ‌ర‌కూ ఇందిర‌మ్మ‌కి ఎదురు లేదు. రాజీవ్‌గాంధీ పాల‌న త‌ర్వాత నేష‌న‌ల్ ఫ్రంట్ వ‌చ్చింది. వీపీ సింగ్ ప్ర‌ధాని. ఎన్టీఆర్ బ్యాడ్ ల‌క్ ఏమంటే 89లో ఓడిపోక పోతే కేంద్రంలో చ‌క్రం తిప్పేవాడే. ఫ్రంట్ విఫ‌లం. గుజ్రాల్‌, దేవెగౌడ కూడా ప్ర‌ధానుల‌య్యారు. జ్యోతిబ‌సు అయి వుంటే క‌మ్యూనిస్టు ప్ర‌ధాని ఎలా వుంటాడో దేశానికి అర్థ‌మ‌య్యేది. మంచో, చెడో ఒక చారిత్రిక త‌ప్పిదం.

ప్ర‌తిప‌క్షాల‌ను చూశాక కాంగ్రెస్సే మేల‌నుకున్నారు. ఇంత‌లో బీజేపీ బ‌ల‌ప‌డింది. ఒక గ‌ట్టి నాయ‌కుడుంటే న‌ష్టం, లాభం రెండూ వుంటాయి. చిల్ల‌ర‌మ‌ల్ల‌ర నాయ‌కులు అత‌న్ని బెదిరించ‌లేరు, ప్ర‌భుత్వం బ‌లంగా వుంటుంది. ఇది లాభం.

న‌ష్టం ఏమంటే కాల‌క్ర‌మంలో అత‌ను నియంతగా మార‌తాడు. వ్య‌క్తి పూజ పెరుగుతుంది. అత‌ని అభిప్రాయాలే ప్ర‌జ‌ల అభిప్రాయాలుగా మారుతాయి. చ‌రిత్రంతా ఇదే. ఇందిర‌మ్మ , త‌ర్వాత మోదీ ఇక్క‌డ‌.

కాంగ్రెస్ బ‌ల‌హీనంగా వుంది. వ్యాక్సిన్ లేదు. రాహుల్ బ‌తికిస్తాడ‌నే ఆశ లేదు. మిగ‌తా పార్టీల్లో బ‌లం త‌క్కువ‌, ఆశ ఎక్కువ‌. ప్ర‌తి ఒక్క‌రూ తాము ప్ర‌ధాని అభ్య‌ర్థుల‌మ‌ని అనుకుంటారు. అహంకారాన్ని జ‌యించలేని వాళ్ల‌కి అధికారాన్ని ఇస్తే దురంహ‌కారు లుగా మారుతారు. వీళ్లంతా క‌లిసి ఏకాభిప్రాయానికి రావ‌డం ఇప్ప‌ట్లో క‌ష్ట‌మే.

మోదీ ప్ర‌త్యేకత ఏమంటే గ‌ట్టి ప్ర‌తిప‌క్షాన్ని ఆయ‌నే త‌యారు చేసుకుంటారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp