మమత ఓటమి వెనుక ఓ వ్యూహం!

By Ramana.Damara Singh May. 06, 2021, 05:31 pm IST
మమత ఓటమి వెనుక ఓ వ్యూహం!

పశ్చిమ బెంగాల్లో వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించి హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాల్సి ఉంటుంది.
ఆమె నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ఎవరి ఊహాలకు అందని రీతిలో 213 సీట్ల భారీ మెజారిటీ సాధించినా.. నందిగ్రామ్ లో పార్టీ అధినేత్రి మమత ఓడిపోవడం ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులను నిరాశపరిచింది. ఆమె నందిగ్రామ్ వెళ్లడమే తప్పు అన్నట్లు చాలామంది మాట్లాడుతున్నారు. అయితే అలా వెళ్లడం వెనుక.. తాను ఓడినా పార్టీని గెలిపించుకోవాలన్న ఆమె వ్యూహం ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. ఆ వ్యూహమే టీఎంసీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చింది.

సువేందును దిగ్బంధించేందుకే..

దమ్ముంటే తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్ లో తనతో తలపడాలని మాజీ సహచరుడు, బీజేపీ నేత సువేందు అధికారి సవాల్ చేయడంతో మమత తన సొంత నియోజకవర్గం భవానీపూర్ వదిలి అక్కడి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. బీజేపీ కావాలనే సువేందు అధికారి ద్వారా సవాల్ చేయించి, రెచ్చగొట్టి మమతను నందిగ్రామ్ కు రప్పించి ఓటమి ఉచ్చులో ఇరికించిందని టీఎంసీ, బీజేపీ నేతలు అనుకున్నారు. కానీ మమత ఏం తక్కువ తినలేదు. రివర్స్ వ్యూహంతో బీజేపీ నేతలనే ఇరికించింది. తన గెలుపును ఫణంగా పెట్టి నందిగ్రామ్ వెళ్లడం ద్వారా సువేందు అధికారి కుటుంబాన్ని నియోజకవర్గం దాటి బయట కాలు పెట్టలేని పరిస్థితి కల్పించింది. తద్వారా బీజేపీ మరికొన్ని సీట్లు గెలవకుండా అడ్డుకోగలిగింది.

బీజేపీ జోరుకు అడ్డుకట్ట

తృణమూల్ కాంగ్రెస్ తోనే ఎదిగి పార్టీలో నంబర్ టూ స్థానం పొందిన సువేందు అధికారి బీజేపీలో చేరి సీఎం అవ్వాలనుకున్నారు. రాష్ట్రంలో బలమైన నాయకత్వం, క్యాడర్ లేని బీజేపీకి సువేందు ద్వారా కొంతవరకు ఆ లోటు తీరే మార్గం దొరికింది. సువేందు కుటుంబానికి నందిగ్రామ్ ఉన్న తూర్పు మిడ్నాపూర్ తో పాటు పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని 25 నుంచి 30 నియోజకవర్గాల్లో మంచి పట్టు, బలగం, బంధుగణం ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో వారు చెప్పినవారే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతుంటారు. ఒక్క సువేందు కుటుంబంలోనే ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు.

అటువంటి సువేందును ఢీకొనేలా చేసి మమతను రాజకీయంగా, మానసికంగా దెబ్బతీయాలన్నది కమలనాథుల వ్యూహం. కానీ మమత వేరే విధంగా ఆలోచించారు. నందిగ్రామ్ లో తను గెలవడం కష్టమని మూడు దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న ఆమెకు తెలుసు. తాను గెలవడం కంటే పార్టీ గెలుపు ముఖ్యమని భావించారు. తాను నందిగ్రామ్ వెళితే పోటీ తీవ్రతరమై సువేందు కుటుంబం ఇతర నియోజకవర్గాలపై దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడుతుంది.. అది తన పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను మెరుగుపరుస్తుందని భావించారు. మిడ్నాపూర్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో తొలిదశలో మార్చి 27న పోలింగ్ జరిగింది. అంతవరకు నందిగ్రామ్ లోనే ఉంది ప్రచారం చేశారు. మమత
అనుకున్నట్లే జరిగింది.

సీఎం స్వయంగా రంగంలోకి దిగడంతో సువేందు కుటుంబం తమ పంతం నెగ్గించుకునేందుకు పూర్తిగా నందిగ్రామ్ పైనే దృష్టి పెట్టింది. మిగతా నియోజకవర్గాల గురించి ఆలోచించే పరిస్థితే లేకపోయింది. అంత కష్టపడినా గత ఎన్నికల్లో సాధించిన 81 వేల మెజారిటీ పోయి చివరి వరకు ఉత్కంఠను ఎదుర్కొని కనాకష్టంగా సుమారు 1900 ఓట్లతో సువేందు బయటపడ్డారు. దాంతో ఆయనకు గెలుపు ఆనందం.. సీఎం అవకాశం రెండూ లేకుండా పోయాయి. మరోవైపు మమత మాత్రం తొలి విడతలో తన నియోజకవర్గానికి పరిమితమైనా.. మిగిలిన దశల్లో తమ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం చేసుకోగలిగారు. అదే సమయంలో సువేందు కుటుంబానికి పట్టున్న మిడ్నాపూర్ జిల్లాల్లో వారిని కాలు పెట్టనివ్వకుండా చేసి.. దాదాపు 20 నుంచి 30 నియోజకవర్గాల్లో బీజేపీ విజయావకాశాలకు గండి కొట్టగలిగారు. బీజేపీ వంద సీట్ల మార్క్ కూడా దాటలేకపోవడానికి ఇదో కారణమని బెంగాల్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp