కోవిడ్ మృతులకు పరిహారం.. రాష్ట్రాలపైకి నెట్టేసిన కేంద్రం

By Ramana.Damara Singh Sep. 23, 2021, 12:10 pm IST
కోవిడ్ మృతులకు పరిహారం.. రాష్ట్రాలపైకి నెట్టేసిన కేంద్రం

కోవిడ్ సంక్షోభం మొదలైనప్పటి నుంచీ అన్నింటినీ తానే పర్యవేక్షిస్తున్నానని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఆర్థిక భారాన్ని మాత్రం రాష్ట్రాలపైకి నెట్టేసింది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నట్లు చెప్పిన కేంద్రం.. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.50 వేలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఆ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం రాష్ట్రాల విపత్తు సహాయ నిధి నుంచి చెల్లింపులు చేయాలని ఆదేశించింది. ఆ విధంగా తన బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో ఇది మరింత భారంగా పరిణమిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి.

ఇవ్వలేమని మొదట కేంద్రం వాదన

కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గత మే నెలలో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ సందర్బంగా పిటీషనర్లు తమ వాదన వినిపిస్తూ 2005 నాటి విపత్తుల నియంత్రణ చట్టానికి కేంద్రం 2015లో కొన్ని సవరణలు చేసిందని, దాని ప్రకారం విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు జాతీయ లేదా రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి రూ.4 లక్షల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు దృష్టికి తెచ్చారు. కోవిడ్-19ను కేంద్రం మహా విపత్తుగా ప్రకటించినందున కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం వర్తిస్తుందని వాదించారు.

Also Read : స్వాములందు 'ఆనంద గిరి' వేరయా, మొదటి నుంచి వివాదాలే!

అయితే పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినందున పరిహారం ఇవ్వడం ఆర్థిక భారంగా మారుతుందని, కోవిడ్ నియంత్రణ చర్యలకు ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నందున అదనంగా పరిహారం ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం స్పష్టం చేసింది. ఈ వాదనను తోసిపుచ్చిన కోర్టు పరిహారం ఇవ్వాల్సిందేనని.. దానికి సంబంధించిన మార్గదర్శకాలు సమర్పించాలని జూన్లో జరిగిన విచారణ సందర్బంగా ఆదేశించింది. దాంతో ప్రతి మృతుని కుటుంబానికి రూ.50 వేలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తాజా విచారణ సందర్బంగా కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. ఆ మేరకు జాతీయ విపత్తు నియంత్రణ సంస్థ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే రాష్ట్రాల విపత్తు సహాయ నిధి నుంచి చెల్లింపులు జరపాలని మెలిక పెట్టింది.

కేంద్ర నిర్ణయంపై అసంతృప్తి

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు తమపై భారం మోపుతోందని విమర్శిస్తున్నాయి. కోవిడ్ నియంత్రణ చర్యలు, కార్యక్రమాలన్నీ మొదటి నుంచీ కేంద్రం ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. మందులు, ఆక్సిజన్, పరికరాలు, వ్యాక్సిన్లు.. ఇలా అన్నింటినీ కేంద్రమే పర్యవేక్షిస్తోంది. స్థానికంగా వాటి అమలునే రాష్ట్రాలు పర్యవేక్షిస్తున్నాయి. కానీ ఆర్థిక అందమైన పరిహారం చెల్లింపులను మాత్రం కేంద్రం తీసుకోకుండా.. రాష్ట్రాలపైకి నెట్టేయడం విమర్శల పాలవుతోంది.

ఏడాదిన్నరకుపైగా కోవిడ్ సంక్షోభంతో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. రాష్ట్రాల ఆదాయం పడిపోయింది. మరోవైపు జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పన్ను ఆదాయం తగ్గిపోయి.. కేంద్రంపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు కరోనా నియంత్రణ చర్యలకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయాల్సి వస్తోంది. దాంతో దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో కురుకుపోయాయి. ఏ నెలకు ఆ నెలే సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వేల సంఖ్యలో ఉన్న కోవిడ్ మృతుల కుటుంబాలకు రాష్ట్రాల విపత్తు సహాయ నిధి నుంచి పరిహారం చెల్లించమనడం తగదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Also Read : డ్రగ్స్ కేసు బండి సంజయ్ కు మైనస్ అయ్యిందా ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp