ఏపీ : తేడా వ‌స్తే త‌క్ష‌ణ‌మే యాక్ష‌న్‌!

By Kalyan.S Oct. 28, 2020, 05:21 pm IST
ఏపీ : తేడా వ‌స్తే త‌క్ష‌ణ‌మే యాక్ష‌న్‌!

అవినీతిని అంత‌మొందించ‌డంలోనే కాదు.. విధి విధానాల‌లోనూ, శాఖ‌ల వారీగా ప‌ని విధానంలోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎక్క‌డ ఏ విధ‌మైన పొర‌పొట్లు జ‌రిగినా వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ఏపీ ప్ర‌భుత్వం వేగంగా స్పందిస్తోంది. ప్ర‌జా ప్ర‌తినిధులు అయినా.. ఉన్న‌తాధికారులైనా.. పోలీసులైనా.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తే వారిపై వేటు వేస్తూ బాధితుల‌కు త‌క్ష‌ణం ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏ ప్రాంతంలోనైనా ప్ర‌జా, చ‌ట్ట‌ వ్య‌తిరేక ఘ‌ట‌న‌లు జ‌రిగినా, ప్ర‌జ‌ల ప‌ట్ల ఎవ‌రైనా అమానుషంగా వ్య‌వ‌హ‌రించినా త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన తొలి నాళ్ల‌లోనే ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. త‌ద‌నుగుణంగా వారు త‌మ దృష్టికి వ‌చ్చిన వెంట‌నే బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

విధి నిర్వహణలో తప్పుచేస్తే కొరడా

ముఖ్యంత్రి జగన్ ఆదేశాల మేరకు పోలీసు శాఖలో కదలిక వచ్చింది. పోలీసుల విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్షంగా వ్యహించినా అలాంటి వారిపై కొరడా ఝుళిపించేందుకు పోలీసుశాఖ సిద్ధంగా ఉంది. అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించకపోయినా.. అవ‌స‌రం లేని చోట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించినా.. పోలీసులపై ఫిర్యాదులు వస్తే శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నాతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అవినీతికి పాల్పడుతూ... శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బంది తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని డీజీపీ హెచ్చరికలు జారీ చేశారు. గ‌తంలో అనంతరం జిల్లాలో పలువురు సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలపై పోలీస్‌ అధికారులకు ఫిర్యాదులు అందాయి. సీఐలపై వచ్చిన ఫిర్యాదులపై ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ డీఎస్పీతో విచారణకు ఆదేశించారు. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు సీఐలు విచారణ నడస్తోంది. సీఐలపై జరుగుతున్న విచారణను రూరల్‌ జిల్లా ఎస్పీ జయలక్ష్మి పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక సీఐపై ప్రస్తుతం విచారణ నడుస్తోంది. దీంతో పాటు పలు రకాల ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్సైలు, ఏఎస్సైలపై సైతం విచారణలు జరుగుతున్నట్టు సమాచారం. కాగా ఈ విచారణలో సిబ్బంది తప్పు చేసినట్టు రుజువైతే శాఖాపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.

గ‌తంలో సీతాన‌గ‌రం ఘ‌ట‌న‌పై...

తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో దళిత యువకుడి ఘటనపై సీఎం వైఎస్ జగన్ సీరియస్‌ అయ్యారు. సీఎంఓ అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులైన సిబ్బందిపై తక్షణ చర్యలకు ఆదేశించిన సీఎం జగన్.. ఇలాంటి ఘటనలు ఎట్టిపరిస్థితుల్లోనూ చోటు చేసుకోరాదని స్పష్టంచేశారు. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ గౌతమ్ వెంటనే స్పందించారు. ఆరోపణలపై విచారణ జరిపి.. సీతానగరం పోలీస్ స్టేషన్ ఇంచార్జి ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ చేశారు. గ‌తంలో ఎక్క‌డైనా పొర‌పొట్లు జ‌రిగిన‌ట్లు తెలిసినా చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి నెల‌లు, సంవ‌త్స‌రాలు ప‌ట్టేది. బాధితులు కార్యాల‌యాల చుట్టూ తిరిగినా న్యాయం జ‌రిగేది కాదు. కానీ పాల‌న మార‌డంతో రోజులు కూడా మారాయి. త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

తాజాగా రైతుల‌కు బేడీలు వేసిన ఘ‌ట‌న‌లో..

అమరావతి రైతులకు బేడీలు వేసిన ఘటనపై గుంటూరు ఎస్పీ విశాల్ గున్నీ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనకు కారణమైన పోలీసు అధికారులపై ఎస్పీ క్రమ శిక్షణ చర్యలను తీసుకున్నారు. అమరావతి ప్రాంతంలో మూడు రాజధానులకు మద్దతుగా చేస్తున్న నిరసనకు హాజరయ్యేందుకు కొంతమంది ఆటోల్లో వస్తుండగా ఈనెల 23న కృష్ణాయపాలెం దగ్గర రాజధాని రైతులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. అదే రోజు రాత్రి మంగళగిరి మండల వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఈపూరి రవిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొడవ జరుగుతుంటే సర్దిచెప్పడానికి వెళ్లిన తనను రైతులు బెదిరించారని చెప్పారు. దీంతో 11 మందిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ చట్టం సహా, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వచ్చిన ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.. కోర్టు వారికి రిమాండ్‌ విధించింది. రైతుల్ని ముందు నరసరావుపేట సబ్‌జైలుకు, అక్కడినుంచి మంగళవారం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఆ క్రమంలో వారి చేతులకు సంకెళ్లు వేసి తీసుకురావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ఎస్పీ స్పందించి చర్యలు తీసుకున్నారు. గుంటూరులో రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. రైతులను తీసుకెళ్లిన ఆరుగురు ఎస్కార్ట్‌ హెడ్‌ కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఆర్‌ఎస్‌ఐ, ఆర్‌ఐలకు ఎస్పీ విశాల్‌ గున్నీ ఛార్జి మెమోలు జారీ చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp