ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఏపీ ప్రభుత్వం తరుపున ఘన నివాళి

By Raju VS Sep. 26, 2020, 04:09 pm IST
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఏపీ ప్రభుత్వం తరుపున ఘన నివాళి

దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ముగిశాయి. వందలాది అభిమానుల మధ్య శైవ సంప్రదాయంలో ఆయన ఖననం కార్యక్రమం పూర్తి చేశారు. చెన్నై సమీపంలోని ఫామ్ హౌస్ లో ఈ కార్యక్రమం జరిగింది. సినీ నటుడు విజయ్ తో పాటుగా పలువురు తమిళనాడుకి చెందిన రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం తరుపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేకంగా హాజరయ్యారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉండి పర్యవేక్షించారు.

బాలసుబ్రహ్మణ్యం మరణవార్త తెలియగానే ముఖ్యమంత్రి స్పందించారు. నేరుగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సానుభూతిని తెలిపారు ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ని చెన్నై వెళ్లాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో చెన్నై వెళ్లిన మంత్రి అనిల్ కుమార్ ఉదయం నుంచి అక్కడే ఉన్నారు. ఏపీ ప్రభుత్వం తరుపున సంతాపం ప్రకటించారు. ఎస్సీబీ భౌతికకాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం జగన్ సంతాప సందేశాన్ని వారికి తెలియజేశారు.

అనంతరం అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ ఆయన అక్కడే ఉన్నారు. స్వయంగా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఏపీ ప్రభుత్వం తగిన రీతిలో ఎస్పీబీని గౌరవిస్తుందని తెలిపారు. నెల్లూరు , చిత్తూరు జిల్లాల్లో విద్యాభ్యాసం, సుదీర్ఘకాలం పాటు జీవనం సాగించిన ఆయన్ని తెలుగు ప్రజలు ఎన్నడూ మరచిపోరన్నారు. ప్రస్తుతం నెల్లూరు వేద నిలయంగా మారిన ఎస్పీబీ గృహాన్ని పరిరక్షిస్తామన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp