పాటలు లేక సినిమా రంగాన్ని వదిలి వెళ్దామని అనుకున్న ఎస్సీ బాలు

By Sannapareddy Krishna Reddy Oct. 01, 2020, 07:20 pm IST
పాటలు లేక సినిమా రంగాన్ని వదిలి వెళ్దామని అనుకున్న ఎస్సీ బాలు

అర్ధ శతాబ్దం పైగా సినిమా రంగంలో ఉన్నా వివాదాలకు దూరంగా ఉన్నారు బాలసుబ్రమణ్యం గారు. ఒక విషయంలో జరిగిన అపార్థం వలన కొన్నాళ్ళు కృష్ణ గారి సినిమాలకు పాడకపోవడం, ఈమధ్య పాట కచ్చేరీలలో తన పాటలు పాడకూడదని ఇళయరాజా లాయరు నోటీసులు పంపడం మినహా ఇతర వివాదాలు ఏవీ లేకుండా తన సుదీర్ఘ ప్రయాణం కొనసాగించారు బాలు గారు.

అయితే గాయకుడు రామకృష్ణ మాత్రం బాగా నడుస్తున్న తన కెరీర్ తగ్గుముఖం పట్టి, గాయకుడుగా తను పూర్తిగా అదృశ్యం కావడానికి బాలు గారు కారణం అని అనేక సందర్భాల్లో నేరుగా ఆరోపణలు చేశారు. దీనికి సమాధానంగా రామానాయుడు లాంటి నిర్మాతలను, దాసరి నారాయణరావు లాంటి దర్శకులను ఎవరితో పాడించాలి, ఎవరితో పాడించకూడదు అని నేను శాసించగలనా అని నవ్వేస్తారు బాలు. "ఇక్కడ మనతో అవసరం ఉంటే పిలిచి అవకాశం ఇస్తారు. లేదంటే పక్కన పెట్టేస్తారు" అంటారు ఆయన. హిందీలో బిజీగా ఉండి, ఉన్నట్టుండి అక్కడ అవకాశాలు తగ్గిపోవడానికి మీ మీద ఎవరైనా కుట్ర చేశారేమో అన్నప్పుడు కూడా ఇదే సమాధానం చెప్తారు.

అయితే బాలసుబ్రమణ్యం నన్ను తొక్కేశాడు అన్న రామకృష్ణ వల్ల ఒక దశలో పాటలు పాడే అవకాశాలు బాగా తగ్గిపోయి బాలు గారు సినిమా రంగం వదిలేసి, తనకున్న డిగ్రీతో ఉద్యోగం వెతుక్కోవడానికి సిద్ధపడ్డారని నమ్మడం కష్టమైనా, స్వయంగా బాలుగారే ఈ విషయం చెప్పారు కాబట్టి నమ్మక తప్పదు.

1966లో మొదటి పాట పాడినా మొదట్లో బాలు గారి సినిమా ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతూ వచ్చింది. అలాంటి దశలో 1972లో ఘంటసాల గారి గాత్రాన్ని పోలిన రామకృష్ణ రంగ ప్రవేశం చేశాడు. తన చివరి రోజుల్లో పొడవాటి రాగాలు తీయడానికి ఘంటసాల గారు ఇబ్బంది పడుతుంటే ఆ రాగాలు రామకృష్ణ గారితో పాడించేవారు సంగీత దర్శకులు. రాగమే కాబట్టి శ్రోతలకు తేడా తెలిసేది కాదు. చిన్న రాగం మాత్రమే పాడినా పాట మొత్తం పాడినందుకు ఘంటసాల గారు ఎంత మొత్తం తీసుకుంటారో తనకూ అంతే మొత్తం ఆయన ఇప్పించేవారని రామకృష్ణ చాలా సార్లు చెప్పారు.

1974లో ఘంటసాల గారు మరణించాక ఎన్టీఆర్ తన పాటలు పాడడానికి రామకృష్ణ వైపు మొగ్గు చూపారు. దాంతో నాగేశ్వరరావు కూడా రామకృష్ణకే జై కొట్టారు. పెద్ద వాళ్ళిద్దరినీ చూసి కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి యువ హీరోలు కూడా రామకృష్ణ వైపు మొగ్గు చూపారు. దాంతో మొయిన్ హీరోల పాటలు పూర్తిగా లేకుండా పోయి, మిమిక్రీ చేస్తూ పాడతాడు కాబట్టి కామెడీ నటుల పాటలు మాత్రమే బాలసుబ్రమణ్యం గారికి ఇచ్చేవారు.

కొద్ది రోజులు చూసి పరిస్థితి ఇలాగే ఉంటే సినిమా రంగాన్ని వదిలేసి తనకున్న డిగ్రీతో ఏదైనా ఉద్యోగం చూసుకోవడానికి సిద్ధపడి పోయారు బాలు. అలాంటి పరిస్థితిలో హీరో కృష్ణ దగ్గర నుంచి పిలుపు వచ్చింది. "ఏమయ్యా పాటలు తగ్గిపోయినట్టున్నాయే" అని అడిగారు ఆయన. "ఏదో వస్తున్నాయి సార్ అప్పుడప్పుడూ" అని చెప్పిన బాలూతో, "సంవత్సరానికి నాలుగైదు సినిమాలు ఉంటాయి నావి. అన్నీ నీకే ఇప్పిస్తాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్. కామెడీ పాటలు పాడటం మానెయ్యి" అన్నారు కృష్ణ గారు."న్యాయమే కదండీ"అంటారు ఈ విషయం గుర్తు చేసుకున్నప్పుడు బాలు." అవతలి హీరో సినిమాలో కమెడియన్లకి పాడిన గాయకుడు తమ హీరోకి పాడటం అభిమానులు ఒప్పుకోరు కదా".

అయితే ఈ మాట నిలబెట్టుకోవడం బాలు గారికి సాధ్యం కాలేదు. బాలుకి మంచి మిత్రుడైన రాజబాబు" పాడతావా పాడవా" అని గొంతు మీద కూర్చుని తన పాటలు పాడించుకుంటే, రాజబాబుకి పాడితే మిగతా వారికి పాడటానికేం అని అల్లు రామలింగయ్య లాంటి వారికి కూడా పాడించుకున్నారు దర్శకులు, సంగీత దర్శకులు. అయితే కృష్ణ గారు ఈ విషయం పట్టించుకోకుండా తన సినిమాల్లో అన్ని పాటలు బాలు గారికే ఇస్తూ వచ్చారు.

కాలచక్రం తిరుగుతున్న కొద్దీ బాలు పాడిన పాటలు సూపర్ హిట్ కావడంతో హీరోలు, దర్శకులు, అభిమానులు బాలు వైపు మొగ్గు చూపడంతో బాలు బాగా బిజీ అవడం, అదే సమయంలో రామకృష్ణకి పాటలు తగ్గిపోవడం మొదలయింది. హీరోల గాత్రానికి తగ్గట్టుగా తను గాత్రం మార్చి పాడటం, అలుపు సొలుపూ లేకుండా పరిగెడుతూ రోజుకి పది, పదిహేను పాటలు రికార్డ్ చేయడం, పారితోషికం విషయంలో పట్టు పట్టకుండా ఎంతోకొంత తీసుకోవడం వల్ల అనతికాలంలోనే బాలుగారు మహా వృక్షంలాగా ఎదిగారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp