నిన్న ఉత్తర.. నేడు దక్షిణ.. నిహర్‌తో హడలిపోతున్న రైతన్న..

By Karthik P Nov. 24, 2020, 07:16 pm IST
నిన్న ఉత్తర.. నేడు దక్షిణ.. నిహర్‌తో హడలిపోతున్న రైతన్న..

నివర్‌ తుపాను ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారి ప్రస్తుతం తుపానుగా మారింది. అప్పపీడనం తుపానుగా మారుతుందని, ఉత్తర కోస్తాపై దీని ప్రభావం ఉంటుందని మొదట విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర కోస్తా జిల్లాలను అప్రమత్తం చేసింది. అయితే ఇది దిశ మార్చుకుని ప్రయాణించడంతో.. దక్షిణ, రాయలసీమ జిల్లాలపై ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

నివర్‌ తుపాను వల్ల కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, రాయలసీమలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని తీర ప్రాంత ప్రజలను, రైతులను అప్రమత్తం చేశారు. కృష్ణా జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశారు. బందర్‌ కంట్రోల్‌ రూం నం. 08672–252572, విజయవాడలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం కంట్రోల్‌ నం. 0866–2474805, విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం కంట్రోల్‌ రూం. 0866– 2574454, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని కంట్రోల్‌ రూం నం. 08656–232717, బందర్‌ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం నం.08672–252486, గుడివాడ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం కంట్రోల్‌ రూం నం. 08674–243697 లు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో టోల్‌ ఫ్రి నంబర్‌ 1077 ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో హెల్ప్‌లైన్‌ నం. 08592– 281400 ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

తుపాను రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రస్తుతం వరి, కంది, పొగాకు, పత్తి, మిరప, మొక్కజొన్న, శెనగ పంటలు సాగుచేస్తున్నారు. ప్రస్తుత సమయంలో భారీ వర్షాలు పడితే అన్ని పంటలు దెబ్బతినే అవకాశాలున్నాయి. వరి, శెనగ పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. కంది పంట కళ్లె, పూత దశలో ఉంది. ఈ సమయంలో వర్షం పడితే పూత రాలిపోయి. దిగుబడి భారీగా తగ్గిపోతోంది. పోగాకు పంట ప్రస్తుతం కొట్టుడుకు వచ్చింది. వర్షం పడితే.. రంగు తగ్గిపోతుంది. పూర్తిగా మాడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మొక్కజొన్న ప్రస్తుతం కోత దశకు వచ్చింది. మిరప పూత, పిందె దశలో ఉంది. వర్షం పడడం వల్ల దిగుబడి తగ్గడంతోపాటు... చేలల్లో నీరు నిల్వ ఉండడం వల్ల చెట్లు పడిపోయే ప్రమాదం ఉంది. పత్తి పంటది ఇదే పరిస్థితి. నివర్‌ తుపాను చూపించే ప్రభావంపై ఈ మూడు జిల్లాల రైతాంగం భవిష్యత్‌ ఆధారపడి ఉంది. వర్షాలు పడితే.. భారీ మొత్తంలో రైతులు నష్టపోతారు. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp