అంధురాలైతేనేమి ,పెన్షన్ అంతా కరోనా సహాయ చర్యలకు ఇచ్చింది

By Kalyan.S May. 14, 2021, 07:34 am IST
అంధురాలైతేనేమి ,పెన్షన్ అంతా కరోనా సహాయ చర్యలకు ఇచ్చింది

దేశానికి స‌రికొత్త మాన‌వ‌తా వాదిని ప‌రిచ‌యం చేసింది క‌రోనా. లాక్ డౌన్ కాలంలో, ప్ర‌స్తుతం క‌రోనా క‌ష్ట‌కాలంలో త‌న సేవ‌ల ద్వారా అంద‌రి మ‌న‌సునూ గెలుచుకుంటున్నాడు బాలీవుడ్ న‌టుడు సోనూసూద్. దేశంలోని అంద‌రి మ‌న‌సుల‌ను సోనూ గెలిస్తే.. సోనూ మ‌న‌సును ఓ అంధ యువ‌తి గెలుచుకుంది. ఆమె చేసిన సాయానికి సోనూ ఫిదా అయ్యాడు.

కరోనా కష్టకాలంలో బాగా వినిపించిన పేరు సోనూసూద్. ప్రభుత్వాలను మించి పేదలకు సాయం అందించిన వ్య‌క్తిగా ఖ్యాతి పొందాడు. తాజాగా… దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌లు నెలకొల్పేందుకు సోనూసూద్‌ సిద్ధమయ్యారు. ఫ్రాన్స్‌ సహా ఇతర దేశాల నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్లను దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. 10 రోజుల్లో ఫ్రాన్స్‌ నుంచి తొలి ప్లాంట్ రానుందని ఇప్పటికే వెల్లడించారు. కిందటి ఏడాదిలో లాక్ డౌన్ వల్ల వేలాది మంది కార్మికులు గ్రామాలకు వెళ్లలేక ఇబ్బందిపడుతున్న సమయంలో వారిపాలిట దేవుడు అయ్యాడు. బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి కార్మికులను తమ గ్రామాలకు చేర్చి వారి కన్నీళ్లు తుడిచాడు.అంతటితో సోను సాయం ఆగిపోలేదు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశ నలుమూలల నుంచి ఎవరు సాయం కోరిన సోనూసూద్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు సోనూసూద్ తన వంతు సహకారం అందిస్తున్నారు.

ఆమె నిజ‌మైన హీరో..

కరోనా మహమ్మారి బారినపడిన దేశానికి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇప్పుడు ఆపద్బాంధవుడయ్యాడు. అటువంటి వ్య‌క్తికి విరాళం అందించి ఓ యువ‌తి వార్త‌ల్లో నిలిచింది. ఇటీవల ఓ ఫౌండేషన్ స్థాపించిన సోనూ సూద్ దాని ద్వారా తన సహాయ కార్యక్రమాలను మరింత విస్తృతం చేశాడు. తాజాగా ఆ ఫౌండేషన్‌కు నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన యూట్యూబర్ అయిన అంధ యువతి బొడ్డు నాగలక్ష్మి తన 5 నెలల పెన్షన్ డబ్బులు రూ. 15 వేలను విరాళంగా ఇచ్చి సోనూ సూద్ చేస్తున్న సాయంలో భాగస్వామి అయింది. ఈ విషయాన్ని సోనూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఓ చిన్న గ్రామానికి చెందిన నాగలక్ష్మి తన ఫౌండేషన్‌కు రూ. 15 వేలు విరాళం పంపిందని, తనవరకు ఈ దేశంలో అత్యంత ధనవంతురాలని ఆమేనని ప్రశంసలు కురిపించాడు. వేరొకరి బాధను చూడడానికి నేత్రాలు అవసరం లేదని పేర్కొన్నాడు. ఆమె నిజమైన హీరో అని కొనియాడాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp