వర్క్‌ ఫ్రం హోంతోనే మెరుగైన ఉత్పాదకత..!

By Jaswanth.T Jan. 03, 2021, 07:13 pm IST
వర్క్‌ ఫ్రం హోంతోనే మెరుగైన ఉత్పాదకత..!
ఉదయాన్నే లేచి హడావిడిగా ఆఫీస్‌కు వెళ్ళడం.. అక్కడ చెప్పిన పని చేయడం.. లోటు పాట్లుంటే బాస్‌తో తలంటించుకోవడం.. ఇప్పటి వరకు ఉద్యోగ జీవితానికి అలవాటైపోయిన కార్యక్రమం. అయితే కరోనా పుణ్యమాని వర్క్‌ఫ్రంహోంకు బీజం పడింది. అందరిన్నీ కలిపి ఒకే చోట ఉంచితే వ్యాధి వ్యాపించే భయం ఉడడంతో ఇళ్ళ వద్దనే ఉండి పనిచేయాల్సిందిగా ఆయా సంస్థలే సూచించాయి. దీంతో ఉద్యోగులు ఇళ్ళ నుంచి తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా కార్యాలయానికి వెళ్ళకపోయినా పనిచేయగలిగే ఉద్యోగాలు ఈ విధంగా మార్పు చెందాయి. వీటిలో ప్రథమ స్థానం సాఫ్ట్‌వేర్‌ రంగానిదేనని చెప్పొచ్చు. దీంతో పాటు ఇతర ఆన్‌లైన్‌ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి.

యాజమాన్య సంస్థలే ఆఫర్‌ ఇవ్వడంతో ఉద్యోగులు రెక్కలు కట్టుకుని తమతమ ఇళ్ళకు చేరిపోయి పనిచేస్తున్నారు. ఇంకొంత మంది తమతమ ఊళ్ళకే వెళ్ళిపోయాయి అక్కడ్నుంచే ఆన్‌లైన్‌లో కనెక్ట్‌లో ఉంటున్నారు. మారిన ఈ ఉద్యోగ పరిస్థితులపై హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ (హైసియా) చేసిన సర్వేలో ఇంటి నుంచి చేస్తున్న ఉద్యోగుల పనిలో నాణ్యత గతంలో కంటే ఎక్కువగా ఉన్నట్లుగా తేలిందట. అంతే కాకుండా ఉద్యోగులే లేనప్పుడు కార్యాలయాలు ఎందుకు అని పలు సంస్థలు తమతమ కార్యాలయాలను ఖాళీ చేసేసాయి. దీంతో ఆఫీసు, నిర్వహణా పరమైన ఖర్చులను గణనీయంగానే తగ్గించుకున్నాయి. ఒక పక్క ఉద్యోగుల ఉత్పాదకతలో నాణ్యతతోపాటు, ఖర్చులు కూడా తగ్గిపోవడంతో పలు పెద్దపెద్ద పేరున్న సంస్థలు కూడా వర్క్‌ఫ్రంహోంను కొనసాగించాలనే నిర్ణయించుకున్నట్లు తేలిందట.

ఉద్యోగులు కూడా ఆ దిశగానే ఆసక్తిచూపిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం 75శాతానికిపైగా ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోంను అనుసరిస్తున్నారు. వారంతా తమతమ సొంత ఇళ్లలో కూర్చుని, ఇంకాస్త ముందుకెళితే సొంతూరు కెళ్ళిమరీ పనిచేస్తున్నారు. దీంతో తమ వారికి దూరంగా ఉంటున్నామన్న భావన కూడా వారికి ఉండడం లేదు. ఈ నేపథ్యంలోనే కొత్త విధానానికి ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారంటున్నారు. అయితే ఇంటి దగ్గరే ఉన్నావుగా.. ఇంకొంచెం సేపు పనిచేయొచ్చంటూ నసిగే బాస్‌ల ఉన్నవాళ్ళు మాత్రం వర్క్‌ఫ్రం హోమ్‌ ఇబ్బందిగానే ఉందని చెబుతుండడం గమనార్హం.

ఏరకంగా చూసినా వర్క్‌ఫ్రం హోం కొత్త యేడాదిలో కొనసాగే సూచనలే కన్పిస్తున్నాయంటున్నారు. దశల వారీగా ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. ఏది ఏమైనా 2021లో కూడా వర్క్‌ఫ్రం హోమ్‌ విధానమే ప్రధానం అవ్వొచ్చంటున్నారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp