రోజుల ప్రభుత్వాలు...!

By Siva Racharla Nov. 28, 2019, 08:08 am IST
రోజుల ప్రభుత్వాలు...!

సినిమాల్లోనే కాదు వాస్తవంలో కూడా ఒక రోజు ముఖ్యమంత్రులు, ఒక వారం ముఖ్యమంత్రులు,ఒక నెల ముఖ్యమంత్రులున్నారు, కొందరు సొంత పార్టీలకు వెన్నుపోటు పొడిచి కొద్దిరోజులపాటు అందలం ఎక్కగా మరికొందరు తగిన బలం లేకపోయినా పదవి కోసం ఆరాటపడి బోల్తా పడ్డారు. ఇంకొందరు మిత్ర పక్షాలు స్నేహధర్మాన్ని పాటించక పోవడంతో పదవిని చేజార్చుకున్నారు.మన రాష్ట్రంలోనే చీలికప్రయత్నం విఫలమైన నాదెండ్ల భాస్కర్ రావ్ ఉన్నాడు,ప్రభుత్వాన్ని మరియు పార్టీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు ఉన్నాడు.

గవర్నర్ వ్యవస్థ ఏర్పడినప్పటినుంచి దాని చుట్టూ వివాదాలు నెలకొన్నాయి.ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు రానప్పుడు,అధికార పార్టీలో చీలికలు వచ్చినప్పుడు గవర్నర్ పాత్ర చాలా కీలకమైనది.రాజ్యాంగం నిర్దిష్ట విధానాలను రూపొందించినా "విచక్షణా" అధికారంతో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లలో గవర్నర్లు తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి,అవుతున్నాయి. బలనిరూపణకు సత్తా చాలకపోవడంతో ఒక రోజు ముందే రాజీనామా చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ దేశంలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతల్లో ఒకరిగా రికార్డుకెక్కారు.అయితే... ఇదేవిధంగా అత్యంత తక్కువ రోజులు ముఖ్యమంత్రులుగా కొనసాగిన నేతలెవరో చూద్దాం.

Also Read:-క‌మ‌లం కుదేలు - చాణ‌క్యుడికి చావు దెబ్బ

1).అర్జున్ సింగ్ - మధ్యప్రదేశ్ - 2 రోజులు -(11-Mar-1985 నుంచి 12-Mar-1985)
1985 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 1980 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్ సింగ్ నే కాంగ్రెస్ పార్టీ మరోసారి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. అర్జున్ సింగ్ 11-Mar-1985న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ అదే రోజు ఆయన్ను కేంద్రం పంజాబ్ గవర్నరుగా పంపించింది. దీనితో చరిత్రలో రెండు రోజులు ముఖ్యంమంత్రి పదవిలో ఉన్న రికార్డు అర్జున్ సింగ్ పేరుతో నెలకొన్నది.

2).యడ్యూరప్ప- కర్ణాటక - 3 రోజులు- (17-May-2018 నుంచి 19- May-2018 )
2018 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన స్థానాలు గెలవలేదు. కాంగ్రెస్,BSP ,స్వతంత్రులు అందరు JDS కు మద్దతు ప్రకటించినా గవర్నర్ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి బల పరీక్షకు 15 రోజుల గడువు ఇచ్చాడు. కాంగ్రెస్,JDS సుప్రీమ్ కోర్ట్ కు వెళ్లటంతో కోర్ట్ 48 గంటలలో యడ్యూరప్పను బల నిరూపణం చేసుకోమని ఆదేశించింది. విశ్వాసపరీక్ష మీద గంటల పాటు చర్చజరిగిన తరువాత ఓటింగు కన్నా ముందే తనకు మెజారిటీ లేదని యడ్యూరప్ప రాజీనామా చేశారు.

3).జగదాంబిక పాల్- ఉత్తరప్రదేశ్- 3 రోజులు- (21-Feb-1998 నుంచి 23-Feb-1998)
1996 లో ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికలో BSP కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని పోటీ చేసి BSP 67,కాంగ్రెస్ 33 స్థానాలు గెలిచాయి. బీజేపీ కి 174 సీట్లు వచ్చాయి. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేక పోవడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించారు. 1997 మార్చ్ లో బీజేపీ BSP కి మద్దతు ఇవ్వటంతో మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగలేదు.

1997 సెప్టెంబర్లో కాంగ్రెస్ నేత నరేష్ అగర్వాల్ పార్టీని చీల్చి లోక్‌తాంత్రిక్ కాంగ్రెస్ ను ఏర్పాటు చేసి బీజేపీకి మద్దతు ఇవ్వటంతో కళ్యాణ్ సింగ్ ముఖ్యంమత్రి అయ్యారు. 1998 ఫిబ్రవరిలో లోక్‌తాంత్రిక్ కాంగ్రెస్ కళ్యాణ్ సింగ్ కు మద్దతు ఉపసంహరించుకోవటంతో గవర్నర్ రమేష్ భండారి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి, లోక్‌తాంత్రిక్ కాంగ్రెస్ నేత జగదాంబికా పాల్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాడు. జగదాంబికా పాల్ 21-Feb-1998న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు . కళ్యాణ్ సింగ్ కోర్టుకు వెళ్లి తనకు బల నిరూపణ చేసుకునే అవకాశం ఇవ్వకుండా, తన ప్రభుత్వాన్ని డిస్మిస్ చెయ్యటం రాజ్యాంగ విరుద్ధం అని వాదించి గెలిచారు. కోర్టు జగదాంబికా పాల్ ఎన్నికను రద్దు చేసి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది.

దీనితో జగదాంబికాపాల్ మూడురోజులు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా,అధికారకంగా ఆయన పేరు రికార్డ్సులో ఉండదు. అంటే టెక్నికల్ గా ఈయన ముఖ్యమంత్రి కాదు. జగదాంబికా పాల్ 2009లో కాంగ్రెస్ తరుపున 2014,2019లో బీజేపీ తరుపున లోక్ సభకు ఎన్నికయ్యారు.

Also Read: బాబు స‌మ‌క్షంలోనే ద‌ళిత కార్య‌క‌ర్త‌పై దాడి

4).నబమ్ టుకి- అరుణాచల్ ప్రదేశ్- 4 రోజులు-13-Jul-2016 నుంచి 17-Jul-2016
అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడ్డ నాయకత్వ చీలికను పరిష్కరించడానికి ప్రమాణస్వీకారం జేసిన నాలుగు రోజుల్లోనే నబమ్ టుకిని తొలగించి పెమా ఖండును సీఎం గా ప్రకటించారు.. ఆ విధంగా 13-Jul-2016 నుండి 17 జులై వరకు ముఖ్యమంత్రి గా ఆయన కొనసాగారు..

5).సతీశ్ ప్రసాద్ సింగ్ - బీహార్-5 రోజులు- 28-Jan-1968 నుంచి 1-Feb-1968
సతీశ్ ప్రసాద్ సింగ్ బీహార్ అతి పిన్నవయసు కలిగిన ముఖ్యమంత్రి. 28-Jan-1968 నుంచి 1-Feb-1968 మధ్య కేవలం 5 రోజులే పదవిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏర్పడ్డ కుమ్ములాటల వలన రాజీనామా చేశారు. దీంతో అదే రోజు బీపీ మండల్ సీఎం అయ్యారు. ఆయన కూడా 31 రోజులు సీఎంగా ఉన్న తర్వాత రాజీనామా చెయ్యటంతో భోలా పాశ్వాన్ శాస్త్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 100 రోజులు సీఎంగా చేసారు. అనంతరం అక్కడ రాష్ట్రపతి పాలన ఏర్పడింది

6).ఓం ప్రకాశ్ చౌతాలా-హర్యానా- 6 రోజులు-12-Jul-1990 నుంచి 17-Jul-1990
1990లో ఓం ప్రకాశ్ చౌతాలా హరియాణా సీఎం జులై 12 నుంచి 17 వరకు సీఎంగా పనిచేశారు. ఆయన కేవలం 6 రోజులే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 1991 మార్చి 21 నుండి ఏప్రిల్ 6 వరకు 17 రోజుల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.

7).నితీశ్ కుమార్- బీహార్- 8 రోజులు- 3-Mar-2000 నుంచి 10-Mar-2000
బీహార్ లో ఉన్న బహుళ పార్టీల ప్రభావం వలన ఏర్పడ్డ హంగ్ లో సీఎంగా నితీశ్ కుమార్ 2000 సంవత్సరం మార్చి 3 నుంచి మార్చి 10 వరకు 8 రోజులు సీఎంగా ఉన్నారు.ఆర్జేడీ కి కాంగ్రెస్ మరియు ఇతర వామపక్షాలు మద్దతుఇవ్వటంతో నితీష్ కుమార్ పదవి మున్నాళ్ళముచ్చటగానే ముగిసింది.

8).యడ్యూరప్ప - కర్ణాటక - 8 రోజులు- (12-Nov-2007 నుంచి 19-Nov-2007 )
2007 కర్ణాటక ఎన్నికల్లో హంగు ఫలితాలు రావటంతో ముఖ్యమంత్రి పదవిని 50:50 పంచుకునే ఒప్పందంతో JDS-BJP ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఒప్పందం ప్రకారం గడువు ముగిసిన తరువాత పదవి నుంచి తప్పుకోవటానికి కుమారస్వామి అంగీకరించక పోవటంతో బీజేపీ మద్దతు ఉప సంహరించుకుంది. దీనితో రాష్ట్రపతి పాలన విధించారు. ఒక నెల తరువాత బీజేపీకి మద్దతు ఇవ్వటానికి JDS అంగీకరించడంతో రాష్ట్రపతి పాలన ఎత్తివేయగా 17-Nov-2007నాడు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ మంత్రి పదవుల పంపకం మీద మళ్ళీ విబేధాలు రావటంతో JDS మద్దతు ఉప సంహరించుకుంది. దీనితో మూడు రోజుల తరువాత 19-Nov-2007 న యడ్యూరప్ప రాజీనామా చెయ్యవలసి వచ్చింది.

9).ఎస్సీ మారక్-మేఘాలయ-12 రోజుల-27-Feb-1998 నుంచి 10-Mar-1998
మిస్టర్ క్లీన్ ఆఫ్ మేఘాలయగా మేఘాలయ సీఎంగా చేసిన ఎస్సీ మారక్ 1998 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10 వరకు 12 రోజులున్నారు.కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ పార్టీలు వైదొలగడం వలన ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. అంతకుముందు మారక్ మేఘాలయ ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు, ఫిబ్రవరి 1993 నుండి 1998 వరకు విజయవంతంగా పనిచేశారు.

10.)భోలా పాశ్వాన్ శాస్త్రి-బీహార్- 13 రోజులు- 22-Jun-1969 నుంచి 4-Jul-1969
బి.పి.శాస్త్రి 1969లో జూన్ 22 నుంచి జులై 4 వరకు 13 రోజులపాటు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.బి.పి.శాస్త్రి అంతకు ముందు 22-Mar -1968 నుంచి 29-Jun-1968 మధ్య 100 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

11).జానకి రామచంద్రన్-తమిళనాడు-24 రోజులు-7-Jan-1988 నుంచి 30-జాన్-1998
MGR భార్య జానకి రామచంద్రన్ .MGR మరణం తరువాత తమిళనాడు ముఖ్యమంత్రిగా జానకి రామచంద్రన్ 1988 జనవరి 7 నుంచి 30 వరకు పనిచేశారు.

Also Read:70 వసంతాల రాజ్యాంగం

12).సుందర్ లాల్ పాట్వా-మధ్య ప్రదేశ్- 28 రోజులు-20-Jan-1980 నుంచి 17-Feb-1980
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గా జనతాపార్టీ తరుపున సుందర్ లాల్ పాట్వా 20-Jan -1980 నుంచి 17-Feb-1980 మధ్య 28 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు.జనతాపార్టీ లో సోషలిస్టులకు ,జనసంఘ్ వర్గీయుల మధ్య జరిగిన సైద్ధాంతిక సంఘర్షణతో జనసంఘ్ వర్గీయులు జనతాపార్టీ నుంచి బయటకొచ్చి 1980 ఏప్రిల్లో బీజేపీని స్థాపించారు. సుందర్ లాల్ పాట్వా బీజేపీ తరుపున 1990-1992 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు.

13).బీపీ మండల్-బిహార్- 31 రోజులు- 1-Feb-1968 నుంచి 2-Mar-1968
మండల్ కమీషన్ గా ప్రసిద్ధిచెందిన ఓబీసీల రిజర్వేషన్ల కమిషన్ చైర్మన్ ఈ బీపీ మండల్ . ఈయన 1-Feb-1968 నుంచి 2-Mar-1968 మధ్య 31 రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తరువాత ముఖ్యమంత్రి అయిన బి.పి. శాస్త్రి కూడా 100 రోజులు మాత్రమే సీఎంగా ఉన్నారు. అనంతరం అక్కడ రాష్ట్రపతి పాలన ఏర్పడింది.

14).నాదెండ్ల భాస్కరరావు-ఆంధ్రప్రదేశ్ - 31 రోజులు-16-Aug-1984 నుంచి 16-Sep-1984
ఆగస్టు సంక్షోభకర్తగా తెలుగు రాజకీయాల్లో పేరుగాంచిన నాదెండ్ల భాస్కర్ రావు ఈ మున్నాళ్ల ముఖ్యమంత్రుల జాబితాలో ఉన్నారు. 1984 ఆగస్టు 16న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కేవలం 31 రోజులకే అంటే సెప్టెంబర్ 16న రాజీనామా చేశారు.పదవి కాంక్షతో పార్టీలను చీల్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన వారిలో కొందరు రాజకీయంగా కనుమరుగవ్వగా మరి కొందరు మరో పార్టీలో చేరి రాజకీయ మనుగడ సాగిస్తున్నారు. ఈదేశం రెండు రోజుల ముఖ్యమంత్రిని చూసింది 24 సంవత్సరాలు వరుసగా పాలించిన ముఖ్యమంత్రులను చూసింది. రాజకీయాల్లో నైతిక విలువలు లేవని అనిపించినా విలువలతో రాజకీయం చేసినవారికి అవకాశం దక్కినా దక్కకున్నా చరిత్రలో సుస్థిర స్థానం మాత్రం దక్కుతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp