షాపులు ఓపెన్‌ - అయితే.. షరతులు వర్తిస్తాయి

By iDream Post Mar. 26, 2020, 08:30 am IST
షాపులు ఓపెన్‌ - అయితే.. షరతులు వర్తిస్తాయి

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ఏపీతో సహా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. రోడ్లపైకి వాహనాలు రాకుండా, జన సంచారం లేకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే నిత్యావసరాల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 6 నుంచి 9 వరకు నిత్యావసరాల కొనుగోలు కోసం సమయం ఇచ్చినప్పటికీ... తక్కువ సమయం కావడంతో జనాలు ఎగబడుతున్నారు. దీంతో సామాజిక దూరం పాటించాలనే నిబంధన విఫలం అవుతోంది. ఈ నేపథ్యంలో దీనిని చెక్‌ పెట్టడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుండడం, దుకాణదారులు వస్తువుల రేట్లను పెంచి అమ్ముతున్నారనే అంశాలపై చర్చ సాగింది. ఈ మేరకు పలు నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించింది.

ఉదయం 6 గంటల నుంచి మధ్నాహ్నం 1 గంట వరకు రైతు బజార్లు, నిత్యావసరాల షాపులు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఒకే చోట కాకుండా షాపుల వికేంద్రీకరణ చేయాలని మంత్రి ఆళ్లనాని సూచించారు. దుకాణాల మధ్య నిర్ణీతం దూరం పాటించాలని స్పష్టం చేశారు. దీనివల్ల వినియోగదారులు గుంపులు గుంపులుగా వెళ్లే అవకాశం తగ్గుతుంది. షాపుల వద్ద లైన్‌లో మూడు అడుగుల మేర దూరంతో మార్కింగ్‌లు వేసి, దాన్ని నిక్కచ్చిగా అమలు చేయాలని నిర్ణయించారు. నిత్యావసరాల కోసం బయటకు వచ్చే వారు తమ నివాసం నుంచి మూడు కిలోమీటర్లు పరిధిని దాటకూడదని నిబంధన విధించారు.

అలాగే నిత్యావసరాల సరఫరా చేసే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులివ్వాలని జిల్లా కలెక్టర్లుకు సూచించారు. ఏ రోజుకారోజు నిత్యాసరాల ధరలను కూడా కలెక్టర్లే ప్రకటిస్తారు. ఆమేరకు దుకాణదారులు వస్తువులను అమ్మాల్సి ఉంటుంది. అంతకమించి ఎవరైనా అమ్మితే ఫిర్యాదు చేసేందుకు వీలుగా 1902 కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అదే సమయంలో 144 సెక్షన్‌ అమలు కఠినంగా ఉంటుంది. ఎక్కడైనా నలుగురు గుంపులుగా కనపడితే పోలీసులు చర్యలు తీసుకుంటారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp