షాకింగ్ - ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిపై చెప్పుల దాడి

By Kiran.G Oct. 21, 2020, 07:20 am IST
షాకింగ్ - ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిపై చెప్పుల దాడి

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారం సాధించడం కోసం వివిధ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది . కాగా తాజాగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి అభ్యర్థికి చేదు అనుభవం ఎదురైంది. 

వివరాల్లోకి వెళితే ఆర్జేడీ నేత మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్‌ విపక్షాలతో కలిసి మహాఘట్ బంధన్‌ని ఏర్పాటుచేసి బీహార్ ఎన్నికలబరిలోకి దిగాడు. ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవే అన్న సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం సాయంత్రం ఔరంగాబాద్‌ జిల్లా కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తేజస్వి యాదవ్‌ పాల్గొన్నారు.

ఈ క్రమంలో సభలో తేజస్వి యాదవ్ కూర్చున్నప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై చెప్పులు విసరడంతో ఒక చెప్పు ఆయన తలపైనుండి దూసుకెళ్లగా మరో చెప్పు ఆయన ఒళ్ళో పడింది. తనపై చెప్పుల దాడి జరిగినప్పుడు తేజస్వి యాదవ్ ఎంతో హుందాగా వ్యవహరించారు.తనపై చెప్పుల దాడి అనంతరం ప్రసంగించిన ఆయన దాడిని ప్రస్తావించకుండా ప్రసంగించడంతో పాటు ఎన్డీఏ కూటమిపై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. నితీశ్ ప్రభుత్వ పాలనను దుయ్యబట్టారు. దీంతో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా ఆయనపై చెప్పులు ఎవరు విసిరారో ఇంకా తెలియరాలేదు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉండడంతో ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఆర్జేడీ కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిసి కూటమి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలకు గాను RJD 144 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించుతోంది. మిగిలిన స్థానాలలో మిత్రపక్ష అభ్యర్థులు పోటీ చేస్తారు.

తనపై చెప్పులు విసిరినా సరే హుందాగా వ్యవహరించిన తేజస్వి యాదవ్‌ను పలువురు ప్రసంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ చెప్పులదాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా ముఖ్యమంత్రి అభ్యర్థిపై చెప్పుల దాడి జరగడాన్ని పలు పార్టీలు ఖండించాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp