కరోనా వ్యాక్సిన్ వైఫల్యానికి కారకులు ఎవరు...సంచలన వ్యాఖ్యలు చేసిన శాంతాబయోటెక్ వరప్రసాద్ రెడ్డి...

By Suresh May. 08, 2021, 04:49 pm IST
కరోనా వ్యాక్సిన్ వైఫల్యానికి కారకులు ఎవరు...సంచలన వ్యాఖ్యలు చేసిన శాంతాబయోటెక్ వరప్రసాద్ రెడ్డి...

కరోనా వ్యాక్సిన్ పంపిణీ వైఫల్యానికి బాధ్యలు ఎవరు అనేదానిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఒక్కసారిగా మరణాల సంఖ్య పెరిగిపోయింది. అయితే వ్యాక్సిన్ పంపిణీ మాత్రం ఒక్కసారిగా కుంటినడకలు నడుస్తోంది. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరొక వాదన వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ ప్రధాన మంత్రి సైంటిఫిక్ అడ్వైజర్ విజయ్ రాఘవన్, కరోనా మూడో వేవ్ అనివార్యం అని నిన్న ప్రకటించి ఇవాళ్టికి మాట మార్చేశారు. అనివార్యం కాదని, కట్టడి చేయవచ్చంటూ ప్రకటించారు. అయితే ఈ రెండూ కూడా పరస్పర వైరుధ్యమైన కామెంట్స్ 24 గంటల వ్యవధిలోఇవ్వడం పరిస్థితి గందరగోళానికి అద్దం పడుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ సైంటిస్టు, శాంతా బయోటెక్ సంస్థ అధినేత పద్మభూషణ్ వరప్రసాదర్ రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలకు అవగాహన, నిబద్ధత లేకపోవడం వల్లనే వ్యాక్సిన్ తయారీలో లోపాలు తలెత్తాయని వరప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాల ప్రాదాన్యతలు మారిపపోయాయని, కేవలం రాజకీయ ఆకాంక్షలే తప్ప ప్రజల ఆరోగ్యం, ఇతర సదుపాయాలను పట్టించుకునే స్థితిలో లేరని వరప్రసాద్ రెడ్డి విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ, ఆయన వ్యాక్సిన్ మార్కెట్లోకి రాక ముందే ఫైజర్ సహా కరోనా తయారు.చేసే పలు కంపెనీలకు 2 బిలియన్ డాలర్లు ముందస్తు చెల్లింపులు చేసి ఆ కంపెనీలతో అమెరికా ప్రజలకు వ్యాక్సిన్లు ఇచ్చేలా ఎంవోయూలు కుదుర్చుకున్నారని వరప్రసాద్ రెడ్డి గుర్తు చేశారు. వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత మొదటి ప్రయారిటీ అమెరికన్లకే ఇవ్వాలని ట్రంప్ ఆ కంపెనీలను ఆదేశించారు. అమెరికా జనాభా 32 కోట్లు కాగా, ట్రంప్ 65 కోట్ల వ్యాక్సిన్లను 2 బిలియన్ డాలర్లు చెల్లించి ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని గుర్తుచేశారు.

కానీ మన దేశం పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని, మన దేశంలోని కంపెనీలకు వ్యాక్సిన్లను తయారు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, కేవలం అవగాహన రాహిత్యం వల్ల, ఈ పరిస్థితి వచ్చిందని గుర్తుచేశారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం దేశంలోని టాప్ 5 వ్యాక్సిన్ ఉత్పత్తి దారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, దిశానిర్దేశం చేసి, సరిపడ ఆర్థిక వనరులు సమకూరిస్తే, 137 కోట్ల మంది భారతీయులకు ఈ రోజు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిఉండేదన్నారు. కనీసం 100 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే దాదాపు 200 కోట్ల డోసులు అవసరం. అందులో వేస్టేజ్ కలుపుకొని దాదాపు 250 కోట్ల డోసులు తయారు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఎక్స్ పోర్ట్ ఒప్పందాల ప్రకారం మరో 100 కోట్ల డోసులు తయారు చేయాలి. అంటే దాదాపు 400 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారు చేయాలి. అయితే దీనికి దాదాపు 10 వేల కోట్ల ఖర్చు అవుతుందని, ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఓ పదివేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేని స్థాయిలో దేశం ఉందా..అని వరప్రసాద్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు భారత్ బయోటెక్ సంస్థ సామర్థ్యం 70 కోట్ల వ్యాక్సిన్లు తయారు చేయగలదని, అయితే ఇందులో ఎంఎంఆర్, పోలియో లాంటి అత్యవసరమైన టీకాలు కూడా ఉంటాయని, వాటి ప్రొడక్షన్ ఆపితే దేశంలో చంటిపిల్లల మృతులు తలెత్తే అవకాశం ఉందని, కేవలం కరోనా వ్యాక్సిన్ మాత్రమే తయారు చేసే అవకాశం భారత్ బయోటెక్ వద్ద ఉండదని వరప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.

వ్యాక్సిన్ అనేది ఆరోగ్యవంతుడికి ఇచ్చే మందు అని, అది రోగికి ఇచ్చేది కాదని గుర్తు చేశారు. అందుకే వ్యాక్సిన్ తయారీలో సమయం పడుతుందని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించి. ప్లానింగ్ తో ముందుకు వెళ్లి ఉంటే పరిస్థితి ఇలా దిగజారేది కాదన్నారు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలను ఆరునెలల పాటు వాయిదా వేసి ఉంటే దేశానికి వచ్చే ప్రమాదం ఏమి లేదని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు మారడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని, కరోనా సెకండ్ వేవ్ కేవలం బాధ్యతారాహిత్యం వల్లనే వ్యాపించిందంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు తాను యదార్థవాది లోక విరోధి తరహాలో మాట్లాడుతున్నందుకు, పద్మభూషణ్ అవార్డీని అనే సంగతి కూడా మర్చిపోయి, ఎక్కువగా మాట్లాడుతున్నావ్ అంటూ బెదిరింపులు సైతం వస్తున్నాయని వరప్రసాద్ రెడ్డి పేర్కొనడం విశేషం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp