విమోచనం వర్సెస్ విలీనం - అమిత్ షా రాకతో తెలంగాణాలో రాజకీయ కాక

By Thati Ramesh Sep. 16, 2021, 07:30 am IST
విమోచనం వర్సెస్ విలీనం - అమిత్ షా రాకతో తెలంగాణాలో రాజకీయ కాక

హుజురాబాద్ ఉపఎన్నిక లో గెలుపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నటీఆర్ఎస్, బీజేపీ లు సెప్టంబర్ 17 కేంద్రంగా మరోసారి తీవ్రస్థాయిలో వాగ్బాణాలు సంధించుకోనున్నాయి. దక్కన్ పీఠభూమిని కాషాయమయం చేయాలని భావిస్తున్న బీజేపీ ... హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజును తెలంగాణ విమోచనదినంగా అధికారికంగా ప్రకటించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ విషయంపై రాజకీయపార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో పాటు శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశమున్నందున తటస్థ వైఖరి అవలంభిస్తున్నట్లు గులాబీపార్టీ పెద్దలు చెబుతున్నారు.

ఏ నినాదం మాటున ఎవరి ప్రయోజనమో...?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవడం, ఉపఎన్నికలో దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న కమలనాథులు రాబోయో ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టగా.. కాకలు తీరిన కమలనాథులను తెలంగాణ పర్యటనకు ఆహ్వానించి ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేశారు.

యూపీ ఫార్ములాను యథాతథంగా అమలు చేసి తెలంగాణలో అధికారంలో వచ్చేందుకు భారీ కసరత్తు చేస్తున్నారు. యూపీలో స్థానిక పార్టీలైన ఎస్పీ, బీఎస్పీలకు ధీటుగా స్థానిక బలాన్ని పెంచుకుని బీజేపీ అధికారంలోకి వచ్చింది. సామాజికంగా యూపీ లాంటి పరిస్థితులే ఇక్కడే ఉండటంతో అధే ప్లాన్ అమలు చేయనున్నారు. ఎస్పీ మద్దతుగా ఉన్న యాదవలు, ముస్లిం యేతరుల నుంచి కొత్త నాయకత్వాన్ని తయారు చేసి.. హిందుత్వ సెంటిమెంట్ తో ఇంటింటికి పరిచయమైంది. ప్రధాన పార్టీలతో పొత్తు లేకుండానే అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది.

యూపీ ఫార్ములా అమలు....

యూపీ ఫార్ములా అమలు లో భాగంగానే.. సెప్టెంబర్ 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా .. నిర్మల్ పర్యటనకు రానున్నారు. వేయి ఊడల మర్రి చెట్టు దగ్గర నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవం పాల్గొంటారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. ఎంఐఎం పార్టీ ఒత్తిడి మేరకే విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించడం లేదనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు. దాదాపు లక్షమందిని సభకు సమీకరించి బీజేపీ అజెండాను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం ఆ పార్టీ నేతలు చేస్తున్నారు.

ముఖ్యంగా ఆదివాసీలు, ఎస్సీలకు దగ్గరై టీఆర్ఎస్ ఓట్లకు గండికొట్టాలని చూస్తున్నారు. తద్వారా రాబోయో అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించే హుజురాబాద్ ను సునాయాసంగా కైవసం చేసుకునేలా భారీ వ్యూహరచన చేశారు.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా...

తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమ కాలంలో సమైక్య పాలకులను ప్రశ్నించిన కేసీఆర్ .. తెలంగాణకు సీఎం అయిన తర్వాత మౌనం వహించడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. ఉద్యమ నాయకుడిగా.. సీఎంగా ఆయన చేసిన ప్రసంగాలు, సూచనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని మండిపడుతున్నారు. మజ్లీస్ పార్టీ మద్దతు, ఒత్తిడితోనే డుబుల్ స్టాండర్డ్స్ అనుసరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అయితే విలీన, విమోచన వివాదంపై బీజేపీ, టీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరిని వామపక్షాలు, న్యూట్రల్ పొలిటికల్ అనలిస్టులు తప్పుబడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం సున్నితమైన అంశాన్ని వివాదంగా మల్చాలని యత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.

చీలికలు లేని సమాజమే లక్ష్యం...

తెలంగాణ విమోచనోద్యంలో పాల్గొనని బీజేపీ, ఏ ఉద్దేశంతో ఏ హక్కుతో విమోచన దినోత్సవం గురించి మాట్లాడుతుందని కాషాయనేతలను కమ్యూనిస్టులు ప్రశ్నిస్తున్నారు. నిరంకుశ భూస్వామ్య పాలనను వ్యతిరేకించి సాయుధ రైతాంగ పోరాటం చేసిన ఘనత కమ్యూనిస్టులదేనంటున్నారు. భారత్ లో విలీనమైన చివరి సంస్థానం హైదరాబాద్ స్టేట్ ..జాతీయ ఐక్యతకకు చిహ్నమని జాతీయవాదులు చెబుతున్నారు. ఇందులో మతాల ప్రస్తక్తి, నిజాం వ్యతిరేకత లేదని వివరిస్తున్నారు. ఏ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా సమాజంలో చీలికలు, విభజనలు తీసుకురాకుండా జాతీయ సమగ్రత దినోత్సవంగా జరపాలని సూచిస్తున్నారు.
తెలంగాణ ప్రజలు భారత పౌరసత్వం పొందిన రోజును అధికారికంగా నిర్వహిస్తే వచ్చే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు. ఫ్యూడల్ పాలనను తెలంగాణలోని అన్ని మతాలు వారు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

సెప్టెంబర్ 17 ప్రత్యేకత ఏంటీ..?

1947, ఆగస్టు 15న బ్రిటీషర్ల పాలన నుంచి భారతావని విముక్తి చెందితే... సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ స్వేఛ్చ పొందింది. స్వాతంత్ర్యం తర్వాత నిజాం పాలనలో ఉండేందుకు తెలంగాణ ప్రజలు సుముఖత చూపలేదు. అప్పటికే భారతలో విలీనమవ్వాలని మెజారిటీ ప్రజలు ఆకాంక్షించారు. కానీ స్వంతంత్ర సంస్థానంగా ఉండాలని ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భావించారు.

ఉస్మాన్ అలీ ఖాన్ తీరు అనుమానాస్పదంగా ఉండటంతో 1948 సెప్టెంబర్ 13న భారత ప్రభుత్వం మిలిటరీ చర్యకు దిగింది. ప్రధాని నెహ్రూ ఆదేశాలతో అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లబాయ్ పటేల్ సైనిక చర్యకు నేతృత్వం వహించారు. కేవలం ఐదు రోజుల్లోనే భారత సైన్యానికి నిజాం సేనలు లొంగిపోయాయి. దీంతో సెప్టెంబర్ 17న 224 ఏళ్ల నిజాం నవాబు పాలన అంతమై భారత్ లో హైదరాబాద్ సంస్థానం విలీనమైంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp