జర జాగ్రత్తయ్య భయ్యా..

By Jaswanth.T Dec. 31, 2020, 02:40 pm IST
జర జాగ్రత్తయ్య భయ్యా..

థర్టీఫస్ట్‌ నైట్‌.. ఇదేదో ఇప్పుడొచ్చిందొక్కటే డిసెంబరు 31 లాగా..

ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయలేమో అన్నంత రీతిలో..

సెలబ్రేషన్స్‌కు ప్రణాళికలు సిద్ధం చేసుకునే వారెందరో మన చుట్టూ ఉంటారు.

ఈ తరహా వ్యవహారాలను దూరం పెడదామని ప్రయత్నించేవారు, వీటికి దూరంగా ఉండేవారు కూడా లేకపోలేదు. కానీ క్రిందనున్న రెండు కేటగిరీలకంటే పైనున్న కేటగిరీ వారే ఎక్కువగా ఉండడంతో పాత సంవత్సరానికి బైబై చెప్పడం, కొత్త సంవత్సరానికి వెల్‌కమ్‌ చెప్పడం.. అనే కార్యక్రమం గత యేడాది వరకు అప్రతిహతంగానే సాగిపోయింది. ఈ యేడాది కూడా సాగించేందుకు సిద్ధమైపోతున్నారు కూడా.

అయితే ఈ యేడాది ‘గత యేడాది ఆఖరి’ కంటే కాస్తంత డిఫరెంటుగానే ఉందన్నది ఇప్పటికే అందరికీ అనుభవంలోకొచ్చేసింది. ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే 2020 యేడాదిని జనవరి, ఫిబ్రవరి, మార్చి.. లాక్డౌన్‌.. డిసెంబర్‌.. గానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి తరాన్ని ఇంతగా అతలాకుతలం చేసిన అంశం మరొకటి లేదనే చెప్పేవారు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ చేపట్టబోయే వేడుకల విషయంలో జరంత జాగ్రత్త భయ్యా అని పలువురు హెచ్చరిస్తున్నారు.

ఇష్టమొచ్చినట్లు గుంపులు, గుంపులుగా ఒక్కచోటే కలిసి కూర్చుని విందు వినోదాల్లో మునిగిపోయే ఏర్పాట్లు పెట్టుకోవద్దంటూ హితవు పలుకుతున్నారు. పలు కారణాలు చూపి పార్టీలంటూ గుంపులు, గుంపులుగా తిరిగిన ఫలితాన్ని బ్రిటన్‌తో సహా పలు యూరప్‌దేశాలు ఇప్పటికే అనుభవిస్తున్నాయి. కళ్ళెదుటే అయిన వాళ్ళు కన్నుమూస్తుంటే ఏం చేయాలో పాలుపోక నిశ్చేష్ఠులై చూస్తూండిపోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు స్వర్గాలుగా భావించిన పలు దేశాలు, నగరాలు.. ఇప్పుడు స్మశాన వైరాగ్యం వైపు నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇంతటి ఘోరానికి కూడా తమకు తాముగా చేసుకున్న మానవ తప్పిదాలే కారణం అన్నది ఒప్పుకోక తప్పదు.

ప్రభుత్వాలైనా, అధికార యంత్రాంగాలైనా.. బాబూ.. ఈ జాగ్రత్తలు పాటించండి అని మాత్రమే చెప్పగలవు. వాటిని మేం మీరతాం.. అంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. అంతిమంగా ఈ విషయంలో ఎవరిని నిందించినప్పటికీ ప్రయోజనం కూడా ఉండకపోవచ్చు. ఇప్పటికే డిసెంబర్‌ 31 రాత్రి పార్టీలు, నూతన సంవత్సర వేడుకలపై కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలనే అమలు చేయాలని రాష్ట్రాలకు ఇప్పటికే సూచించింది. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పోలీసు ఉన్నతాధికారులు మీడియా ముందుకువచ్చి వేడుకలకు దూరంగా ఉండాలని, నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ప్రకటించేసారు. ఈవెంట్లు, పబ్బులు, బార్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో సైతం నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు లేవని తేల్చేసారు. ఒక్క మాటలో చెప్పాలంటే జనం ఒక చోటుకు గుమిగూడేందుకు అనుమతులు ఇవ్వడం లేదని హెచ్చరిస్తున్నారు. ఇక వీటిని పూర్తిస్థాయిలో పాటించాల్సిన బాధ్యత పౌరులపైనే ఉందన్నది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి.

పాత కోవిడ్‌కు తోడు.. ఇప్పుడు బ్రిటన్‌ నుంచి వచ్చిన కొత్త కోవిడ్‌ కూడా తోడవుతోంది. ప్రాణాలు పోవడం మాట పక్కన పెడితే అంటుకోవడం విషయంలో పాత దానికంటే కొత్తది మాంచి స్పీడుగా ఉంటోందన్నది ఇప్పటికే నిపుణులు తేల్చేసారు. దేశంలోని పలు చోట్ల కొత్త కరోనా జాడలను కూడా గుర్తించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము చేపట్టే చర్యలు ఎలాగూ చేపడతామని.. కానీ ఎవరికి వారు వ్యక్తిగతంగా కూడా జాగ్రత్తలు పాటించాల్సిందిగా ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp