పాలకుల చేతిలో అస్త్రం.. 124 ఏ సెక్షన్

By Ramana.Damara Singh Jul. 16, 2021, 08:26 pm IST
పాలకుల చేతిలో అస్త్రం.. 124 ఏ సెక్షన్

ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 124 ఏ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశద్రోహం, రాజద్రోహం వంటి తీవ్ర అభియోగాలు మోపే ఈ సెక్షన్ ను కొనసాగించడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు, వెల్లడించిన అభిప్రాయాల నేపథ్యంలో న్యాయ, రాజకీయ, పౌర సంఘాలు దీనిపై స్పందిస్తున్నాయి. వలసవాద సెక్షన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఈ సెక్షన్ పాలకుల చేతిలో బ్రహ్మాస్త్రంగా.. ప్రశ్నించే వారి పాలిట మారణాస్త్రంగా మారిందంటున్నారు. ఈ సెక్షన్ను ప్రయోగించి దేశవ్యాప్తంగా నమోదు చేస్తున్న కేసులు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సెక్షన్ను విమర్శించే పార్టీలే అధికారంలోకి వచ్చాక ఆయుధంగా వాడుకుంటున్నాయి. గత పదేళ్లలో దేశంలో 11 వేల మందిపై సెక్షన్ 124 ఏ కింద 816 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు ఈ సెక్షన్ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే హర్యానాలో 100 మంది రైతులపై సెక్షన్ 124 ఏ ప్రయోగించి దేశద్రోహం కేసులు బనాయించారు. హర్యానా డిప్యూటీ స్పీకర్ రణవీర్ గంగ్వా కారుపై దాడిచేసి ధ్వంసం చేశారన్న ఆరోపణలపై ఈ నెల 11న వారిపై ఎఫైఆర్ నమోదు చేసిన పోలీసులు.. తాజాగా దేశద్రోహం కేసు బనాయించారు.

బ్రిటీషర్లతోపాటు వలస వచ్చింది

దేశద్రోహ చట్టాన్ని బ్రిటీష్ ప్రభుత్వం ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రభుత్వాన్ని, చక్రవర్తిని ఎదిరించి, ప్రశ్నించే వారిని శిక్షించేందుకు దీన్ని రూపొందించారు. నాడు తమ వలసవాద పాలనలో ఉన్న దేశాలన్నింటిలో దీన్ని బ్రిటీషర్లు అమల్లోకి తెచ్చారు. అలా 1870లో రాజద్రోహ చట్టం మనదేశంలోకి వచ్చింది. థామస్ మెకాలే అనే బ్రిటిష్ అధికారి భారత్ లో దీన్ని ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే నిందితులకు బెయిల్ పొందే అవకాశం ఉండదు. అభియోగాలు నిరూపితమైతే జీవిత ఖైదు శిక్ష పడుతుంది. 1891లో ఈ సెక్షన్ కింద తొలి కేసు నమోదైంది. దాన్ని ఎదుర్కొన్న తొలి నేత బాలగంగాధర్ తిలక్. బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై ఈ సెక్షన్ ప్రయోగించి అరెస్టు చేశారు. తిలక్ పై ఆ తర్వాత కూడా రెండోసారి ఇదే సెక్షన్ ప్రయోగించారు. మహాత్మా గాంధీ తదితర ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు సెక్షన్ 124 ఏ బారిన పడి జైలుపాలయ్యారు. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని 75 ఏళ్లు గడిచినా.. ఈ నిరంకుశ సెక్షన్ సంకెళ్లను మాత్రం తెంచుకోలేకపోతున్నాం.

Also Read : ప్రతి పదం ఆలోచించి రాశాం.. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ గెజిట్లపై కేంద్ర జలశక్తి శాఖ

పెరుగుతున్న దేశద్రోహం కేసులు

కాలక్రమంలో ఈ సెక్షన్ను అమలు చేసిన చాలా దేశాలు దాన్ని రద్దు చేశాయి. చివరికి తొలిసారి ఈ నిరంకుశ చట్టాన్ని పరిచయం చేసిన ఇంగ్లాండ్ కూడా ఎప్పుడో రద్దు చేసింది. కానీ మన పాలకులు మాత్రం దీన్ని పట్టుకొని వేలాడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపైన, తమ విధానాలను ప్రశ్నించేవారిపైన, ఉద్యమకారులపైనా అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 1951లో అప్పటి నెహ్రు ప్రభుత్వం ఈ సెక్షన్లో కొన్ని సవరణలు చేసిందే తప్ప రద్దు చేయకపోవడంతో.. తర్వాత తరం పాలకులు దీన్ని కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ చట్టం అమలును వ్యతిరేకిస్తూ.. అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని హామీ ఇస్తున్నవారే.. పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత పట్టించుకోకపోగా ఆయుధంగా మలచుకుంటున్నారు. ఫలితంగా దేశంలో ఈ తరహా కేసులు పెరిగిపోతున్నాయి. 2010 నుంచి 2020 వరకు పదేళ్లలో చూస్తే దాదాపు 11 వేల మందిపై 816 కేసులు నమోదయ్యాయి. గత యూపీఏ హయాంలోనే కేసులు పెరిగాయని ఆందోళన వ్యక్తం కాగా.. మోదీ ప్రభుత్వం వచ్చాక అవి మరింత పెరిగాయి. యూపీఏ హయాంలో ఏడాదికి సగటున 62 కేసులు నమోదైతే.. మోదీ హయాంలో 80కి పెరిగింది. యూపీఏ పాలనలో 2010-14 మధ్య 279 దేశద్రోహం కేసులు నమోదైతే.. 2014-19 మధ్య ఎన్డీయే ప్రభుత్వం 519 కేసులు బనాయించింది.

124 ఏ ఎందుకు కొనసాగించాలి?

భావప్రకటన స్వేచ్ఛ ఉన్న మన దేశంలో ప్రశ్నించేవారిని నిర్బంధిస్తున్న సెక్షన్ 124 ఏ చెల్లుబాటును సవాల్ చేస్తూ ఒక రిటైర్డ్ మేజర్ జనరల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ సెక్షన్ను ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఏం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ వ్యతిరేకులను, స్వాతంత్ర్య సమరయోధులను నిర్బంధించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చిన ఈ వలస చట్టం చెల్లుబాటును సమీక్షిస్తామని స్పష్టం చేశారు. సెక్షన్ను రద్దు చేయాల్సిన అవసరం లేదని, మార్గదర్శకాలు రూపొందిస్తే సరిపోతుందని అటార్నీ జనరల్ వేణుగోపాల్ చేసిన సూచనలను చీఫ్ జస్టిస్ అంగీకరించలేదు. రాజకీయ ప్రత్యర్థుల అణచివేతకు, వ్యక్తులు వ్యవస్థలను బెదిరించేందుకు ఇది ఉపయోగపడుతుందని, చివరికి పేకాట ఆడుతున్నవారిపైనా ఈ సెక్షన్ ప్రయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సెక్షన్ కింద ఎన్ని కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని నిలబడుతున్నాయి.. అని ప్రశ్నించారు. అనర్థాలకు దారితీస్తున్న ఈ సెక్షన్ చెల్లుబాటుపై కేంద్రం తన వైఖరి వెల్లడించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. 124 ఏ ను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయని వాటన్నింటినీ కలిపి విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ రమణ ప్రకటించారు.

Also Read : దక్షిణాఫ్రికాలో అల్లర్లు.. ప్రమాదంలో భారత సంతతి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp