నా బుల్లెట్ క‌థ‌

By G.R Maharshi Nov. 23, 2020, 07:40 pm IST
నా బుల్లెట్ క‌థ‌

చిన్న‌ప్ప‌టి నుంచి బుల్లెట్ (రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌) అంటే ఆరాధ‌న‌. హార్ట్‌బీట్ లాంటి దాని సౌండ్ ఇంకే బండికి రాదు. రాయ‌దుర్గంలో నారాయ‌ణ‌రెడ్డి అనే కాంట్రాక్ట‌ర్‌కు మాత్ర‌మే బుల్లెట్ వుండేది. ఆయ‌న రాజ‌సంగా వెళ్తూ ఉంటే అంద‌రూ ఆశ్చ‌ర్యంగా చూసేవాళ్లు. ఆ రోజుల్లో టూవీల‌ర్లే లేవు. అంద‌రూ సైకిళ్లు లేదా న‌డ‌క‌. మేమున్న ల‌క్ష్మీ బ‌జార్‌లో నా ఫ్రెండ్ బాలు వాళ్ల నాన్న శివాజీకి ఒక స్కూట‌ర్ వుండేది. ఆయ‌న దాని మీద తిరుగుతూ వుంటే వింత‌గా చెప్పుకునేవాళ్లు.

అనంత‌పురంలో టెన్త్‌క్లాస్ చ‌దువుతున్న‌ప్పుడు రోజూ ఐదు కిలోమీట‌ర్లు రానుపోనూ న‌డిచేవాన్ని. స్కూల్ అంత దూరం. నా బాధ చూడ‌లేక ఒక సైకిల్ కొనిపెట్టారు. దాని ఖ‌రీదు రూ.400. ఈ రోజు విలువ‌తో పోలిస్తే దాదాపు రూ.10వేలు. దాంతోనే సుమారుగా మూడు నాలుగేళ్లు లాగేశాను. త‌ర్వాత సైకిల్ మారింది కానీ, స్కూట‌ర్ స్థాయి రాలేదు. అప్ప‌ట్లో లోన్ల మీద బండ్లు ఇచ్చేవాళ్లు కాదు. డ‌బ్బు పెట్టినా బండి దొర‌క‌ని కాలం. ఐదారు నెల‌లు వెయిటింగ్ లిస్ట్‌లో వుంటే బ‌జాజ్ చేత‌క్ ద‌క్కేది. పెళ్లైన త‌ర్వాత భార్య‌ని సైకిల్ మీద తీసుకెళ్ల లేక స్కూట‌ర్ కొన్నాను. న‌డ‌క ఆగిపోయింది. ఐదేళ్ల‌కే షుగ‌ర్ వ‌చ్చింది.

కొంత కాలానికి దాన్ని అమ్మి సెకండ్స్‌లో బైక్ కొన్నాను. త‌ర్వాత అది అమ్మి లోన్ మీద బైక్‌, చివ‌రికి సుజుకి యాక్సెస్ అనే చిన్న స్కూట‌ర్ ద‌గ్గ‌ర ఆగిపోయాను. బుల్లెట్ ధ‌ర ఎప్ప‌టికీ నేను కొన‌లేనంత ఎత్తులోనే వుంది. ఎవ‌రైనా మిత్రులు కొంటే దాని మీద ఒక చిన్న రౌండ్ వేసి ఆనంద‌ప‌డేవాన్ని.

మా అబ్బాయి పెద్ద‌వాడై ఇంజ‌నీరింగ్ చేరాడు. బండి కావాలంటే కొన్నాను కానీ, అడిగినంత పెద్ద బండి కొన‌లేక పోయా. సాక్షిలో చేరిన త‌ర్వాత కొంచెం జీవితం, జీతం బాగుప‌డింది. ఆంధ్ర‌జ్యోతిలో మ‌రీ త‌క్కువ ఇచ్చేవాళ్లు. నేను రాసిన క‌థనాల‌కి రాష్ట్ర‌స్థాయి ఉత్త‌మ జ‌ర్న‌లిస్ట్ అవార్డు వ‌చ్చింది కానీ, ఇంక్రిమెంట్ రాలేదు. ఆ ఏడాది అంద‌రి కంటే త‌క్కువ (రూ.300) ఇంక్రిమెంట్ వేశారు. జ్యోతిని వ‌దిలి వెళ్ల‌డానికి ఈ గాయం కూడా ఒక కార‌ణం.

సాక్షి ఎడిష‌న్ ఇన్‌చార్జ్‌గా ఉన్న‌ప్పుడు మా అబ్బాయి బుల్లెట్ అడిగాడు. అప్ప‌టికే దాని ఖ‌రీదు ల‌క్ష‌న్న‌ర దాటింది. కొన‌లేన‌ని చెప్పాను. కొన్నేళ్ల త‌ర్వాత అమెరికా వ‌చ్చి క‌ష్ట‌ప‌డి మా అబ్బాయి చ‌దువుకున్నాడు. ఉద్యోగం వ‌చ్చింది. బుల్లెట్ ఇష్టం తీర‌లేదు. చివ‌రికి ఈ మ‌ధ్య కొనేశాడు. నేను, మా ఆవిడ వారం క్రితం అమెరికా వ‌చ్చాం. నేను కొన‌లేక పోయిన బుల్లెట్‌ని , నా కొడుకు కొన్న బుల్లెట్‌ని ఒక రౌండ్ వేశాను. దేనికైనా ఒక టైం వుంటుంది. అప్పుడు ద‌క్కితేనే ఆనందం. ఇపుడు సొంత బెల్లెట్ ఉన్నా అమెరికాలో దాన్ని న‌డ‌ప‌లేను. కుడి వైపున వాహ‌నాలు వెళ్లాల‌నే నియ‌మం ఇంకా నా మైండ్‌లో రిజ‌స్ట‌ర్ కాలేదు. దానికి తోడు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. అన్నిటికి మించి క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత బుల్లెట్ స్టాండ్ వేసే ఎన‌ర్జీ కూడా లేదు. ఇంటి ముంద‌ర బుల్లెట్ వుంది. అదే ఆనందం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp