నేనడుగుతుంటే.. ఎవరికో చెబుతానంటావేంటి బా..

By Jaswanth.T Dec. 12, 2020, 12:30 pm IST
నేనడుగుతుంటే.. ఎవరికో చెబుతానంటావేంటి బా..
బావా.. బావా.. నేను నిన్నో ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు సమాధానం నాకు చెబుతావా. ఊళ్ళోకెళ్ళి సెంటర్లో నుంచుని మా మణిగాడు ఇలా అడిగాడు.. సమాధానం మీకు చెబుతున్నాను.. అంటూ మైకట్టుకుని చెబుతావా? అంటూ అడిగాడు మణి చాలా చాలా సీరియస్‌గా.

మణిగాడు సీరియస్‌నెస్‌ చూసి కిట్టయ్య ఒక్కసారిగా అదిరి పడ్డాడు. వెంటనే వీడికేదో అయ్యిందని అర్ధమయ్యి అదికాదురా మణీ అసలేం జరిగింది అంటూ గేదెకు తవుడు కలుపుతూనే మణిని శాంతింపజేసే ప్రయత్నం చేసాడు కిట్టయ్య.

బావోయ్‌.. నువ్వు ఏదేదో చెప్పి నన్ను మాయ చేయకు. నేనడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు లేకపోతేనా... నాకెంత కోపం వస్తుందో నాకే అర్ధం కావడం లేదు.. అంటూ పళ్ళు పటపటా కొరుకుతున్నాడు మణి.

ఏంట్రా బాబూ ఎప్పుడూ లేనిది అలా చాలా సీరియస్‌ అయిపోతున్నావు. నిన్ను చూస్తుంటే నాకే భయంగా ఉందిరా. అసలేం జరిగిందిరా బాబూ చెప్పు. అసలే గేదె ఈనింది.. ఇంకా మాయ వెయ్యలేదన్న టెన్షన్‌లో ఉన్నాను. నా పనికి అడ్డు తగలకుండా నీకేం కావాలో చెప్పరా బాబూ అంటూ బ్రతిమాలాడు కిట్టయ్య.

ఏం లేదు బావా.. ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వారితో చర్చిస్తోంది. ప్రభుత్వ ప్రతినిధులు చెప్పినది రైతు నాయకులకు నచ్చలేదు. దీంతో చర్చలు గిర్చలూ ఏమీ లేవు.. మా ఆందోళనలు మేం చేసుకుంటాం.. అంటూ రైతు సంఘాల నాయకులు తేల్చి చెప్పేసారు. ఇలా ఎందుకు చెప్పారయ్యా.. అంటే మేం అడిగిప ప్రశ్నలు దేనికీ కేంద్ర ప్రభుత్వం వద్ద సమాధానం లేదు, చూస్తాం.. చేస్తాం.. అంటూ చెబుతున్నారు తప్పితే ఖచ్చితమైన సమాధానం మాత్రం ఇవ్వడం లేదని రైతు నాయకులు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పేసారు.

అయితే అదే సమయంలో కేంద్రం కూడా రైతు నాయకులు ఎందుకు అభ్యంతరం చెప్పారో స్పష్టంగా దేశ ప్రజలకు వివరించాలి. అంతే గానీ అన్ని జిల్లాల్లోనూ ప్రెస్‌మీట్లు పెడతాం.. మేం చేసిన చట్టాలు చాలా గొప్పవి.. రైతులకు అవగాహన కల్పిస్తాం.. అంటూ ప్రయత్నాలు చేయడం ఎంత వరకు న్యాయం అంటావ్‌.. బావా.. అంటూ తనకున్న ఆవేశాన్ని బైటకక్కేసాడు మణి.

మళ్ళీ ఊపిరి పీల్చుకుని.. నేనేదైనా తప్పు చేస్తే నా దగ్గరే చెప్పాలి గానీ.. మా నాన్నకు చెతాను.. మా మావయ్యకు చెబుతాను.. లేకపోతే మా ఆవిడకు చెబుతాను అంటే.. ఎంత వరకు సమంజసం.. అంటూ గుక్కతిప్పుకోకుండా మట్లాడేసాడు మణి.

మణి వాలకం చూస్తే కిట్టయ్య కూడా ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. అమాయకంగా అడిగినా మణి అడిగిన ప్రశ్నలో న్యాయం ఉందనిపించింది కిట్టయ్యకు. దీంతో వాడి ఆవేశం తగ్గించేందుకు ప్రయత్నించడం మొదలెట్టాడు.

అది కాదురా మణీ.. కేంద్రం చెబుతున్నదాని గురించే నీ ఆవేశం అయితే అంత ఆవేశం పనికిరాదురా. కొత్త రైతు చట్టాలతో తమకేం అభ్యంతరాలు ఉన్నాయో రైతులు స్పష్టంగానే చెప్పేసారు. దీనికి సమాధానం చెప్పుకోవాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఒక వేళ ఆందోళన చేస్తున్న రైతులతో కాకుండా ప్రజలతోనే చెబుతామని బీజేపీ నాయకులు చెప్పినప్పటికీ రైతులకంటే ప్రజలతోనే ఎక్కువ ప్రమాదం రా? బాబూ అంటూ అనునయించే ప్రయత్నం చేసాడు కిట్టయ్య.

ఇప్పటి వరకు రైతులు ఆందోళనలు చేయడం ఏదో ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో పరిమితం అయ్యేది. కాకపోతే ఈ సారి రైతు ఉద్యమం దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ సమయంలో బీజేపీ ఏ మాత్రం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించినా బీజేపీ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంచేత నువ్వేమీ ఆవేశం తెచ్చుకోనక్కర్లేదురా.. కాగల కార్యం ప్రజలే తీరుస్తారు. మనం కొంచెం వేచి చూడాలి అంతే రా బాబూ.. అంటూ మణిగాడి ఆవేశాన్ని చల్లార్చేందుకు గట్టిగానే ప్రయత్నం ,చేయడంలో మునిగిపోయాడు కిట్టయ్య.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp