" నేటి ఎన్డీయే లో రాముడు లేడు" - శివసేన ఘాటైన విమర్శలు

By Srinivas Racharla Sep. 28, 2020, 10:15 pm IST
" నేటి ఎన్డీయే లో రాముడు లేడు" - శివసేన ఘాటైన విమర్శలు

బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే నుంచి శిరోమణి అకాలీదళ్ వైదొలగిన నేపథ్యంలో శివసేన పార్టీ అధికారిక పత్రిక 'సామ్నా' సంచలన సంపాదకీయం రాసింది.వ్యవసాయ బిల్లులపై బిజెపితో విభేదించి ఎన్డీయే నుంచి అకాలీదళ్ వైదొలగడాన్ని ప్రస్తావిస్తూ సామ్నా విమర్శ పూర్వక ప్రశ్నలు సంధించింది.

సామ్నా సోమవారం నాటి సంపాదకీయంలో " బాదల్ ఎన్డీయే కూటమి నుండి నిష్క్రమిస్తుంటే ఎవరూ వారిని ఆపడానికి ఎటువంటి ప్రయత్నం చెయ్యలేదు.అంతకుముందు ఎన్డీయేని శివసేన విడిచిపెట్టింది. మూలస్తంభాల్లాంటి రెండు పార్టీలు వైదొలగడంతో ఎన్డీయేలో ఇంకేమి మిగిలింది? ఇంకా అక్కడ ఉన్న వారికి ఎవరికైనా హిందుత్వంతో సంబంధం ఉందా? వారు చేసిందేముంది?"అని విమర్శ బాణాలు ఎక్కుపెట్టింది.

ఇంకా పంజాబ్,మహారాష్ట్ర ధైర్య సాహసాలకు ప్రతీకలని,అకాలీదళ్, శివసేన పురుషత్వానికి రెండు ముఖాలే అని సామ్నా పేర్కొంది. రెండు సింహాలను కోల్పోయిన ఎన్డీయేలో ' రామ్' మిగిలి లేడని శివసేన ఎద్దేవా చేసింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఎన్డీయే ఏర్పడింది. అనంతరం ఈ కూటమి అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంది. కొన్ని పార్టీలు వారి ప్రయోజనాలకనుగుణంగా మధ్యలోనే కూటమిని విడిచి పెట్టాయని తెలిపింది.దేశ రాజకీయాలు ఏకపార్టీ వ్యవస్థ వైపు మళ్లించేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని శివసేన ఆరోపించింది.కానీ వివిధ రాష్ట్రాలలో బిజెపి అక్కడి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుందని శివసేన అధికార పత్రిక సామ్నా వ్యాఖ్యానించింది.

ఇక గత ఏడాది మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడంపై బిజెపితో ఏర్పడిన అభిప్రాయ భేదాలతో శివసేన ఎన్డీయే నుంచి వైదొలిగింది.2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం ఎన్డీయే కూటమిని వీడింది.కాగా గత శనివారం మోడీ సర్కార్ తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే నుంచి అకాళీదళ్‌ బయటకు వచ్చింది.ఏడాది కాలంలో ఎన్డీయే నుంచి వైదొలిగిన మూడో ప్రధాన పార్టీగా అకాలీదళ్ నిలిచింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp