వారు (గౌరవ) వేతన జీవులే!

By Mavuri S Mar. 05, 2021, 07:45 pm IST
వారు (గౌరవ) వేతన జీవులే!

రాష్ట్రమంతా మున్సిపల్ ఎన్నికల వేడి ఉంది. వీధి వీధినా ప్రచారాల హోరుతో మార్మోగుతోంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అంటూ కొత్త కొత్త అభ్యర్థులు జనం వద్దకు వచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. అసలు వారు గెలిస్తే వచ్చేది ఏమిటి? వీరికి ప్రభుత్వం ఏమైనా జీతాలు ఇస్తుందా? ఇస్తే అది ఎంత మొత్తం ఉంటుందో అన్నది చాలా మందికి తెలియదు.

గౌరవ వేతనం ఉంటుంది

మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు, మేయర్లు కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మన్ లకు గౌరవ వేతనం ఉంటుంది. ప్రతి నగరపాలక సంస్థలో మెజారిటీ వచ్చిన కార్పొరేటర్లు అంతా మేయర్ ను ఎన్నుకొంటారు. అలాగే మున్సిపాలిటీలో ఎక్కువ అవార్డు గెలిచిన పార్టీ తరఫున ఒక మున్సిపల్ చైర్మన్ ను ఎన్నుకొంటారు. వీరికి ఐదేళ్ల పాటు నెలనెలా గౌరవ వేతనం ఇస్తారు. ఆ వేతనం ఆయా మున్సిపాలిటీల ఆర్ధిక స్థితి, రాబడిని బట్టి ఉంటుంది. మున్సిపాలిటీలకు, నగరపాలక సంస్థలకు వేరువేరుగా గౌరవ వేతనాలు ఉంటాయి. అలాగే జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీలకు నగరపాలక సంస్థలకు ఒక జిల్లా కేంద్రంలో లేని వాటికీ మరోలా జీతాలు ఉంటాయి.

నగరపాలక సంస్థలకు గ్రేడ్లు

ప్రభుత్వ జీవో ప్రకారం నగరపాలకసంస్థ లను గ్రేడ్ 1 వన్ గ్రేడ్-2 కార్పొరేషన్ గా విభజించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో గ్రేడ్ వన్ లో ఉన్నాయి. ఈ నగరాల్లో మేయర్లు కార్పొరేటర్లు జీతాలు ఇతర నగరాలతో పోలిస్తే ఎక్కువ. ప్రస్తుతం ఈ మూడు నగరాల్లో మేయర్ కు నెలకు 30,000, డిప్యూటీ మేయర్ కు 20,000, కార్పొరేటర్ కు ఆరు వేల చొప్పున నెలకు జీతం నిర్ణయించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం అవసరాన్ని బట్టి పెంచుతుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో 1981లో కార్పొరేటర్ కు 250 రూపాయలు, మేయర్ కు 1000, రూపాయలు డిప్యూటీ మేయర్ కు ఏడు వందల యాభై రూపాయల గౌరవ వేతనం ఇచ్చేవారు. 2018లో చేసిన సవరణ ప్రకారం మేయర్ వేతనం 30,000 కు డిప్యూటీ మేయర్ వేతనం 20 వేలకు పెరిగింది.

మున్సిపాలిటీలకు సైతం

మున్సిపాలిటీ లను సైతం రాష్ట్ర ప్రభుత్వం 5 గ్రేడ్లుగా విభజించి ఉంది. గ్రామ పంచాయతీ నుంచి మొదట నగర పంచాయతీగా, తర్వాత గ్రేడ్-3 మున్సిపాలిటీగా మారుతుంది. గ్రేట్ 2 గ్రేడ్-1 తర్వాత, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందుతుంది. దాని తర్వాత సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా చివరి అంకం పూర్తి చేసుకొని తర్వాత నగరపాలక సంస్థ అవుతుంది. పెరుగుతున్న జనాభా, మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ గ్రేడ్లు పెరుగుతూ వెళతాయి. మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ గ్రేడ్ లకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేస్తుంది. అయితే మున్సిపాలిటీలకు సంబంధించి గౌరవ వేతనాలు కౌన్సిలర్ లకు మున్సిపల్ చైర్మన్ అప్పటి ఆర్థిక పరిస్థితి అనుగుణంగా నిర్ణయిస్తారు. దీనిని ప్రభుత్వానికి పంపి తగిన అనుమతి తీసుకొని వేతనాలు ఇస్తారు. కాబట్టి ఇవి మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp