అయ్యో సాక్షి

By Amar S Dec. 11, 2019, 01:28 pm IST
అయ్యో  సాక్షి

పేదలకు నాణ్యమైన బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించాం.. ఈ బియ్యాన్ని పేదలు అమ్ముకోకుండా తినగలిగేలా ఇస్తున్నాం. శ్రీకాకుళంలోనే కాకుండా రాష్ట్రమంతటా ఎందుకు అమలు చేయడం లేదని టీడీపీ వాళ్లే అడుగుతున్నారు. దీన్నిబట్టి అక్కడ నాణ్యమైన బియ్యం ఇస్తున్నామని వారు కూడా ఒప్పుకుంటున్నట్లే కదా.. ఏప్రిల్‌ నెలనుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా విస్తరింపచేసేందుకు అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్నాం. "సన్నబియ్యం ఇస్తామని సాక్షి పేపర్‌లో వచ్చిందని చెబుతున్నారు.. సాక్షిలో ఆ విషయం తప్పుగా రాశారు.. నాణ్యమైన బియ్యానికీ, సన్న బియ్యానికీ తేడా తెలియని మాదిరిగా సాక్షి వాళ్లు కూడా కన్ఫ్యూజ్‌ అయ్యారు. మిగతా పత్రికల్లో ఏం రాశారో గమనించండి.. జ్ఞానోదయం అవుతుంది" అంటూ సాక్ష్యాత్తూ నిండు సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి తన సొంత మీడియా సంస్థ అయిన సాక్షిపత్రిక గురించి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

వచ్చే ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర మంతటా పేదలకు నాణ్యమైన స్వర్ణ బియ్యాన్ని అందిస్తామని సీఎం జగన్ మంగళవారం శాసనసభలో తెలిపారు. తమ మేనిఫెస్టోలో లేని ఈపథకంకోసం అదనంగా రూ.1,400 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. సన్నబియ్యం ఇస్తామని చెప్పి మాట మార్చారంటూ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పేదలకు సన్నబియ్యం ఇస్తుందని సాక్షిపత్రిక తప్పుగా రాసిందని వివరణ ఇచ్చారు. ఇదే అంశంపై ఇతర పత్రికలు రాసిన వార్తలుకూడా చదివి జ్ఞానం పెంచుకోవాలన్నారు.

Read Also: అట్ట ముక్కల పై దేవుళ్ళ చిత్రాలు - రేషన్ డీలర్లు చేస్తున్నదేమిటి..?

సభాసాక్షిగా ఈ వ్యాఖ్యలు చేయడంతో సాక్షిపత్రిక తప్పుడు వార్తలు రాస్తుందా.? ఆ పత్రికను చదవొద్దా.? అంటూ టీడీపీ సభ్యులు సీఎంను ప్రశ్నించారు. అయితే వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పేదలందరికీ సన్నబియ్యం ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారని సాక్షి రాసింది. అయితే ఆ హామీమేరకు సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదంటూ టీడీపీ శాసనసభ్యులైన అచ్చెన్నాయుడు, రామానాయుడు ప్రశ్నించారు. దీనిపై ముందు మంత్రి కొడాలి నాని సమాధానం ఇచ్చారు. తాము ఎప్పుడూ సన్నబియ్యం ఇస్తామని చెప్పలేదని, పేదలు తినగలిగేలా నాణ్యమైన బియ్యం ఇస్తామని, ఈమేరకు శ్రీకాకుళం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభించామని తెలిపారు. అయితే సన్నబియ్యం ఇస్తామని జగన్‌ చెప్పారని, సీఎం అయ్యాక అదే నిర్ణయం తీసుకున్నారని తమవద్ద ఆధారాలున్నాయని అచ్చెన్నాయుడు చెప్పారు. మాట తప్పం, మడమ తిప్పం అనే వారు ఇచ్చిన మాట ఎందుకు తప్పారని ప్రశ్నించారు. రామానాయుడు మాట్లాడుతూ అక్టోబరు 5న సీఎం సమీక్ష అనంతరం, పేదలకు సన్నబియ్యం ఇవ్వనున్నారని సాక్షి పత్రిక రాసిందని గుర్తుచేశారు. పేపర్‌ క్లిప్పును అసెంబ్లీలో ప్రదర్శించారు.

దీనిపై స్పీకర్‌ జోక్యం చేసుకొని పేపర్‌లో చాలా వస్తాయి.. మీ అభిప్రాయం చెప్పాలన్నారు. దీంతో సన్నబియ్యంపై ప్రభుత్వం మాటతప్పిందని, సాక్షి పత్రిలో వచ్చిన వార్తే ఇందుకు సాక్ష్యం అంటూ రామానాయుడు క్లిప్పింగ్‌ను ఎత్తిచూపారు. దీనిపై జగన్ మాట్లాడుతూ.. ‘అధ్యక్షా.. ఇదీ మా మేనిఫెస్టో.. పాదయాత్రలో ప్రజల నుంచి సూచనలు తీసుకున్నాం.. ఎన్నికలకు వెళ్లేముందు దీన్ని విడుదల చేసాం.. టీడీపీ వాళ్లకు మేనిఫెస్టో మీద గౌరవం లేదు.. దాన్ని చెత్తబుట్టలో వేశారు. ప్రజలు కొడతారని ఆన్‌లైన్‌ నుంచి కూడా తీసేసారు.. కానీ మా మేనిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత. ఇందులో ప్రతిదీ చేస్తామని చెప్పి ఓట్లడిగాం.. ఈబియ్యం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదు. అసలు మేనిఫెస్టోలో చెప్పని కార్యక్రమాన్ని చేసి చూపించాలని, ప్రజలకు మంచి చెయ్యాలనే తపన, తాపత్రయంతో ఉన్నామనేది ముందుగా అర్థం చేసుకోవాలని జగన్ కోరారు. ఏప్రిల్‌ 14నుంచి రాష్ట్రం అంతా నాణ్యమైన బియ్యం ఇస్తాం.. ఇందుకు అదనంగా 1400 కోట్ల ఖర్చవుతుందని సీఎం చెప్పారు. పౌరసరఫరాల శాఖపై తాను సమీక్షించి పేదలకు నాణ్యమైన బియ్యం అందించాలని ఆదేశిస్తే సన్నబియ్యం ఇవ్వనున్నామని సాక్షిలో తప్పుగా రాసారని జగన్‌ అన్నారు.

Read Also: కాంగ్రెస్‌ పెద్దన్న బిజెపి

ఈ సందర్భంగా సాక్షిని చూపిస్తూ.. సాక్షి గజిట్‌ అని, సన్నబియ్యం ఇస్తారని వచ్చిందని చెబుతున్నారు. సాక్షిలో తప్పు రాశారు.. అదేరోజు వేరే పేపర్‌లలో వచ్చింది. ఒకసారి వాటిని చూస్తే సంతోష పడతాను. సాక్షివారు మీమాదిరిగానే కన్ఫ్యూజ్‌ అయ్యారు.. నాణ్యమైన బియ్యానికీ, సన్న బియ్యానికీ తేడా తెలియక వాళ్లు కన్ఫ్యూజ్‌ అయ్యారన్నారు. మీకు తెలియకపోతే, మిగతా పేపర్లలో ఏమిరాశారో గమనించండి. మీక్కూడా కాస్తా అర్థమవుతుంది. జ్ఞానోదయం అవుతుంది. నాలెడ్జి కాస్త పెరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు.

దీనిపై రామానాయుడు జోక్యం చేసుకుని సాక్షి తప్పుడు వార్తలు రాస్తోందా.? దాన్ని చదవొద్దంటారా.? అని ప్రశ్నించారు. దీనిపై సీఎం చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయారు కానీ బదులివ్వలేదు.. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ప్రభుత్వం అమలు చేస్తోంటే జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం అన్నారు. ఆర్థికమంత్రి బుగ్గన మాట్లాడుతూ టీడీపీ హయాంలో పౌరసరఫరాల కార్పొరేషన్‌ను అప్పులపాలు చేశారని ఆరోపించారు. మంత్రి కొడాలి నాని జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో సన్న బియ్యం అనే పేరు లేదని జగన్‌ మరోసారి వివరణ ఇవ్వగా స్వర్ణ రకాన్నే సన్నబియ్యం అంటారని, దీనిపై మంత్రి శ్రీ రంగనాథరాజు తెలిపారు. బియ్యంలో 7029, 1121 సన్నరకాలని, 1010, 1001 దొడ్డు రకాలని చెప్పారు. రైతులు 7029, 1121 రకాలు సాగుచేస్తున్నారని, అవి నాణ్యమైన బియ్యమన్నారు.

Read Also: వైశ్రాయ్ ఉదంతం తర్వాత ఆరోజు అసెంబ్లీలో ఏం జరిగింది???

మొత్తం మ్మీద సాక్షి పత్రిక చేసిన నిర్వాకం వల్ల ముఖ్యమంత్రి, కేబినేట్ మంత్రులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాగా.. అత్యంత విలువైన సభాసమయం మొత్తం దీనిపై చర్చించాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు విపక్షానికి పెద్ద ఆయుధం దొరికినట్టు అయ్యింది. టీడీపీ సాక్షి క్లిప్పింగ్ ను చూపి సీఎం జగన్ ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించే పరిస్థితి రావడం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి కలిగింది. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp