తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు లీగల్ నోటీసు ఇచ్చిన సచిన్ పైలెట్

By Srinivas Racharla Jul. 22, 2020, 12:28 pm IST
తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు లీగల్ నోటీసు ఇచ్చిన సచిన్ పైలెట్


రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం డైరీ సీరియల్ వలె మరికొన్ని రోజులు కొనసాగనుంది.ప్రస్తుతం హైకోర్టులో ఉన్న 18 మంది రెబల్ ఎమ్మెల్యేల అనర్హత బంతి జూలై 24 తర్వాతనే స్పీకర్ సీసీ జోషి చేతికి వచ్చే అవకాశం ఉంది.అయితే సీఎం అశోక్ గహ్లోత్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగ తనపై చేసిన ఆరోపణలతో సచిన్ పైలెట్ మరోసారి న్యాయస్థానం తలుపు తట్టడానికి సిద్ధమయ్యాడు.

హైకోర్టు తీర్పుతో తాత్కాలిక ఊరట పొందిన మాజీ పిసిసి అధ్యక్షుడు సచిన్ పైలట్‌‌పై సీఎం అశోక్ గహ్లోత్‌ విమర్శల తీవ్రతను పెంచారు.కాంగ్రెస్ క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగ తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌‌పై హార్స్ ట్రేడింగ్‌కు సంబంధించి ఆరోపణలు చేశాడు. గత జూన్ 19 న జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా బిజెపిలో చేరితే తనకు రూ.35 కోట్లు ఇప్పిస్తానని పైలట్ ఆఫర్ చేసినట్లు ఆరోపించాడు.

సోమవారం మీడియాతో ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగ మాట్లాడుతూ,"తనతో సచిన్ పైలట్‌ మాట్లాడిన సందర్భంగా నువ్వెంత ఆశిస్తున్నావ్..? అని అడిగారు.నేను మౌనంగా ఉండేసరికి వెంటనే రూ. 35 కోట్లు అంటూ ఆఫర్ చేశారని పేర్కొన్నారు.అయితే ఆయన ఆఫర్‌ను తాను తిరస్కరించి,ఈ విషయాన్ని సీఎం గహ్లోత్‌ దృష్టికి తీసుకు వెళ్ళాను.నేను పైలట్‌తో రెండు మూడు సార్లు మాట్లాడాను.ఇంకా గత డిసెంబర్ నుండి గహ్లోత్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర జరుగుతుంది.ఇది ఇప్పుడే మొదలైనది కాదు" అని సంచలన ఆరోపణలు చేశాడు.

కాగా తనపై ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ చేసిన ఆరోపణలను సచిన్ పైలట్ తీవ్రంగా పరిగణించాడు. తాజాగా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆ ఎమ్మెల్యేకు లీగల్ నోటీస్ ఇచ్చారు.ఆ నోటీసులో తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి,తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని మాజీ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.అలాగే ఎమ్మెల్యే ఆరోపణలు నన్ను మానసిక క్షోభకు గురి చేశాయని తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఉన్న సన్నిహితం వలన అసమ్మతి నేత సచిన్ పైలెట్ విషయంలో అధిష్ఠానం వేచిచూసే ధోరణి అవలంబిస్తోంది.కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చాల్సిందేనని భీష్మించి కూర్చున్న సచిన్ పైలెట్ తన పట్టును వదలటం లేదు.

ఇక రాజస్థాన్ రాజకీయ సంక్షోభ పరిష్కారం హైకోర్టు శుక్రవారం వెలువరించే తీర్పుపై ఆధారపడింది. నిన్నటి హైకోర్టు తీర్పుతో ఢిల్లీ హైవేలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ మరో మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఆ లోపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp