శాసనసభలో రూల్స్ రగడ..

By iDream Nagaraju Dec. 12, 2019, 12:04 pm IST
శాసనసభలో రూల్స్ రగడ..

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నాలగవరోజు సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుతో సహా ఇతర సభ్యులను అసెంబ్లీ గేటు వద్ద సెక్యురిటి సిబ్బంది అడ్డుకున్నారని, చేతిలో ప్లకార్డులు, బ్యానర్లు లాక్కున్నారని అంతటితో ఆగకుండా మ్యాన్ హ్యండ్లింగ్ చేశారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పైనా మాజీ మంత్రులపైనా ఇలాంటి దాడి సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అసెంబ్లీ రూల్స్ బుక్ చదివి వినింపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో యనమల రామకృష్ణ స్పీకర్ గా ఉన్న సమయంలో విడుదల చేసిన రూల్స్ బుక్ లో ఉన్న నిబందనలనే మనమంతా పాటిస్తున్నామని గుర్తుచేశారు. సభలో చర్చ జరగనీయకుండా అడ్డుకునేందుకే తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని అందుకే సభలో ప్రవేశించిన వెంటనే స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేశారని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సభలో బిల్లులు చర్చకు వస్తున్నాయని, అది ఇష్టం లేని టిడిపి సభ్యులు ప్రీ ప్లాన్డ్ గా సభను అడ్డుకునేందుకు ఇలాంటి గొడవలకు దిగుతున్నారని మండిపడ్డారు.

దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ రూల్స్ ఎప్పటి నుండో ఉన్నాయని.. గతంలో మీరు 2014లో ప్రతిపక్షంలో ఉండగా ఎన్నిసార్లు ప్లకార్డులు తీసుకుని సభలో ప్రవేశించలేదని ప్రశ్నించారు. వైసీపి సభ్యులు ప్రతిపక్షంలో ఉండగా బల్లలు ఎక్కి మరీ అల్లరి చేసేవారని, సభలో ఇప్పుడు బిల్లులు చర్చకు వస్తున్నాయంటే అర్ధం.. తాము సహకరిస్తున్నాం కాబట్టే అసెంబ్లీ సజావుగా సాగుతుందని ఇది మీరు గుర్తించాలని అచ్చెన్నాయుడు అన్నారు. మీరు గతంలో సహకరించలేదు కాబట్టే బిల్లులు చర్చకు రాలేదని చెప్పుకొచ్చారు. మా హక్కులు కాపాడాలని స్పీకర్ ను కోరారు. యాభై నిమిషాలు గేలు దగ్గర నిలబెట్టి దాడికి దిగారని.. సభను వాయిదా వేసి సెక్యురిటి సిబ్బందిని పిలిపించి.. విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము సభలో ఉండటం దండగ అన్నారు అచ్చెన్నాయుడు. దానికి స్పందించిన స్పీకర్ మీకు జరిగిన విషయాన్ని చెప్పారు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తామన్నారు. సభలో ఉండము అని అంటే అది మీ ఇష్టమన్నారు. ఎంతో సజావుగా సభ నడుస్తుంటే, కావాలని టిడిపి సభ్యులు సభను జరగనివ్వకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని చీప్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గతంలో సభ సంప్రదాయాలను ఎలా తుంగలో తొక్కారో ప్రజలు చూశారని, గతంలో చెవిరెడ్డిపైనా, రోజాపైనా దాడికి దిగిన సందర్భాలను గుర్తుచేశారు.

డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ సభా హక్కుల గురించి అచ్చెన్న మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించ్చినట్లు ఉందని అన్నారు. నాడు నిండు సభలో మహిళా ఎమ్మెల్యే రోజా ను అవమానించి అసెంబ్లీ రూల్స్ కు వ్యతిరేకంగా ఏడాది పాటు అకారణంగా సస్పెండ్ చేసినపుడు అచ్చెన్న గారికి అసెంబ్లీ రూల్స్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అయితే అప్పుడే హౌసులో ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో లో అచ్చెన్న కు కౌంటర్ ఇచ్చారు . గతం లో అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తనను సస్పెండ్ చేస్తే మీకు రూల్స్ గుర్తు రాలేదా అని గుర్తు చేశారు. చివరకు తాను హైకోర్టు కు వెళ్లి అనుమతి తెచ్చుకున్నా సభలోకి అనుమతించకుండా మార్షల్స్ తో నెట్టివేయించినపుడు రూల్స్ గుర్తుకు రాలేదా అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చకు పట్టుపట్టిందుకు అన అనవసరంగా తనను సభ నుండి సస్పెండ్ చేశారని ఆవేదన చెందుతూ మాట్లాడారు. ఇప్పుడు రూల్స్ గురించి మాట్లాడుతున్నారని, చంద్రబాబు ను చూస్తే ప్రతిపక్ష నేతో పనికిమాలిన నేతో అర్ధం కావడం లేదని అన్నారు.

ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ గతం లో తనపై అసెంబ్లీ సాక్షిగా గా మార్షల్స్ తో దాడి చేయించారని, ఆ దాడిలో నేను బ్రతకను అని అనుకున్నానని, ఆ ఏడు కొండల స్వామి దయతో తాను బతికానని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పుట్టిన చంద్ర గిరి నియోజకవర్గం లో పుట్టడమే నేను చేసిన పాపమా అని ప్రశ్నించారు. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో నన్ను ఉంచి, ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులతో కొట్టించారని, ఆ విషయం సభలో చెప్పడానికి కూడా సిగ్గు చేస్తున్నానని అన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడు...తాను టీడీపీ నీ వీడి వైఎస్సార్సీపీ లోకి వస్తున్న సందర్భంగా నువ్వు వైఎస్సార్సీపీ లోకి వెళ్లి ఏం బాగు పడతావో చూస్తానని సవాల్ చేశారని, తాను మంత్రిని చూపిస్తానని అనాడే బాబుకి చెప్పానని అన్నారు. అమరావతి పర్యటనకు వెళ్లిన చంద్రబాబు పై ప్రజలు చెప్పులు వేస్తుంటే తనకు నాటి వైస్రాయ్ హోటల్ సంఘటన గుర్తుకు వచ్చిందని అన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp