రేప్ ఇన్ ఇండియాపై రభస

By Amar S Dec. 14, 2019, 10:48 am IST
రేప్ ఇన్ ఇండియాపై రభస

రేప్ ఇన్ ఇండియా అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యపై తీవ్ర వివాదం రేగింది. సభను హోరెత్తించింది. సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోదీ మేకిన్‌ ఇండియా గురించి పదేపదే చెబుతారు. అది గొప్ప పథకం అనుకుంటాం. కానీ ఇపుడు పేపరు తిరగేస్తే చాలు. అత్యాచారాలకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి.! బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే తీరు.. ఇపుడు మేకిన్‌ ఇండియా కాదు. రేప్‌ ఇన్‌ ఇండియా అన్నది కనిపిస్తోందిని జార్ఖండ్‌ ఎన్నికల సభలో రాహుల్ పేర్కొన్నారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. రేప్‌ను రాజకీయం చేస్తారా అంటూ గళమెత్తింది. ఈ విషయాన్ని ఎలక్షన్‌ కమీషన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లింది. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ తాను ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణలు చెప్పనన్నారు. గతంలో మోడీ ఢిల్లీని రేప్‌ల రాజధాని అనలేదా అని ఎదురుదాడికి చేసారు. అంతేకాదు మోడి రేప్ ల రాజధాని అని ఢిల్లీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ బయట పెట్టారు. జార్ఖండ్‌ ఎన్నికల సభలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తమకు అనుకూలంగా మల్చుకుంది. 2001లో పార్లమెంట్‌ పై దాడి ఘటనలో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించాక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ జార్ఘండ్ లో రాహుల్ వ్యాఖ్యల అంశాన్ని ప్రస్తావించి చాలామంది మహిళా ఎంపీలు దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చారన్నారు.

దాంతో స్మృతీ ఇరానీ లేచి రాహుల్‌ మహిళలను అవమాన పరిచారు. దేశంలోని మహిళలందరిపై అత్యాచారం జరగాలని పిలుపిచ్చారు. ఇది ఘోరం. రేప్‌ అంటే ఓ మహిళ పడే బాధ. తట్టుకోలేని పరిస్థితి. దీన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటారా.? రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే’ అని డిమాండ్‌ చేశారు. రాజ్ నాధ్ మాట్లాడుతూ మేకిన్‌ ఇండియా యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రారంభించిన పథకం. దీన్ని రాహుల్‌ అలా అభివర్ణించారంటే ఆయన పార్లమెంట్‌ సభ్యుడిగా ఉండే నైతిక అర్హత కోల్పోయారన్నారు. రాహుల్‌ మాటలు వింటుంటే రోత పుడుతోందని నిర్మలా సీతారామన్‌ సహా పలువురు మహిళా ఎంపీలు వ్యాఖ్యానించారు. దీనిపై మీరేమంటారని మంత్రి ప్రహ్లాద్‌ జోషి కనిమొళి, సుప్రియా సూలేలను ప్రశ్నించగా అవి సభ బయట దేశమంతా ఉన్న పరిస్థితిపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలేనని, దానికి ఆయన సభలో క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

దీనిపై రాహుల్ స్పందిస్తూ దేశంలో మహిళలపై అత్యాచారాలు ఎన్ని జరుగుతున్నా ప్రధాని మాట్లాడడం లేదని విమర్శించారు. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదంతో ఈశాన్య రాష్ట్రాలు భగభగ మండిపోతున్నాయి. వాటి దృష్టి మరల్చేందుకే బీజేపీ ఈ రభస చేస్తోందన్నారు. ఎక్కడ చూసినా రేప్‌లే. ఇది రేప్‌ ఇన్‌ ఇండియా. యూపీలో ఓ బీజేపీ మంత్రి మహిళపై అకృత్యానికి పాల్పడ్డాడు. కారులో వెళుతున్న ఆమెను, బంధువులను లారీతో ఢీకొట్టించాడు. ఎక్కడా మహిళకు భద్రత లేదని జార్ఖండ్‌ సభలో తాను అన్నట్లు రాహుల్‌ వివరణ ఇచ్చారు. ఈశాన్యంలో మంటలు రేపినందుకు, దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసినందుకు, ఢిల్లీని రేప్‌ల రాజధాని అన్నందుకు మోడినే క్షమాపణలు చెప్పాలని రాహుల్ ట్వీట్‌ చేశారు. ‘నేను చేసిన వ్యాఖ్యను, ప్రధాని గతంలో చేసిన కామెంట్‌ను ట్విటర్‌లో పెట్టాను. ఈదేశ ప్రజలంతా చూడొచ్చు. ఎవరిది తప్పో.. అన్నారాయన.. దేశంలో మహిళలందరిపైనా అత్యాచారాలు జరపాలని తాను అన్నట్టుగా స్మృతీ ఇరానీ పేర్కొనడం పచ్చి అబద్ధమని, తన మాటలను ఆమె వక్రీకరించారని రాహుల్ విమర్శించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp